
వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ గాంధీ నారాయణ
జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బావ ఇంటికే కన్నం వేశాడు.
సాక్షి, హైదరబాద్: జల్సాలకు అలవాటు పడిన ఓ యువకుడు బావ ఇంటికే కన్నం వేసిన సంఘటన బుధవారం హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వనస్థలిపురం ఏసీపీ గాంధీ నారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... హయత్‌నగర్ మండలం, బ్రాహ్మణపల్లికి చెందిన పరం ముత్యం, భువనేశ్వరి దంపతులు, భువనేశ్వరికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గత నెల 1న కర్మన్‌ఘాట్‌లోని పుట్టింటికి వెళ్లి 10 రోజులకు తిరిగి వచ్చింది.
ఈ మద్యకాలంలో ఆమె సోదరుడు గొబ్బురు రాజు తరచూ బావ ఇంటికి వచ్చి వెళ్లేవాడు. ఈ నెల 30న నగలను తీసుకునేందుకు తాళం చెవి కోసం వెదికినా దొరకకపోవంతో బీరువా తాళాలు పగులగొట్టి చూడగా ఉందులో ఉన్న 17.5 తులాల ఆభరణాలు కనిపించలేదు. దీంతో ముత్యం గత సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ముత్యం బామ్మర్ది రాజుపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు.