పాతబస్తీలో ప్రైవేట్ జూ?
► గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ!
► బిహార్ నుంచి వన్యప్రాణుల స్మగ్లింగ్
► ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన నగరవాసులు
► అంతర్జాతీయ మాఫియాగా అనుమానాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జూ ఎక్కడ ఉంది? అంటే.. బహదూర్‌పురలో ఉన్న నెహ్రూ జూలాజికల్ పార్క్ అని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పటి వరకు రికార్డుల్లోకి ఎక్కకుండా, గుట్టుచప్పుడు కాకుండా పాతబస్తీలో ‘ప్రైవేట్ జూ’లు నడుస్తున్నాయంటే నమ్మగలమా..? ఉత్తరప్రదేశ్‌లో పట్టుబడిన నగరవాసులు ఇదే విషయాన్ని బయటపెట్టారు. వన్యప్రాణులైన కరకల్ క్యాట్, లెపార్డ్ క్యాట్‌లను అక్రమ రవాణా చేస్తూ వీరు చిక్కారు. దీనిపై సమాచారం అందుకున్న అటవీ–పోలీసు విభాగాలు పాతబస్తీలో ఉన్న ప్రైవేట్ జూ ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు.
బిహార్ నుంచి తీసుకొస్తూ..
పాతబస్తీలోని కాలాపత్తర్ ప్రాంతానికి చెందిన మహ్మ ద్ ఆరిఫ్ సహా ఐదుగురు నగరవాసులు అరుదైన కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన పిల్లుల కోసం కొన్ని రోజుల క్రితం బిహార్ వెళ్లారు. అక్కడి అటవీ ప్రాంతంలో ఈ జాతులకు చెందిన ఐదింటిని పట్టు కున్న వీరు.. తమ ఇన్నోవా వాహనంలో ఇనుప కంచె తో ప్రత్యేకంగా చేసిన పెట్టెల్లో భద్రపరిచారు. సోమ వారం వాహనంలో ఉత్తర్‌ప్రదేశ్ మీదుగా వస్తుం డగా.. ఆ రాష్ట్ర అటవీ శాఖ అధికారులకు సమాచారం అందింది. దీంతో మీర్జాపూర్ ప్రాంతంలో తనిఖీ చేయగా.. వీరి వాహనంలో కరకల్, లెపార్డ్ జాతులకు చెందిన ఐదు పిల్లులు బయటపడ్డాయి. ఆరిఫ్‌తో పాటు మరో ఇద్దరు అధికారులకు చిక్కగా.. మిగిలిన ఇరువురు పరారయ్యారు.
జూ పేరుతో తప్పించుకోజూశారు..
ఆరిఫ్ సహా మిగిలిన ఇద్దరూ తమను అదుపులోకి తీసుకున్న అధికారులతో తాము హైదరాబాద్ జూకు చెందిన సిబ్బంది అని, జంతు ప్రదర్శనశాలలో ఉంచడానికి అధికారికంగానే వీటిని తరలిస్తున్నామని నమ్మించే ప్రయత్నం చేశారు. అయితే అక్కడి అటవీ శాఖ అధికారులు అందుకు సంబంధించిన పత్రాలు చూపమని చెప్పడంతో దొరికేశారు. ప్రాథమిక విచారణ నేపథ్యంలో పాతబస్తీలో అనధికారికంగా కొనసాగుతున్న జూలో పెంచుకోవడానికే వీటిని తరలిస్తున్నట్లు అంగీకరించారు. ఈ తరహా పిల్లుల్ని సజీవంగా స్మగ్లింగ్ చేస్తూ చిక్కడం అత్యంత అరుదని ఉత్తరప్రదేశ్ అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఉమేందర్ శర్మ మీడియాకు వెల్లడించారు.
కెమెరా ట్రాప్ కళ్లల్లోనూ పడవు..
అడవుల్లో వన్యప్రాణుల్ని లెక్కించడానికి, వాటి ఆచూకీ తెలుసుకోవడానికి ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అనేక ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేస్తుంది. మూవ్‌మెంట్ క్యాప్చర్ పద్ధతిలో పని చేసే వీటి ముందుకు ఏ జంతువు వచ్చినా.. కెమెరా ఫొటో తీస్తుంది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్ అడవుల్లో అరుదైన జాతికి చెందిన కరకల్, లెపార్డ్ క్యాట్స్ కొన్నేళ్లుగా కెమెరాలకూ చిక్కలేదని చెప్తున్నారు. అంతరించి పోయాయని భావిస్తున్న తరుణంలో.. ఆ పిల్లుల్ని హైదరాబాదీలు ఎలా పట్టుకున్నారనే అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
‘అంతర్జాతీయ’కోణంలోనూ ఆరా
స్మగ్లర్లు తమ ఉనికి బయటపడకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్నోవాకు బూడిద రంగు వేయించడంతో పాటు నంబర్ ప్లేట్ కనిపించకుండా కప్పేశారు. పిల్లుల్ని పకడ్బందీగా ఇనుప బోన్లలో గన్నీ బ్యాగ్స్‌తో పార్శిల్ చేశారు. వీటిని పరిశీలించిన యూపీ అధికారులు తమకు చిక్కిన హైదరాబాదీల వెనుక అంతర్జాతీయ ముఠా ఉందని అనుమానిస్తున్నారు. ఇలా అక్రమంగా తీసుకువెళ్లిన వన్యప్రాణుల్ని హైదరాబాద్, బెంగళూరుల్లోని ఫామ్‌హౌస్‌ల్లో కొంతకాలం ఉంచుతున్నారని, ఆపై బయటి దేశాలకు తరలిస్తున్నారని అనుమానిస్తున్నారు. అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉన్న కరకల్ క్యాట్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని అడవుల్లోనూ కలిపి 200లోపే ఉన్నట్లు అంచనా. దీంతో ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేయడానికి వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో(డబ్ల్యూసీసీబీ) రంగంలోకి దిగనుంది.