
మౌలిక సౌకర్యాలకు పెద్దపీట
♦ నగర ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందిస్తాం..
మురుగునీటి వ్యవస్థను మెరుగుపరుస్తాం: సీఎం కేసీఆర్ వెల్లడి
♦ మూసీ ప్రక్షాళన, వరద నీటి కాలువల నిర్వహణ
♦ వరంగల్‌లో దేశంలోనే అతి పెద్ద టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు
♦ ఆర్థిక సహకారానికి ఐఎల్‌ఎఫ్‌ఎస్ సంసిద్ధత
సాక్షి, హైదరాబాద్: దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని.. నగరంలో పరిశ్రమల స్థాపనకు అనువుగా మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. నగర ప్రజల కనీస అవసరాలు తీర్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధికి ఆర్థిక సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్, ఫైనాన్సింగ్ కంపెనీ(ఐఎల్‌ఎఫ్‌ఎస్) సంస్థ ప్రతినిధులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.
సంస్థ చైర్మన్ ప్రదీప్ పూరి, వైస్ చైర్మన్ హరీష్‌శంకర్ సీఎంను కలసిన వారిలో ఉన్నారు. నగర ప్రజలకు సురక్షిత మం చినీరు అందిస్తామని, మురుగునీటి వ్యవస్థను మెరుగుపరిచేందుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పారు. నగరం పరిధిలో వరద నీటి కాల్వల నిర్వహణ, మూసీ నది ప్రక్షాళన, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్‌ను పొరుగున ఉన్న ప్రాంతాలతో అనుసంధానం చేయడం తదితరాలపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ప్రభుత్వం చేపట్టే పనులకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ సహకారం అవసరమవుతుందని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం అమలు చేస్తుండటంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని, ఇందుకు అనుగుణంగా ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామికవాడలను సిద్ధం చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరం వరంగల్‌లో దేశంలోనే అతి పెద్ద టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తామని, దీని కోసం మూడు వేల ఎకరాల స్థలాన్ని గుర్తించామని చెప్పారు. జిన్నింగ్, స్పిన్నింగ్, వీవింగ్, ప్రాసెసింగ్ తదితర యూనిట్లన్నీ ఒకే చోట నెలకొల్పుతామని, ముడి పత్తిని ప్రాసెస్ చేయడం మొదలుకుని.. వస్త్ర ఉత్పత్తి జరిగే వరకు ఉండే వివిధ ప్రక్రియలన్నీ ఒకే చోట జరిగేలా టెక్స్‌టైల్ పార్కు నిర్మిస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగర సమగ్రాభివృద్ధి, టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు ఆర్థిక సహకారం అందించేందుకు ఐఎల్‌ఎఫ్‌ఎస్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది జనవరిలో మరోమారు సమావేశమై ఆర్థిక సహకారానికి సంబంధించి విధివిధానాలు ఖరారు చేసుకోవాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, సీఎం ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు, అదనపు కార్యదర్శి శాంతకుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించాం
‘స్థానిక’ ఎమ్మెల్సీ ఏకగ్రీవాలపై సీఎం
స్థానిక కోటా శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసిన 12 స్థానాల్లో ఏకంగా ఆరు ఎమ్మెల్సీ స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకోవడం ద్వారా జాతీయ స్థాయిలో చరిత్ర సృష్టించిన ట్లయ్యిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. ఏకగ్రీవంగా గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపిన సీఎం.. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత మళ్లీ ఇదొక అద్భుత విజయమని పేర్కొన్నారు. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో కలిశారు. వీరితో పాటు కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు ముఖ్యమంత్రిని కలవగా.. వారినుద్దేశించి ఆయన మాట్లాడారు.
వరస విజయాలు సాధిస్తున్నందున గర్వపడకూడదని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉన్నారని ఈ విజయంతో అర్థమవుతోందన్నారు. ఎన్నికల కోడ్ ముగిశాక, ముఖ్య నాయకులు, ఇతరులతో సమావేశం జరిపి రాష్ట్ర పురోగతికి ప్రజల ఎజెండాను అమలు చేయడానికి ఆలోచనలు చేద్దామన్నారు. త్వరలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజలు ఎంతగా స్పందించి గెలిపిస్తున్నారో.. అంతే స్థాయిలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సీఎం కేసీఆర్ నాయకులకు సూచించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఇతర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవాలని సూచించారు. మంత్రులు వాళ్ల శాఖలతో పాటు జిల్లాకు చెందిన అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరును పర్యవేక్షించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు ఈటల రాజేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, ప్రభుత్వ సలహాదారు డి.శ్రీనివాస్, టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పేర్వారం రాములు, ఎంపీలు బాల్క సుమన్, సీతారాం నాయక్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.