'మెగాస్టార్ సినిమాను వదులుకోను' | I Dont left the chance of megastar chiranjeevi film | Sakshi
Sakshi News home page

'మెగాస్టార్ సినిమాను వదులుకోను'

Published Sun, Aug 23 2015 3:07 PM | Last Updated on Sun, Sep 3 2017 7:56 AM

'మెగాస్టార్ సినిమాను వదులుకోను'

'మెగాస్టార్ సినిమాను వదులుకోను'

♦ సింధీ కాలనీ ఉందని తెలుసు
♦ ‘బాహుబలి’తో ఎంతో పేరు
♦ అమ్మాయిలూ... ఏదైనా తినండి
♦ శారీరక శ్రమను మరచిపోకండి
♦ మిల్కీబ్యూటీ తమన్నా
 
 నగరంలోని బేగంపేటలో ఉన్న సింధీస్ కాలనీ సంగతి తనకు తెలుసని చెబుతోంది ప్రముఖ కథానాయిక తమన్నా. ముఖ్యంగా ఆ కాలనీలోని అబ్బాయిలు సాయంత్రమైతే ఏమేం చేస్తారనే దానిపై చాలా ఫన్నీ స్టోరీస్ విన్నానంటూ చెప్పింది. ‘మరి మీ సింధీస్ అమ్మాయిలు అంత అందంగా ఉంటే... అబ్బాయిలు మాత్రం పాపం ఏం చేస్తారు?’ అంటే అవునవునంటూ నవ్వేసింది. తాజ్ డెక్కన్‌లో  బంజారాస్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ మీట్‌ను శనివారం ప్రారంభించిన సందర్భంగా మిల్కీబ్యూటీ తమన్నా ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించింది. ఈ అందాల తార ఏమంటోందంటే...  
 -సాక్షి, లైఫ్‌స్టైల్‌ప్రతినిధి
 
 మాతృభాష కన్నా తెలుగులోనే మిన్న
   ముంబయిలో పుట్టి పెరిగా. నా మాతృభాష సింధీ అయినప్పటికీ... ఇప్పుడు తెలుగే బాగా వచ్చు తెలుసా? మా అమ్మ కూడా  ‘సింధీ కన్నా తెలుగే నువ్వు బాగా మాట్లాడుతున్నావ్’ అని తరచూ అంటుంది. హైదరాబాద్ ఇప్పుడు నాకు రెండో హోమ్ టౌన్ అయిపోయింది. ఈ సిటీలో చాలా పెద్ద సింధీ కాలనీ ఉందని నాకు తెలుసు. సాయంత్రమైతే అక్కడి అబ్బాయిలు చేసే పనుల గురించి ఎన్నో సరదా కథలు విన్నా (నవ్వు). ఇక్కడ మాకు బంధువులెవరూ లేరు. చెన్నైలో ఉన్నారు. అయినా దేశ, విదేశాల్లో ని తెలుగు వాళ్లంతా ఇప్పుడు నాకు బంధువులే.

 బాహు‘బలం’ ఇంతనుకోలేదు...
 బాహుబలిలో నటిస్తున్నప్పుడు ఒక గొప్ప సినిమా చేస్తున్నామని తెలుసు. కానీ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందనుకోలేదు. ఆ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికీ అది జీవితంలో ఒక్కసారే వచ్చే అవకాశం. ఐ ఫీల్ వెరీ వెరీ వెరీ లక్కీ. మనం ఒక సినిమా బాగా వస్తుం దని నమ్మి చేస్తాం. ప్రేక్షకులు కూడా అంతే బాగా ఆదరిస్తేఆ ఆనందాన్ని మాటల్లో చెప్పలేం. బాహుబలి ఇండియాలోనే బిగ్గెస్ట్ పిక్చర్ అయింది. ఈ సినిమా రెండో భాగంలో నాపాత్ర నిడివి చాలా తక్కువ. అంతకు మించి ఇంకేమైనా అడగాలంటే రాజమౌళి సార్‌ని కలవండి (నవ్వు).

 హీరోలకు పెద్ద సెల్యూట్
 అవును. బాహుబలిలో నన్ను చాలా అందంగా చూపించారు. కేవలం లుక్స్ మాత్రమే కాదు అన్ని రకాలుగా ఇదే నా బెస్ట్ ప్రొజెక్షన్ అని చెప్పాలి. పాటలతో పాటు ఈ సినిమాలో కత్తి యుద్ధం చేశా. ఎవరినైనా భయపెట్టానో లేదో కానీ నన్ను చూసి నేనే భయపడ్డా (నవ్వు). ఈ సీన్లు పండించడం కోసం కొన్ని రోజుల ట్రైనింగ్ కూడా తీసుకున్నా. సినిమాల్లో హీరోలు ఫైట్స్ చేయడం చాలా కష్టమని అప్పుడు అర్ధమైంది. హీరోలందరికి పెద్ద సెల్యూట్.

