
ఇకపై చాలా కఠినంగా ఉంటాం: కేటీఆర్
సామాన్యుడికి అవినీతి చీడ లేకుండా చూడటమే తమ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
హైదరాబాద్: సామాన్యుడికి అవినీతి చీడ లేకుండా చూడటమే తమ లక్ష్యమని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో కాసేపు మాట్లాడారు. అక్రమ నిర్మాణాలు చేపడితే.. ఇకపై చాలా కఠినంగా ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వమే అక్రమ నిర్మాణాలను స్వాధీనం చేసుకునేలా చట్టం తెస్తామన్నారు.
అందరి బాగుకోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పవని.. ఇక నుంచి పన్నుల వసూలు 100 శాతం ఉండేలా, మునిసిపాలిటీల ఆదాయం పెరిగేలా వ్యవహరిస్తామని మంత్రి చెప్పారు. ఈ నెలాఖరుకల్లా 100 రోజుల అజెండాను ప్రకటిస్తామని వెల్లడించారు. నగరంలో నిర్మాణ అనుమతులన్నీ నిర్ణీత గడువులో ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో 'గ్రేటర్' కొత్త కార్పొరేటర్లకు అవగాహన సదస్సులు కల్పిస్తామని కేటీఆర్ వివరించారు.