ప్రమాదకర స్థాయికి హుస్సేన్ సాగర్
హైదరాబాద్: భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. హుస్సేన్ సాగర్లో నీటి మట్టం అనూహ్యంగా నాలుగు అడుగుల మేర పెరిగింది. దీంతో హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేయనున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆకాశానికి చిల్లు పడినట్టుగా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రవాణా వ్యవస్థ స్తంభించింది. రహదారులపైకి నీరు చేరడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల వాహనాలు నీట మునిగాయి. వర్షాల కారణంగా పలు ఎంఎంటీస్ రైళ్లను రద్దు చేశారు. రాజ్భవన్ సమీపంలో రైలు పట్టాలు నీటిలో ముగినిపోయాయి.