కలల మెట్రోకు కౌంట్‌డౌన్‌ | Hyderabad metro may start soon | Sakshi
Sakshi News home page

కలల మెట్రోకు కౌంట్‌డౌన్‌

Published Tue, Dec 13 2016 3:38 AM | Last Updated on Tue, Sep 4 2018 3:39 PM

కలల మెట్రోకు కౌంట్‌డౌన్‌ - Sakshi

కలల మెట్రోకు కౌంట్‌డౌన్‌

- ఉగాది లేదా జూన్‌ 2న ప్రారంభానికి సన్నాహాలు
- ఊపందుకున్న ప్రాజెక్టు పనులు.. అత్యాధునిక హంగులతో నిర్మాణాలు
- మెట్రో ప్రారంభంతో హైదరాబాదీలకు తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు


సాక్షి, హైదరాబాద్‌:
గ్రేటర్‌ హైదరాబాద్‌ వాసుల కల త్వరలో సాకారం కానుంది. హైదరాబాదీలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. మహా నగరవాసుల ట్రాఫిక్‌ కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు తొలిదశను వచ్చే ఏడాది ఉగాది(మార్చి 29) లేదా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం.. జూన్‌ 2న ప్రారంభించేలా అడుగులు పడుతున్నాయి. నాగోల్‌–మెట్టుగూడ (8 కి.మీ.), మియాపూర్‌–ఎస్‌ఆర్‌నగర్‌(12 కి.మీ.) రూట్లలో తొలిగా మెట్రో మార్గాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఆలుగడ్డబావి, ఒలిఫెంటా బ్రిడ్జి, మెట్టుగూడ రైల్వే ఓవర్‌బ్రిడ్జీల నిర్మాణం పనులు పూర్తయిన పక్షంలో మెట్టుగూడ నుంచి బేగంపేట్‌–ప్రకాశ్‌నగర్‌ వరకు మెట్రో మార్గాన్ని ప్రారంభించే అవకాశాలున్నట్లు హైదరాబాద్‌ మెట్రో రైల్‌(హెచ్‌ఎంఆర్‌) వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. నాగోల్‌–రాయదుర్గం, ఎల్బీనగర్‌–మియాపూర్, జేబీఎస్‌–ఫలక్‌నుమా మూడు కారిడార్లలో మొత్తం 73 కి.మీ. మెట్రో ప్రాజెక్టును 2018 ఆగస్టు నాటికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవలి దిశానిర్దేశం చేశారు. నాగోల్‌–రాయదుర్గం(కారిడార్‌–3), ఎల్బీనగర్‌–మియాపూర్‌(కారిడార్‌–1) రూట్‌లో మెట్రో పనులను 2017 నవంబర్‌ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్‌ఎంఆర్, ఎల్‌అండ్‌టీ అధికారులు స్పష్టం చేశారు.

పనుల పురోగతి ఇలా..
మూడు కారిడార్లలో 73 కి.మీ.కుగానూ ఇప్పటివరకు 59 కి.మీ. మార్గంలో పిల్లర్లు, వాటిపై పట్టాలు పరిచేందుకు అవసరమైన వయాడక్ట్‌ సెగ్మెంట్లను ఏర్పాటు చేశారు. మొత్తం 65 స్టేషన్లకుగానూ 35 స్టేషన్ల నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగతా 30 స్టేషన్ల నిర్మాణం ఊపందుకుంది. రెండు కారిడార్లు కలిసే చోట ఏర్పాటు చేయనున్న ఇంటర్‌ ఛేంజ్‌ మెట్రో స్టేషన్లను ఎంజీబీఎస్, అమీర్‌పేట్, పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్మించనున్నారు. వీటి నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. అదే విధంగా ఆయా రూట్లలో పరుగులు పెట్టేందుకు ఇప్పటికే 57 మెట్రో రైళ్లు మియాపూర్, ఉప్పల్‌ డిపోల్లో సిద్ధంగా ఉన్నాయి.

