చెవికి చిల్లులే...
- ధ్వని కాలుష్యంలో గ్రేటర్ నాలుగో స్థానం
- యువతలో వినికిడి శక్తి తగ్గుతోందంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: లక్షల్లో దూసుకుపోతున్న వాహనాలు... కుర్రకారు వాడే ఆధునిక హారన్లు... రణగొణలతో సిటిజనుడి గూబ గుయ్యిమంటోంది. కాలం చెల్లిన డొక్కు బస్సులు, కార్లు... ఎక్కడ చూసినా ట్రాఫిక్ పద్మవ్యూహాలు... ధ్వని కాలుష్యంతో భాగ్యనగరి దద్దరిల్లుతోంది. దేశంలో అత్యధికంగా శబ్ద కాలుష్యం బారినపడే ఆరు మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ది నాలుగో స్థానం.
కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం దేశంలో సగటున 85 డెసిబుల్స్ శబ్ద కాలుష్యంతో ముంబై తొలి స్థానంలో నిలిచింది. ఆ తరువాతి స్థానాల్లో 80 డెసిబుల్స్‌తో ఢిల్లీ, 75 డెసిబుల్స్‌తో చెన్నై ఉన్నాయి. 73 డెసిబుల్స్ కాలుష్యంతో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. దీనిపై పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధార ణంగా మనిషి వినే శబ్ద అవధి 55 డెసిబుల్స్ ను మించరాదు. ధ్వని కాలుష్యంవల్ల యువతలో వినికిడి శక్తి 15 శాతం మేర తగ్గుతున్నట్లు ఈఎన్‌టీ వైద్య నిపుణులు చెబుతున్నారు.
నగరంలో శబ్ద కాలుష్యానికి కారణాలివే
► కుర్రకారు వినియోగించే మోడిఫైడ్ హారన్ల వల్ల శబ్ద అవధి 75 డెసిబుల్స్ కంటే అధికంగా ఉంటోంది.
► గ్రేటర్ లో వాహనాల సంఖ్య 46 లక్షలు. బయటి నుంచి నిత్యం 10 లక్షల వరకు వస్తాయి. ఇవన్నీ ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవడంతో ఏర్పడే రణగొణలతో ధ్వని రెట్టింపవుతోంది.
► మెట్రో రైలు పనుల నేపథ్యంలో భారీ నిర్మాణ యంత్ర సామగ్రి వినియోగం, స్టీలు, ఇనుప బారికేడ్లు తదితరాల వల్ల కూడా అధిక ధ్వనులు వెలువడుతున్నాయి. వివిధ నిర్మాణాల్లో జేసీబీలతో తవ్వకాలు, బోర్లు, జనరేటర్ల వినియోగం వల్లా ధ్వనులు పెరుగుతున్నాయి.
► నగరంలో కాలం చెల్లిన వాహనాలు 20 లక్షలు. ఇవన్నీ రోడ్డెక్కుతుండడంతో రణగొణలు అధికమవుతున్నాయి.
► గ్రేటర్ లో మొత్తం వాహనాలు 46 లక్షలు. అందుబాటులో ఉన్న రహదారులు 6,500కి.మీ. మాత్రమే. దీంతో రోడ్లపై ట్రాఫిక్ రద్దీ ఏర్పడి హారన్లు మోతమోగుతున్నాయి.
► డీజే సంగీత హోరుకు కూడా యువత వినికిడి శక్తి కోల్పోతోంది.
అత్యధికంగా నమోదయ్యే ప్రాంతాలు
► నగరంలో అత్యధికంగా 70 నుంచి 80 డెసిబుల్స్ శబ్ద కాలుష్యం వెలువడుతున్న జాబితాల్లో అబిడ్స్, పంజగుట్ట, జూబ్లీహి ల్స్, ప్యారడైజ్,చార్మినార్, జేబీఎస్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కూకట్‌పల్లి, జేఎన్‌టీయూ తదితర ప్రాంతాలున్నాయి. సెలైంట్ జోన్స్‌గా పరిగణించే కోర్టులు, ఆస్పత్రు లు, ప్రార్థనా స్థలాలు, జూపార్క్ వంటి ప్రాంతాల్లోనూ శబ్ద కాలుష్యం 70 డెసిబుల్స్‌ను దాటుతుండడంతో రోగులు, వణ్యప్రాణులు అవస్థలు పడుతున్నాయి.
కలిగే నష్టాలివే...
► పగటి వేళల్లో 55, రాత్రి వేళల్లో 45 డెసిబుల్స్ శబ్ద అవధిని దాటి వెలువడే శబ్దాలను ధ్వని కాలుష్యంగా పరిగణిస్తారు. దీర్ఘకాలం ఈ శబ్దాలను విన్నవారికి శాశ్వత వినికిడి లోపం వస్తుంది. నిద్రలేమి, అలసట, రక్తపోటు పెరుగుతాయి.
► నగరంలో ఈఎన్‌టీ వైద్యులను సంప్రదిస్తున్న ప్రతి వెయ్యి మందిలో 20 శాతం మందికి వినికిడి శక్తి తగ్గినట్టు గుర్తించారు.
► నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారు. వారి గుండె వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
► అత్యధిక ధ్వనులు విన్నపుడు పిల్లల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. వారిలో చురుకుదనం లోపించి బుద్ధిమాంద్యం సంభవిస్తుంది.
ఇలా కాపాడుకోవాలి
► కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం ఏ వ్యక్తి అయిన 8 గంటల పాటు నిరంతరాయంగా 85 డెసిబుల్స్‌కు మించిన శబ్దం వినకుండా జాగ్రత్తలు పాటించాలి.
► అత్యధిక శబ్దాలు వినిపించే ప్రాంతాల్లో ఇయర్‌ప్లగ్‌లు వాడాలి.
► sాఫిక్ రద్దీలో బయటికి వెళ్లేటప్పుడు హెల్మెట్‌లు, చెవుల్లో దూది పెట్టుకోవాలి.