ప్రజలారా.. ఆలోచించండి
ఇలాంటి తెలంగాణ కోసమే పోరాడారా: జానా
సాక్షి, హైదరాబాద్: ‘‘బెదిరింపులు, ప్రలోభాలతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతోంది. ఆ పార్టీ సాధిస్తున్న విజయాల్లో ఏది విజయమో, ఏది బలవంతమో తెలియని గందరగోళం నెలకొంది. కేవలం అభివృద్ధికి ఆకర్షితులై ఆ పార్టీలో చేరుతున్నట్లు కట్టుకథలు చెప్పిస్తున్నారు. అసలు కారణాలేంటో అందరికీ తెలుసు’’ అంటూ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి మండిపడ్డారు. ‘‘ప్రజలారా..! ఆలోచించండి. మీరు పోరాడింది ఇలాంటి తెలంగాణ కోసమేనా? మమ్మల్ని త్యాగాలు చేయమన్నది దీని కోసమేనా? ఈ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పాలి’’ అని పిలుపునిచ్చారు.
టీఆర్‌ఎస్‌లో చేరేవారితో కనీసం పాత పార్టీకి రాజీనామా చేయించడం లేదని, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏమాత్రం అమలు కావడం లేదని ఆవేదన వెలిబుచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న స్థానిక కోటా శాసనమండలి ఎన్నికల్లో ఆదిలాబాద్, కరీంనగర్ మినహా రాష్ట్రంలోని ఇతర ఏడు జిల్లాల్లో గెలిచేందుకు టీఆర్‌ఎస్‌కు ఏమాత్రమూ బలం లేదని జానా అన్నారు. అయినా ఆ ఏడు జిల్లాల్లో సైతం గెలుస్తామని ఆ పార్టీ నేతలు ఘంటాపథంగా చెప్పుకోవడం బెదిరింపు రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఖమ్మంలో టీఆర్‌ఎస్‌కు కేవలం నలుగురు ఎంపీటీసీలే ఉన్నా, ‘ఎమ్మెల్సీ స్థానాన్ని మా పార్టీ (టీఆర్‌ఎస్) గెలుచుకుంటుంది’ అని ఆ జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొనడం తగదన్నారు.
‘‘కేవలం నలుగురు సభ్యులతో అక్కడ ఎలా గెలుస్తారు ? ఎన్ని పార్టీలనైనా ప్రలోభపెడతారా?’’ అని ప్రశ్నించారు. ఖమ్మంతో పాటు మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌తో పోల్చితే కాంగ్రెస్ పార్టీకే ఎక్కువగా స్థానిక సంస్థల ఓటర్ల సంఖ్యా బలం ఉందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు అంతకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ను ఏకపక్షంగా గెలిపించారని గుర్తు చేశారు. ‘‘సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి అభివృద్ధి పనుల విషయంలో మేం సహకరిస్తున్నాం.
కానీ అందుకు ప్రతిఫలంగా టీఆర్‌ఎస్ మాత్రం ప్రలోభాలతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ‘‘అభివృద్ధి కోసం పార్టీ ఫిరాయింపులు తగవు. ప్రజాస్వామ్య అభివృద్ధే అసలైన అభివృద్ధి’’ అంటూ హితవు పలికారు. హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు నిర్మిస్తామంటూ జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మంత్రి కేటీఆర్ హామీ ఇవ్వడాన్ని ప్రశ్నించినందుకే తనకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఆరోపించారు.