రాముడు కాదు రాక్షసుడు..
రాముడు కాదు రాక్షసుడు..
Published Sat, Aug 5 2017 6:55 AM | Last Updated on Mon, Jul 30 2018 8:37 PM
♦ అక్రమ సంబంధానికి భార్య అడ్డుగా ఉందనే హత్య
♦ ఓ యువతితో వివాహేతర సంబంధం
పహాడీషరీఫ్: పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అదృశ్యమై యాచారం అడవుల్లో ప్రత్యేక్షమైన మహిళ హత్యోదంతంలో కొత్త కోణం వెలుగుజూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని భార్యను కడతేర్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడు మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపించడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఆది నుంచి వక్రబుద్ధే..
ఆమనగల్లు మండలం పలుగుతాండకు చెందిన రామావత్ శ్రీరామ్ నాయక్‌కు ఐదేళ్ల క్రితం జడ్చర్ల మండలం, నేలబండ తాండకు చెందిన లలిత(23)తో వివాహం జరిగింది. మూడేళ్ల క్రితం తుక్కుగూడకు వలస వచ్చిన శ్రీరామ్ ఓ కంపెనీలో ఆఫీస్ బాయిగా పని చేస్తూ భార్య, ఇద్దరు కుమారులు ప్రవీణ్(3), అఖిల్(1.5 సంవత్సరాలు)తో కలి ఉంటున్నాడు. నిందితుడు సొంత ఊరిలో ఏడాది క్రితం ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించడంతో స్థానికులు పట్టుకుని రూ.40 వేలు జరిమానా విధించారన్నారు. దీంతో అతని భార్య లలిత బంగారు పుస్తెల తాడును విక్రయించి చెల్లించిందని మృతురాలి తల్లిదండ్రులు దస్రూనాయక్, తల్లి జానకి తెలిపారు.
నిద్రమాత్రలు మింగించి చంపేందుకు కుట్ర..
తుక్కుగూడలో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్న శ్రీరామ్ తమ కుమార్తె అడ్డుతొలగించుకునేందుకే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆమె తల్లితండ్రులు తెలిపారు. సదరు యువతికి ఆస్తి ఉన్నందున ఈ దారుణానికి ఒడిగట్టాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది భార్యతో పాటు చిన్న కుమారుడు అఖిల్‌కు 12 నిద్ర మాత్రలు మింగించి చంపేందుకు ప్రయత్నించగా, అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తీసుకెళ్లి బతికించుకున్నట్లు తెలిపారు. లలితను హత్య చేయాలని భావించిన శ్రీరామ్ గత కొన్ని రోజుల నుంచి ఆమెపై చెడుగా ప్రచారం చేస్తున్నాడు.
లలితకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని శ్రీరామ్ తన కుటుంబ సభ్యులను తప్పుదోవ పట్టించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ నెల 31న ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్న నిందితుడు అనుమానం రాకుండా కొద్ది రోజులుగా లలితతో మంచిగా ఉన్నాడు. 31న పెద్ద కుమారుడితో పాటు, చిన్న కుమారుడు అఖిల్‌ను కూడా బలవంతంగా(పాఠశాల నిర్వాహకులు వారించినా) స్కూల్‌కు పంపాడు. అనంతరం ఆమెను తీసుకెళ్లి హత్య చేశాడు. తన భార్యను చంపేందుకు సహకరించాలని సోదరుడు మల్లేష్ అలియాస్ మణిపాల్, స్నేహితులు సతీష్, తరుణ్, మరో మహిళ సహకారం కోరినట్లు తెలిపారు. హత్య అనంతరం అదేరోజు రాత్రి ఇద్దరు కుమారులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య ఎవరితో వెళ్లిపోయిందంటూ ఫిర్యాదు చేశాడు.
నిందితుడి రిమాండ్
నిందితుడు శ్రీరామ్ నాయక్‌ను పహాడీషరీఫ్ పోలీసులు అరెస్ట్ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. నిందితుడికి సహకరించిన అతని సోదరుడు మల్లేష్ అలియాస్ మణిపాల్, స్నేహితులు సతీష్, తరుణ్, మరో మహిళ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.
Advertisement