నగరానికి శస్త్రచికిత్స
- అప్పుడే రహదారులు, మౌలిక సమస్యలకు పరిష్కారం
-‘మై జీహెచ్‌ంఎంసీ’ యాప్ ఆవిష్కరణలో మంత్రి కేటీఆర్
- నగరంలోని రహదారులపై అసంతృప్తిగా ఉన్నా
- సీఎం నుంచి సామాన్యుల వరకూ ఇదే అభిప్రాయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని రహదారులు, ఇతర మౌలిక సమస్యల పరిష్కారానికి శస్త్రచికిత్స చేయాల్సిందేనని, తరతరాలుగా వారసత్వంగా సంక్రమించినసమస్యల పరిష్కారానికి ఇది అత్యవసరమని మున్సిపల్ మంత్రి కె.తారకరామారావు అభిప్రాయపడ్డారు. వివిధ పౌర సదుపాయాలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) రూపొందించిన ‘మై జీహెచ్‌ఎంసీ’ మొబైల్ యాప్‌ను శుక్రవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలోని రహదారులు ఇతర సమస్యలపై తాను ఏమాత్రం సంతృప్తికరంగా లేనని, ముఖ్యమంత్రి నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెప్పారు. రహదారులు, నీటి నిల్వ ప్రాంతాలు, తదితర సమస్యలు ఇప్పుడే కొత్తగా వచ్చినవి కావని, అవి నగరానికి వారసత్వంగా సంక్రమించాయని, దీనికి తాము ఎవరినీ నిందించబోమని, డ్రైవింగ్ సీట్లో ఉన్న తమతోనే వీటిని పరిష్కరించడం సాధ్యమవుతుందని, అందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సమస్యలన్నీ వెంటనే పరిష్కారం కావాలనే తపన ఉంటుం దని, అయితే ‘అబ్రకదబ్ర’ అనగానే అది సాధ్యం కాదని, దశల వారీగా ఆర్నెల్ల నుంచి ఏడాదిలోగా నగరంలో చెప్పుకోదగ్గ మార్పుచేర్పుల్ని చూపిస్తామన్నారు.
తొలుత ఫుట్‌పాత్‌లు, జంక్షన్ల అభివృద్ధి, పచ్చదనం కార్యక్రమాల కోసం మూడు స్పెషలిస్టుల కమిటీలను నియమిస్తామని, ఈ అంశాల్లో ఎలాంటి సమస్యలూ లేకుండా ప్రజలకు సదుపాయాలు కల్పించడమే వాటి బాధ్యతని అన్నారు. పారిశుధ్యం, వీధిదీపాలు, వీధికుక్కల బెడద వంటి సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. గ్రేటర్‌లోని తొమ్మిది వేల కి.మీ.ల రోడ్లకు 350 కి.మీ.లు మాత్రమే ఫుట్‌పాత్‌లు, 1,500 కి.మీ.లు మాత్రమే వర ద నీటి కాలువలు ఉండటం సిగ్గుచేటన్నారు.
సాంకేతికతతో కొత్త పుంతలు..
నా.. మన అనే భావన కలుగుతుందనే ఈ యాప్‌కు ‘మై జీహెచ్‌ఎంసీ’ అని నామకరణం చేసినట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశా రు. అటు అధికారుల్లోనూ, ఇటు ప్రజల్లోనూ ఇది మనదే అని చెప్పేందుకే ఈ పేరు పెట్టినట్లు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో సాంకేతికతను వినియోగించుకుని సమస్య ల పరిష్కారంలో కొత్తపుంతలు తొక్కుతామన్నారు. కార్యక్రమంలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఎంజీ గోపాల్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ సురేంద్రమోహన్ పాల్గొన్నారు.