మాజీ జర్నలిస్టుల పిల్లల రసవత్తర పోరు | Interesting contest betwin former journalist Descendants . | Sakshi
Sakshi News home page

మాజీ జర్నలిస్టుల పిల్లల రసవత్తర పోరు

Published Wed, Jan 27 2016 6:35 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

Interesting contest betwin former journalist Descendants .

జీహెచ్ఎంసీ ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. అభ్యర్థులతో పాటు.. వారి కుటుంబ సభ్యులు ప్రచారంలో తలమునకలుగా ఉన్నారు. అయితే.. బంజారా హిల్స్ డివిజన్  అభ్యర్థుల విషయంలో ఒక ఆసక్తి కరమైన పోలిక ఉంది. ఈ డివిజన్ లో టీఆర్ ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గద్వాల్ విజయ లక్ష్మి తండ్రి కే.కేశవరావు, బీజేపీ అభ్యర్థి మేచినేని శ్రీనివాసరావు తండ్రి మేచినేని కిషన్ రావులు ఇద్దరూ మాజీ జర్నలిస్టులు కావడం విశేషం.

వీరిద్దరూ జర్నలిజంలో ఉంటూనే ఎవరికివారు ప్రత్యేకంగా పత్రికలు నడిపారు. మేచినేని కిషన్‌రావు సమయం పత్రికను నిర్వహిస్తే కే.కేశవరావు డైలీ న్యూస్ పేరుతో ఓ పత్రికను సమర్ధవంతంగా నడిపారు. తాజాగా ఇద్దరు మాజీ జర్నలిస్టులు తమ పిల్లల విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు.


అంతే కాదు.. ప్రస్తుతం ఈ మాజీ జర్నలిస్టుల వారసులు కార్పోరేటర్ పదవికి పోటీ పడుతుండగా.. గతంలో కేశవరావు, కిషన్ రావులు సికింద్రాబాద్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే పదవికి పోటీ పడటం విశేషం. ఆ ఎన్నికల్లో కేకేపై కిషన్‌రావు 25 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అంతేకాదు ఈ ఇద్దరూ మాజీ మంత్రులు కావడం మరో విశేషం.


కేకే కార్మికశాఖామంత్రిగా పని చేస్తే కిషన్‌రావు విద్యాశాఖామంత్రిగా పని చేశారు. మరో విషయం ఏంటంటే హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కేకే, కిషన్‌రావు ఇద్దరూ తలపడ్డారు. ఈ ఎన్నికల్లో మాత్రం కిషన్‌రావుపై కేకే గెలుపొందారు. ఇలా ఈ ఇద్దరూ చాలా విషయాల్లో తలపడినవారే. కేకే, కిషన్‌రావు కూతురు, కొడుకు పోటీ పడుతుండటం.. తాజాగా డివిజన్ లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
రాజకీయాల్లో తలపండిన ఈ ఇద్దరు నేతలు తమ పిల్లలను గెలిపించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మరి తుది విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. పలు సందర్భాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వీరు.. నివసించేది.. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో. అంతే కాదు.. ఇద్దరూ ఎప్పుడు ఎదురు పడినా.. ఆప్యాయంగా పలకరించుకోవడం.. ఒకరిపై ఒకరు గౌరవాన్ని వ్యక్తం చేయడంలో హుందా వ్యవహరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement