
బడ్జెట్ నిబంధనావళి మార్చాల్సిందే
‘రూ. 25 వేల కోట్ల’ బడ్జెట్‌పై నీటిపారుదల,ఆర్థిక శాఖల మధ్య అంతర్గత పోరు
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు గంపగుత్తగా నిధులు కేటాయించే అంశం ఆర్థిక, నీటిపారుదల శాఖల మధ్య అంతర్గత పోరుకు తెర లేపింది. ఈ విధానం బడ్జెట్ నిబంధనావళికి విరుద్ధంగా ఉందంటూ ఆర్థిక శాఖ తొలినుంచీ విముఖత వ్యక్తం చేస్తోంది. నీటిపారుదల శాఖకు గంపగుత్తగా రూ. 25 వేల కోట్లు కేటాయిస్తామని స్వయంగా సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించటంతో ఆర్థిక శాఖ ప్రేక్షక పాత్రకు పరిమితమైంది. తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చకుండా అకౌంటెంట్ జనరల్ సూచనల మేరకు వ్యవహరించాలని సర్కారుకు సూచించింది. అయితే కాంట్రాక్టర్లకు ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించేందుకు వీలుగా బడ్జెట్ కేటాయింపులను నీటిపారుదల శాఖ నేరుగా ఖర్చు పెట్టేలా కొత్త విధానం రూపొందించాలని సీఎం ఆదేశించారు. దీంతో బడ్జెట్ రూపకల్పన దగ్గర పడుతున్న కొద్దీ ఈ గంపగుత్త కేటాయింపులు, నిధుల అప్పగింత వ్యవహారంపై గందరగోళం పెరుగుతోంది.
అధికారుల తర్జనభర్జన..
2016-17 బడ్జెట్‌లో నీటి పారుదల శాఖకు గంపగుత్తగా రూ.25 వేల కోట్లు కేటాయించేందుకు గత నెలలో కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. బడ్జెట్ మౌలిక సూత్రాలకు ఇది భిన్నమని, రాజ్యాంగం నిర్దేశించిన సమతుల్య అభివృద్ధి భావన వీగిపోతుందని ఆర్థిక శాఖ అభిప్రాయపడుతోంది. కానీ ఈ నిర్ణయంపై పెదవి విప్పడం లేదు. కేబినెట్‌లో దీనిపై జరిగిన చర్చలోనూ ఆర్థిక శాఖ పాలుపంచుకోలేదని తెలిసింది. బడ్జెట్ కేటాయింపుల ప్రతిపాదనలను సాధారణంగా ఆర్థిక శాఖ కేబినెట్ ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కానీ నీటిపారుదల శాఖ ఈ కేటాయింపుల ప్రతిపాదనను ఎజెండాలో పెట్టించి కేబినెట్ ఆమోద ముద్ర వేయించుకుంది.
తాజాగా బడ్జెట్ తయారీపై కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఈ కేటాయింపుల అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. బడ్జెట్‌లో దాదాపు నాలుగో వంతు నిధులను ఒకే శాఖకు అప్పగించాలంటే బడ్జెట్ నిబంధనావళిని సవరించడం తప్పనిసరని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు వీలుగా కొత్త విధానాన్ని పాటించేలా ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. బడ్జెట్ తయారీతో ముడిపడి ఉన్న అంశం కావడంతో ఆర్థిక శాఖ ఈ ఉత్తర్వులు జారీ చేయాలి. కానీ వరుస పరిణామాలు, కేబినెట్‌లో తమ ప్రమేయం లేకుండా ముందస్తు కేటాయింపులు జరిగిన దృష్ట్యా ఆర్థిక శాఖ ఆ ఊసెత్తడం లేదు. అసలు ఈ ప్రతిపాదనలతో ముందుకు వచ్చిన నీటి పారుదల శాఖే ఉత్తర్వులు జారీ చేస్తుందంటూ వేచి చూసే ధోరణి అనుసరిస్తోంది. దీంతో ఈ అంశంపై అధికార వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.