నేనూ సెటిలర్‌నే
మా పూర్వీకులు సిద్దిపేట్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు.. టీయూడబ్ల్యూజే మీట్ ది ప్రెస్‌లో మంత్రి కేటీఆర్
* తెలంగాణ వద్దన్నందుకే ఉద్యమ సమయంలో కొందరిపై ఘాటైన వ్యాఖ్యలు
* గ్రేటర్ ఎన్నికల్లో అందరినీ కలుపుకుని పోతాం..
* నాలుగు రోజుల్లో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తాం..
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్ అంతా సెటిలర్లే.. నేనూ సెటిలర్‌నే.. మా పూర్వీకులు సిద్దిపేట్ నుంచి వచ్చి నగరంలో స్థిరపడ్డారు. హైదరాబాద్‌లోని గౌలిపురా.. శాలిబండలో పుట్టిపెరిగిన వాళ్లు తక్కువే. ఆ మాటకొస్తే అమెరికా కూడా వలసల దేశమే(కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్). తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకున్నందుకే ఉద్యమ సమయంలో కొందరిపై ఘాటైన వ్యాఖ్యలు చేశాం. బల్దియా ఎన్నికల్లో అందరినీ కలుపుకుని ముందుకెళ్తాం.. ఎవరిపైనా వివక్షలేదు’’ అని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. మంగళవారం ఐజేయూ, టీయూడబ్ల్యూజే, హెచ్‌యూజేల ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన హైదరాబాద్ అభివృద్ధికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, భవిష్యత్‌లో అమలు చేయనున్న ప్రణాళికలను వివరించారు. మరో నాలుగు రోజుల్లో బల్దియా ఎన్నికలపై తమ పార్టీ మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మార్చిలోగా పాత్రికేయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేస్తామని, వరంగల్ తరహాలో అన్ని జిల్లాల్లో జర్నలిస్టుల కాలనీలు నిర్మించే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. మీట్ ది ప్రెస్‌లో వివిధ అంశాలపై కేటీఆర్ ఏమన్నారంటే..
రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉన్నా..
‘‘బల్దియా ఎన్నికల్లో మేం మ్యాజిక్ ఫిగర్ 75 సీట్లను గెలుస్తామన్న విశ్వాసం ఉంది. మేయర్‌గా టీఆర్‌ఎస్ అభ్యర్థి కూర్చోకుంటే నేను నా పదవికి రాజీనామా చేస్తా. విపక్ష నేతల రాజీనామా విషయం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. ఎన్నికల తర్వాతే మా పార్టీలో మేయర్, డిప్యూటీ మేయర్ అభ్యర్థులను కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. గ్రేటర్ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుంటిసాకులు చెబుతున్నాయి. ఓటమిపై వారి అధిష్టానాలకు సంజాయిషీ ఇచ్చుకునేందుకే డీలిమిటేషన్, వార్డుల రిజర్వేషన్లపై రాద్దాంతం చేస్తున్నాయి. టీడీపీ, బీజేపీలు గోచీ.. గొంగడిలేని పార్టీలు. రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు పూర్వపక్షం.. ఎన్నిక ఏకపక్షం కావడం ఖాయం. 50 ఏళ్లలో వారు చేయని అభివృద్ధిని మేము 19 నెలల్లో చేసి చూపుతున్నాం. ఉద్యమ నాయకునికి ప్రజలకు సుపరిచితులైన కేసీఆర్.. ఇప్పుడు గొప్ప పాలనాదక్షుడుగా చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు చూసి జనం మమ్మల్ని విశ్వసిస్తున్నందునే గెలుపుపై ధీమాగా ఉన్నాం.
విభజనతోనే వికాసం..
తెలంగాణ, ఏపీల విభజనతోనే రెండు రాష్ట్రాల్లో అభివృద్ధి సాధ్యపడింది. అమరావతి నగరం, గన్నవరం, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఐఐటీ, ఎయిమ్స్, ఐఐఎం, నౌకాతీరాలు, భూముల ధరలు పెరగడం వంటి అభివృద్ధి ఏపీలో జరిగింది. తెలంగాణకు పలు బహుళజాతి కంపెనీల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ అనాదిగా అభివృద్ధి చెందిన నగరం. దీన్ని కొందరు ప్రపంచ పటంలో మేమే పెట్టాం అని చెప్పడం అవివేకం. నాటి నిజాం పాలకుల నుంచి నేటి వరకు నగరంలో అన్ని ప్రాంతాలు, వర్గాలు, మతాల వారు సామరస్యంతో ఉన్న గొప్ప నగరం హైదరాబాద్.
2017లోగా మెట్రో పూర్తి చేస్తాం..
నగరంలో మూడు మార్గాల్లో 72 కి.మీ. మార్గంలో చేపట్టిన మెట్రో ప్రాజెక్టును 2017 నాటికి పూర్తిచేస్తాం. తొలి దశను ఈ ఏడాది ప్రథమార్థంలో ప్రారంభించబోతున్నాం. పాతనగరంలో అలైన్‌మెంట్ మార్పుపై క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు వెళ్లేందుకు ఎలక్ట్రికల్ బస్సులను నడపనున్నాం. సుమారు వంద సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేస్తాం. ఐటీ రంగంలో తెలంగాణ యువతకు ఉపాధి దక్కేలా వారిలో మెళకువలు పెంపొందించేందుకు టాస్క్ సంస్థ ద్వారా 20 వేల మందికి శిక్షణ అందిస్తున్నాం. ఐటీ , హార్డ్‌వేర్ రంగాల పరిధి పెంచుతాం. మాదాపూర్, కొండాపూర్, హైటెక్‌సిటీలే కాకుండా మిగతా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నాం. మేక్ ఇన్ తెలంగాణ నినాదానికి అధిక ప్రాధాన్యమిస్తున్నాం.’’ అని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఐజేయూ నేతలు అమర్, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.