హైదరాబాద్.. భిన్నత్వంలో ఏకత్వం
బెంగాలీల అభ్యున్నతికి పాటుపడుతాం
హైదరాబాదీల జీవన ప్రమాణాలను పెంచుతాం
ఘనంగా హైదరాబాద్ బెంగాలీ సమితి 75వ వార్షికోత్సవం
నాంపల్లి: ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు నివసించే విశ్వజననీయమైన నగరంగా హైదరాబాదు కానుందని, అందుకు అనుగుణంగా మహా హైదరాబాదు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఆదివారం రాత్రి రవీంద్ర భారతి వేదికపై హైదరాబాద్ బెంగాలీ సమితి 75వ వార్షికోత్సవం ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధిగా హాజరైన కేటీఆర్ ముందుగా బెంగాలీలో కాసేపు మాట్లాడి అందరినీ నవ్వించారు. దేశంలోనే అత్యుత్తమ నగరంగా హైదరాబాదును తీర్చిదిద్దుతామని చెప్పారు. ఇతర నగరాల కంటే భిన్నంగా హైదరాబాదు నగరం ఉంటుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వంగా విభిన్న జాతులు, మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారని అన్నారు. తాను కూడా వంద కిలోమీటర్ల దూరం ఉండే సిద్ధిపేట నుంచి ఆరేళ్ల ప్రాయంలో హైదరాబాదుకు వచ్చి స్థిరపడ్డవాడినేనని చెప్పారు.
హైదరాబాదులో నివసించే హైదరాబాదీల జీవన ప్రమాణాలకు అనుగుణంగా మౌళిక వసతులు కల్పిస్తామని చెప్పారు. అంతర్జాతీయ సభలకు వేదికగా మారిన హైదరాబాదును ఇంకా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అభివృద్ధి అంటే ప్లై ఓవర్లు, స్కైవేలు కాదని, సర్వమానవాళి సంక్షేమానికి అనుగుణంగా, వారసత్వం గర్వించేలా మౌలిక వసతులను సమకూర్చడం అన్నారు. అప్పుడే ఇతర నగరాలతో దీటుగా హైదరాబాదు పోటీపడుతుందని అన్నారు. అంతర్జాతీయ సభలకు వేదికగా మారిన హైదరాబాదులో అభివృద్ధికి అనుగుణంగా విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఐటీ, హెల్త్, ఫార్మా వంటి కంపెనీలతో దే శ రాజధాని ఢిల్లీని తలదన్నేలా హైదరాబాద్ ఉండబోతోందన్నారు. దేశంలోనే ఏ ఇతర రాష్ట్రానికీ దక్కని 11 శాతం వృద్ధిరేటును సాధించిందని, అదే బడ్జెట్‌ను రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారని అన్నారు. ఇప్పుడు చేపట్టే ప్రతి అభివృద్ధి భావి భారత పౌరులకు పరిశుభ్రమైన వాతావరణం, అభివృద్ధిని, మెరుగైన జీవన ప్రమాణాలను అందిస్తున్నారు. హైదరాబాదు గుండా ప్రవహించే మూసీ నదిని గుజరాత్‌లోని సబర్మతి నది తరహాలో సుందరీకరణ చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ బెంగాలీ సమితికి చెందిన భూమి సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. కార్యక్రమంలో కోల్ ఇండియా సీఎండీ సుదిత్యా భట్టచార్య, ఎస్‌బీహెచ్ సీఎండీ శంతన్ ముఖర్జి, టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ హైదరాబాదు కింగ్‌శుక్‌నాగ్, సమితి అధ్యక్షులు రంజన్ రాయ్ చౌదరి, కార్యదర్శి సుమిత్ సేన్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాగబ్ ఛటర్జీ సంగీత ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.