 ట్రైనింగ్ లేకపోయినా... టైమింగ్ ఉంది
 తెలుగు హీరోయిన్లలో నన్ను బెస్ట్ డ్యాన్సర్ అంటారనే కాంప్లిమెంట్‌కి థ్యాంక్స్. నేను డ్యాన్స్‌లో ట్రైనింగ్ తీసుకోలేదు. 13 ఏళ్లకే నా సినిమా జీవితం ప్రారంభించా.దాంతో అంత టైమ్ దొరకలేదు. షూటింగ్ టైమ్‌లో కొరియోగ్రాఫర్స్ చెప్పిన ట్టు అక్కడికక్కడ చేసేయడమే. విచిత్రమేమిటంటే... అంత చిన్న వయసులో కెరీర్ స్టార్ట్ చేసినా నా గురించి నేను ఆలోచించుకుంటే... చిన్నప్పుడే చాలా క్లారిటీగా ఉన్నాననిపిస్తుంది. అప్పు డు సినిమా చేయాలి అంతే. ఇంకేం తెలీదు. స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా ఒకటే థాట్ ఉండేది.

 ఆ తప్పులు రిపీట్ చేయను
 నా కెరీర్ బాలీవుడ్ సినిమాతో ప్రారంభించాను. పేరొచ్చాక హిమ్మత్‌వాలాతో పాటు మరో హిందీ చిత్రం చేశాను. కానీ బాలీవుడ్‌లో నాకు మంచి గుర్తింపు రాలేదు. బాహుబలి తర్వాత  ఇప్పుడు అన్ని భాషల్లో పేరొచ్చింది. ఇకపై నేను చాలా జాగ్రత్తగా ఉండదలచుకున్నాను. ఒకప్పుడు చేసిన తప్పులు ఇకపై చేయదలచుకోలేదు. నాకొక మంచి పాత్ర ఉండాలి. దానికో ఇంపార్టెన్స్ ఉండాలి. అలాంటివే చేస్తాను. హీరోయిన్ ఓరియెంటెడ్ అయినా, రెగ్యులర్ కమర్షియల్ సినిమా అయినా ప్రేక్షకులకునచ్చాలి. అంతే మంచి పాత్ర కావాలి. హీరోయిన్ ఓరియెంటెడ్ అన్నంత మాత్రాన ఏది పడితే అది చేయను. మంచిదైతేనే చేస్తాను. ఫలానా హీరోతో చేయాలని ఏమీ లేదు. ఎవరైనా సరే మంచి పాత్ర అయితే చేస్తా. నాకు కావాల్సింది గుడ్‌వర్క్.

 బ్రాండ్స్ ఎంపికలో బాధ్యతగా ఉంటా
 అమ్మ, అమ్మమ్మ చెప్పిన సలహాలను బట్టి... చిన్నప్పటి నుంచి ఆయుర్వేద ఉత్పత్తులే వాడుతున్నాను. అప్పటి కంటే... ఈ జనరేషన్‌కే ఆయుర్వేదం గురించి తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే ఆయుర్వేద ప్రొడక్ట్స్‌కి బ్రాండింగ్ చేసే ఛాన్స్ రాగానే అంగీకరించాను. మా మాటలు ప్రతి ఒక్కరి మీదా ప్రభావం చూపిస్తాయని తెలుసు. అందుకే నేను ప్రచారం చేసే బ్రాండ్స్‌ని ఎంచుకోవడంలో చాలా బాధ్యతగా ఉంటా. నేను పని చేస్తున్న ప్రతి బ్రాండ్‌తో నాది దీర్ఘకాలం అనుబంధం. ఏదో ఏడాదో, ఆర్నెల్లకో మాత్రమే చేయను. మనస్ఫూర్తిగా నమ్మిన బ్రాండ్‌కే చేస్తాను. నేను నమ్మకపోతే దాని గురించి మాట్లాడవద్దని నా ఏజెంట్‌కి చెప్పేస్తాను.
 
 ముగ్గురు ఫిట్‌నెస్ ట్రైనర్స్
 మా రంగంలో ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నాకు ముగ్గురు పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు. బ్యాలెన్స్‌డ్ డైట్, టైమింగ్ డిసిప్లిన్  వంటి విషయాల్లో కచ్చితంగా ఉంటాను. ఇప్పటి అమ్మాయిలకు నేను చెప్పే ఫిట్‌నెస్ టిప్ ఒకటే... మీకు ఏది ఇష్టముంటే అది తినండి. యోగా కావచ్చు... జిమ్‌కి వెళ్లవ చ్చు... స్పోర్ట్స్ ఆడవచ్చు. ఏదైనా సరే రోజుకో గంట శారీరక శ్రమ అవసరం. తినమన్నా కదాని ఎంత పడితే అంత తినడం కాదు. మీ ఫిట్‌నెస్‌ని నిర్ణయించేది 70 శాతం డైట్ అయితే... 30 శాతం వర్కవుట్ అని గుర్తుంచుకోండి.
 
 చిరు సినిమాలో అవకాశం వస్తే...
 మెగాస్టార్ 150వ సినిమాలో అవకాశం వస్తే తప్పకుండా చేస్తా. అయినా ఆ చాన్స్ ఎవరైనా ఎలా వదులుకుంటారు? పైగా నేను ఆయన అభిమానిని. ప్రస్తుతం నాగార్జున-కార్తీ    నటిస్తున్న ద్విభాషా చిత్రంలో చేస్తున్నా. రవితేజతో మరో చిత్రంలో
 నటిస్తున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement