మిస్టరీగానే ఆ స్నాచింగ్స్!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ముర్తుజా నేతృత్వం లోని గ్యాంగ్‌ను అక్కడి పోలీసులు పట్టుకున్నారు... సెప్టెంబర్ 27, 29 తేదీల్లో జంట కమిషనరేట్లలో జరిగిన వరుస స్నాచింగ్స్ వీరి పనేనని తేలింది... అయితే ఫిల్మ్‌నగర్ పరిధిలో చోటు చేసుకున్న రెండు వరుస స్నాచింగ్స్‌తో ఈ ముఠాకు సంబంధంలేదని వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనల్లో మాజీ మంత్రి బంధువు ఒకరు బాధితురాలు కావడంతో నగర పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 29 ఉదయం ఎస్సార్‌నగర్, చిక్కడపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, సనత్‌నగర్ ఠాణాలతో పాటు జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోనూ స్నాచింగ్స్ జరిగాయి. భోపాల్ పోలీసు ల అదుపులో ఉన్న ముర్తుజా గ్యాంగ్‌ను నగర పోలీసు బృందం విచారించగా ఫిల్మ్‌నగర్‌లో మినహా మిగిలిన స్నాచింగ్స్ తామే చేశామని అంగీకరించారు. సాంకేతిక ఆధారాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.
మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు అత్త సత్యవతి ఆ రోజు ఫిల్మ్‌నగర్‌లోని ఓ గుడిలో దర్శనం చేసుకొని బయటకు వచ్చి కారు కోసం వేచి ఉండగా ఇద్దరు స్నాచర్లు ఆమె మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసు లాక్కుపోయారు. ఈ ఘటనలో కిందపడిన సత్యవతి గాయపడ్డారు. అదే దారిలో ముందుకు వెళ్లిన స్నాచర్లు ఫిల్మ్‌నగర్ బస్తీకి చెందిన మల్లీశ్వరి ఫిలింనగర్ రోడ్ నెం.1లోని బీఎన్‌ఆర్ బ్రిలియంట్ స్కూల్ వద్ద రోడ్డు దాటుతుండగా రెండు తులాల గొలుసు లాక్కెళ్లారు. కింద పడటంతో ఈమెకూ తీవ్ర గాయాలయ్యాయి.
ఆలయం వద్ద ఉన్న సీసీ కెమెరాలో హెల్మెట్, మాస్క్‌తో ఉన్న దుండగులు ఫొటోలు రికార్డయ్యాయి. వీటిని మీడియాకు విడుదల చేసిన పోలీసులు ఆచూకీ చెప్పిన వారికి రూ.50 వేల రివార్డు ఇస్తామని కూడా ప్రకటించారు. ముర్తుజా గ్యాంగ్ అరెస్టుతో ఈ రెండు స్నాచింగ్స్ కూడా కొలిక్కి వచ్చినట్టే అని పోలీసులు తొలుత భావించారు. అయితే, విచారణలో తాము జూబ్లీహిల్స్‌లో స్నాచింగ్ చేయలేదని ముర్తుజా ముఠా చెప్పడంతో ఇప్పుడు అసలు దొంగల కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు.
భోపాల్ పోలీసులకు చిక్కిన ముర్తుజా గ్యాంగ్ దేశ వ్యాప్తంగా 13 నగరాల్లో పంజా విసిరింది. వీరు ఎప్పుడు పోలీసులకు పట్టుబడినా... కొన్ని నెలల్లోనే జైలు నుంచి బయటకు వచ్చి అదే రాష్ట్రంలోని మరో ప్రాంతంలో పంజా విసురుతారు. ముర్తుజా నేతృత్వంలోని గ్యాంగ్‌ను గతేడాది జనవరి 8న తమిళనాడులోని కోయంబత్తూరు పోలీసులు పట్టుకున్నారు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన ముర్తుజా ఏడు నెల ల్లోనే ముఠాను మార్చి చెన్నైలో పంజా విసిరాడు.
వీరు సెప్టెంబర్‌లో హైదరాబాద్‌కు వచ్చినట్లే అప్పట్లో చెన్నై చేరుకున్నారు. భోపాల్ నుంచి కర్ణాటకలోని బీదర్‌కు వచ్చి, అక్కడ నుంచి రెండు బైకులతో సహా రైలులో చెన్నై వెళ్లి నేరా లు చేశారు. గతేడాది ఆగస్టు 9న చెన్నై పోలీసులకు చిక్కారు. అక్కడి జైలు నుంచి బయటకు వచ్చి బెంగళూరు, దావళగెరె, మైసూర్‌లతో పాటు హైదరాబాద్, సైబరాబాద్, విశాఖపట్నం, విజ యవాల్లో తమ ‘పనితనం’ చూపించారు.