రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పెరిగిన మానవాభివృద్ధి రేటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొదటిసారిగా మానవాభివృద్ధి నివేదికను ప్రణాళిక విభాగం విడుదల చేసింది. జిల్లాల వారీగా మానవాభివృద్ధి ర్యాంకులు, అభివృద్ధి సూచికలను ఇం దులో పొందుపరిచింది. రాష్ట్ర ప్రణాళిక విభాగం, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్(సెస్) సంయుక్తంగా ‘హ్యూమన్ డెవెలప్‌మెంట్ ఇన్ తెలంగాణ స్టేట్: డిస్ట్రిక్ ప్రొఫైల్స్’ పేరుతో ఈ నివేదికను ప్రచురించింది.
రాష్ట్రంలోని పది జిల్లాల్లో 2004-05, 2011-12 సంవత్సరాలకు సంబంధించి మానవాభివృద్ధి సూచీ(హెచ్‌డీఐ)లు, జిల్లాల వారీగా ర్యాంకులు, హెచ్‌డీఐ వృద్ధిరేటును ఇందులో వివరించారు. 2015- 16 హెచ్‌డీఐ అంచనాలను లెక్కగట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో అందుబాటులో ఉన్న గణాంకాల ఆధారంగా ప్రణాళిక విభాగం రాష్ట్రానికి ప్రత్యేకంగా ఈ నివేదికను తయారు చేసింది. దశాబ్దం కిందటి గణాంకాలతో పోలిస్తే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ మానవాభివృద్ధి సూచీ విలువలు పెరిగాయి.
హెచ్‌డీఐ ర్యాంకుల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉండగా సీఎం సొంత జిల్లా మెదక్ రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉంది. ‘‘గతంలో తయారు చేసిన మానవాభివృద్ధి సూచీలకు భిన్నంగా ఈసారి జిల్లాల వారీగా హెచ్‌డీఐ వివరాలు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పెంపొందించటం, అక్షరాస్యత, అసమానతలు తొల గించటం, ఆయుర్దాయం పెంపునకు ఈ నమూనా దోహదపడుతుంది. ఈ ఏడాది హెచ్‌డీఐ నివేదికలను మండలాలవారీగా, వీలైతే గ్రామ స్థాయిలో తయారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నాం’’ అని ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి బీపీ ఆచార్య వెల్లడించారు.
తలసరి ఆదా యం, ఆయుర్దాయం, అక్షరాస్యత, సామాజిక భద్రత, పేదరికం, అసమానతలను ప్రధాన ప్రామాణికాలుగా తీసుకొని మానవ అభివృద్ధి సూచీని లెక్కిస్తారు. యూఎన్‌డీపీ (యునెటైడ్ నేషన్స్ డవలప్‌మెంట్ ప్రాజెక్టు) అనుసరించిన పద్ధతిలోనే ఈ నివేదికను రూపొందించారు.
అక్షరాస్యత, శిశు మరణాల అంశంలో హెచ్‌డీఐ విలువ పురోగతిని సూచిస్తున్నప్పటికీ ఆశించినంత వేగంగా మార్పు రావడం లేదని నివేదిక స్పష్టంచేసింది. అందుకే విద్య, వైద్యంపై ప్రభుత్వం చేసే ఖర్చును సైతం ఈ నివేదికలో ప్రస్తావించింది. 2004-2011 మధ్య కాలంలో తెలంగాణలో వైద్యం కంటే విద్యపై ఖర్చు చేసిన మొత్తం ఎక్కువని నిర్ధారించింది. ఈ మధ్య కాలంలో మొత్తం బడ్జెట్‌లో కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో 60-64 శాతం విద్య, వైద్యానికి ఖర్చు చేసినట్లు పేర్కొంది.
కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో ఈ ఖర్చు 60% లోపే ఉంది. కరీంనగర్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో విద్యకు ఎక్కువ ఖర్చు చేయగా రంగారెడ్డి జిల్లాలో అతి తక్కువగా 32 శాతం నిధులే ఖర్చు చేశారు. వైద్యానికి ప్రభుత్వం చేసే ఖర్చు ఆదిలాబాద్ మినహా అన్ని జిల్లాల్లో 2004 నుంచి 2013 వరకు క్రమంగా తగ్గిపోయింది. 2010-2013 మధ్య కాలంలో ఆదిలాబాద్, వరంగల్, మెదక్ మినహా అన్ని జిల్లాల్లో సామాజిక రంగానికి చేసిన ఖర్చుల్లో వైద్యానికి అయిదు శాతం లోపునే వెచ్చించడం గమనార్హం.
కొత్త రాష్ట్రంలో మారిన ర్యాంకులు
గతంతో పోలిస్తే 2015-16 హెచ్‌డీఐ అంచనాల్లో జిల్లాల వారీ ర్యాంకులు స్వల్పంగా మారిపోయాయి. 2011లో ర్యాంకుల వరుసలో వెనుకబడ్డ ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ ఇప్పుడు ముందుకు వచ్చాయి. అప్పుడు ముందున్న కరీంనగర్, వరంగల్, నల్లగొండ జిల్లాలు కొత్త రాష్ట్రం వచ్చాక కాస్త వెనుకబడ్డాయి. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాలు మొదటి అయిదు స్థానాల్లో నిలిచాయి. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో 2004 నుంచి 2011 వరకు హెచ్‌డీఐ విలువ సగటున 8.3 శాతం పెరిగింది. 2015-16లో మరో 0.663 శాతం పెరుగుతుందని అంచనా వేశారు.
మానవాభివృద్ధి సూచీ పరుగులు
Published Fri, Apr 22 2016 2:18 AM | Last Updated on Sun, Sep 3 2017 10:26 PM
Advertisement
Advertisement