- జనవరిలో మిగితా పోస్టులన్నింటికి వరుసగా నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్షల్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు 1:2 చొప్పున ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వం బీసీ క్రీమీలేయర్ అమలుకు ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈనెల 30వ తేదీన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) మెకానికల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను ప్రారంభించి, జనవరి నెలలో అన్ని రకాల పోస్టులకు ఇంటర్వ్యూలను పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. వ్యవసాయ అధికారి పోస్టులకు మినహా ఇంటర్వ్యూలు ఉన్న మిగితా అన్ని పోస్టులకు ఇంటర్వ్యూల నిర్వహణకు చర్యలు చేపడుతోంది. ఇక నీటి పారుదల, ఆయక ట్టు అభివృద్ధి శాఖలో ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఈనెల 30న ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కమిషన్ కార్యదర్శి పార్వతి సుబ్రహ్మణ్యన్ ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ జాబితాలను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.
వారికి 30వ తేదీన ఉదయం 9 గంటలకు కమిషన్ కార్యాలయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుందని పేర్కొన్నారు. అభ్యర్థులు కాల్ లెటర్లు, ఖాళీల వివరాలు, చెక్ లిస్టులు, అటెస్టేషన్, ఇతర ఫారాలు అన్నింటిని ఈనెల 22 మధ్యాహ్నం 3 గంటల తరువాత నుంచి తమ వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. వాటన్నింటిని ఫిల్ చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో అంద జేయాలని పేర్కొన్నారు. అలాగే అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను రెండు సెట్ల జిరాక్స్ కాపీలను (అటెస్టెడ్) అందజేయాలని, బీసీలు అయితే నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను తీసుకురావాలని సూచించారు. రెవెన్యూ అధికారులు కూడా దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా నాన్ క్రీమీలేయర్ సర్టిఫికెట్లను అందజేయాలని కోరారు. అభ్యర్థులు ఉద్యోగం వస్తుందా? లేదా? అన్నది చూడకుండా నాన్ క్రీమీలేయర్ పరిధిలోకి వస్తే ఆయా సర్టిఫికెట్లను తీసుకోవాలని కమిషన్ వర్గాలు పేర్కొన్నాయి.
30న ఏఈఈ మెకానికల్ పోస్టులకు ఇంటర్వ్యూలు
Published Mon, Dec 21 2015 9:58 PM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM
Advertisement