'ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించాలి'
హైదరాబాద్: పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే బాగుంటుందని ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లో గురువారం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. గ్రేటర్ ఎన్నికలలో పోలింగ్ చాలా తక్కువ శాతం నమోదైందని... ఆన్లైన్ ద్వారా ఓటింగ్ నిర్వహిస్తే ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశముంటుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ల జాతీయ సదస్సు నిర్వహించడంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి హర్షం వ్యక్తం చేశారు. ఈ సదస్సులో అన్ని సర్వీసు కమిషన్లకు కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఇలాంటి సదస్సు హైదరాబాద్లో తొలిసారి నిర్వహిస్తున్నందుకు గర్వపడుతున్నామని చక్రపాణి చెప్పారు.