మెట్రోతో సమయం ఆదా ఇలా..
కారిడార్‌–1: ఎల్బీనగర్‌–మియాపూర్‌: 29 కి.మీ. మార్గంలో 26 స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కారిడార్‌ పరిధిలో బస్సు ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతుంది. మెట్రో పూర్తయితే 45 నిమిషాల్లో ఎల్బీనగర్‌ నుంచి మియాపూర్‌ చేరుకోవచ్చు.
కారిడార్‌–2: జేబీఎస్‌–ఫలక్‌నుమా: 15 కి.మీ. మార్గంలో 15 స్టేషన్లు రానున్నాయి. బస్సు ప్రయాణానికి 1.30 గంటల సమయం పడుతుంది. మెట్రోలో అయితే 22 నిమిషాల్లోనే ఫలక్‌నుమా నుంచి జేబీఎస్‌ చేరవచ్చు.
కారిడార్‌–3: నాగోల్‌–రాయదుర్గం: 29 కి.మీ. మార్గంలో 24 స్టేషన్లు రానున్నాయి. బస్సు ప్రయాణానికి గంటన్నర పడుతుంది. మెట్రోలో 40 నిమిషాల్లోనే నాగోల్‌ నుంచి రాయదుర్గం చేరుకోవచ్చు.

అంకెల్లో ఇలా..

  • మెట్రో రైలులో గరిష్ట దూరానికి టికెట్‌ ధర రూ.60. ఏసీ బస్సులో అయితే గరిష్ట దూరానికి టికెట్‌ వెల రూ.100.
  • మెట్రో రైళ్లలో ఉండే కోచ్‌లు 3. ఒక్కో కోచ్‌లో 330 మంది చొప్పున ఒక్కో రైలులో వెయ్యి మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఒక్కో కోచ్‌లో వికలాంగులు, వృద్ధులు కూర్చునేందుకు 40 సీట్లు ఉంటాయి.
  • మూడు కారిడార్లలో మొత్తం 57 మెట్రో రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. తొలుత ప్రతి ఐదు నిమిషాలకు ఓ రైలు అందుబాటులో ఉంటుంది. పూర్తిస్థాయిలో ప్రారంభమైతే ప్రతి రెండు నిమిషాలకో రైలు అందుబాటులోకి రానుంది.
  • ఒక్కో మెట్రో స్టేషన్‌లో రైలు 20 సెకన్ల పాటు ఆగుతుంది.
  • మెట్రో రైళ్ల కనిష్ట వేగం 80 కేఎంపీహెచ్‌. గరిష్ట వేగం 120 కేఎంపీహెచ్‌.


మెట్రో నిర్మాణ వ్యయం ఇలా..
రూ.14,132 కోట్ల అంచనా వ్యయంతో పబ్లిక్‌–ప్రైవేటు భాగస్వామ్యంతో చేపట్టిన మెట్రో ప్రాజెక్టులో కేంద్రం పది శాతం నిధులను వ్యయం చేయనుంది. మిగతా మొత్తాన్ని ఎల్‌అండ్‌టీ సంస్థ వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల నుంచి రుణంగా సేకరించింది. ఇప్పటికే సుమారు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు. నిర్మాణ గడువు పెరగడంతో అంచనా వ్యయం రూ.2 వేల కోట్లు పెరిగినట్లు సమాచారం. కాగా మెట్రో నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీకి ప్రభుత్వం 269 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాలను 45 ఏళ్లపాటు లీజుకిచ్చింది. ఈ స్థలాల్లో మెట్రో మాల్స్, పార్కింగ్, మెట్రో డిపోలు, ఇతర వసతి సముదాయాలను నిర్మించనున్నారు. మూడు కారిడార్ల పరిధిలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో 57 ఎకరాల సువిశాల ప్రాంగణంలో మెట్రో మాల్స్‌ ఏర్పాటుకానున్నాయి. ఈ మెట్రో మాల్స్‌లో విందు వినోదాలతో పాటు చిన్నారులకు ఆటపాటలు, షాపింగ్, నిత్యావసరాలన్నీ దొరుకుతాయి.

మూడు కారిడార్లలో రాకపోకలు సాగించే మెట్రో రైళ్లు - 57
మెట్రో ప్రాజెక్టు అంచనా వ్యయం - రూ.14,132 కోట్లు
ఇప్పటి వరకూ ఖర్చు చేసిన మొత్తం - రూ. 10 వేల కోట్లు
నిర్మాణ గడువు పెరగడంతో పెరిగిన అంచనా వ్యయం - రూ.2 వేల కోట్లు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement