
హోం వెనుకాల మద్యం బాటిళ్లు, నిరోధ్ ప్యాకెట్లు
నాగోలు: ఎల్‌బీనగర్ బండ్లగూడలో ఓలే్డజ్ హోం ముసుగులో అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. మైనర్ బాలికపై అత్యాచార ఘటన వెలుగులోకి రావడంతో హోం నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓల్డు ఏజ్ హోంలో మద్యం బాటిళ్లు, నిరోధ్ ప్యాకెట్లు లభించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.... నల్లగొండ జిల్లాకు చెందిన ఆర్.శ్రీనివాస్ సౌత్‌ఎండ్‌పార్కులో రామకృష్ణ ఓలే్డజ్ హోం నిర్వహిస్తున్నాడు. వృద్ధులకు సేవ పేరుతో అతను బండ్లగూడ, రాఘవేంద్రకాలనీల్లో సెంటర్లను ఏర్పాటు చేసి బండ్లగూడలో రామకృష్ణ ఓలే్డజ్ హోం, హోం కేర్ సర్వీసెస్ పేరిట సెంటర్ నడుపుతున్నాడు. ఇక్కడి నుంచి వృద్ధులకు సేవ చేస్తున్నట్లు కాలనీవాసులు, పరిసర ప్రాంతాల వారిని నమ్మించారు. వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మైనర్ బాలికలను హోం సర్వీసెస్‌కు పంపేవాడు.
యువతీ, యువకులచే సర్వీస్...
రామకృష్ణ ఓల్డు ఏజ్ హోం పేరుతో ‘మీ ఇంటి వద్దకే మా సేవలు’ అంటూ వంద నుంచి 150 మంది సిబ్బందిని తన ఆధీనంలో ఉంచుకుని నగరంలో వాహనాల ద్వారా సేవలు అందించేవాడు. సర్వీస్ పేరుతో పలు అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. సర్వీస్ చేసిన యువతులు, యువకులకు తక్కువ జీతం ఇచ్చి వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేసేవాడని, బండ్లగూడలో ఏర్పాటు చేసిన మూడు గదుల్లో మహిళలు, యువకులు కలిసి ఉండేవారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. గోపాలకృష్ణాపురంలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఓల్డు ఏజ్ కేర్ సర్వీస్ సెంటర్ సిబ్బందిని మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన వెంటనే హోంకు తాళం వేసి పరారయ్యారు. గురువారం స్థానికులు హోంను పరిశీలించగా మద్యం బాటిళ్లు, నిరోధ్ ప్యాకెట్లు కనిపించాయి. ఇక్కడ కూడా వృద్ధులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకపోవడంతో సేవ చాటున అసాంఘీక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొంటున్నారు.
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
హోంలో సర్వీస్ సెంటర్ పేరుతో అసాంఘీక కార్యక్రమాలు జరుగుతున్నాయని గోపాలకృష్ణాపురం రెసిడెన్సీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్, ప్రధాన కార్యదర్శి స్వామి, కరుణాకర్‌రెడ్డి, కాలనీ మహిళలు గతంలోనే ఎల్‌బీనగర్ పోలీసులకు, డీసీపీకి ఫిర్యాదు చేసినా వారు స్పందించలేదన్నారు. హోంలో ఉండే మహిళలు, యువకులు మద్యం సేవించి ఇబ్బందులకు గురిచేసేవారన్నారు. నిర్వాహకుడు శ్రీనివాస్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ డీసీపీఓ దేవేందర్, కౌన్సిలర్లు హోంను సందర్శించి వివరాలు సేకరించారు. ఎల్‌బీనగర్ ఏసీపీ వేణుగోపాల్‌రావు పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.