టార్గెట్‌ టాప్‌ ఆఫీసర్స్‌! | Intimidating Phones to state's Anti-Terrorist Squad officers | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ టాప్‌ ఆఫీసర్స్‌!

Published Mon, Apr 3 2017 2:06 AM | Last Updated on Tue, Sep 5 2017 7:46 AM

టార్గెట్‌ టాప్‌ ఆఫీసర్స్‌!

టార్గెట్‌ టాప్‌ ఆఫీసర్స్‌!

ఏటీఎస్‌ అధికారులకు బెదిరింపు ఫోన్లు
కుటుంబ విషయాలు చెప్పి బెదిరిస్తున్న వైనం
ఆ కాల్స్‌ సిటీ నుంచి రూట్‌ అవుతున్నట్లు ఆధారాలు
పోలీసుల్ని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు


సిటీబ్యూరో: ‘నీకు .... పిల్లలున్నారు. వాళ్ళు .... స్కూల్‌లో చదువుతున్నారు. నీ కుటుంబం ....ఫలానా చోట నివసిస్తోంది. మా మనుషుల మీద ఎక్కువగా కాన్సన్‌ట్రేట్‌ చేస్తున్నావట. పరిస్థితులు నీ చేతులు దాటిపోతాయి జాగ్రత్త’  ఓ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్‌  స్క్వాడ్ (ఏటీఎస్‌) ఉన్నతాధికారికి గత నెల్లో వచ్చిన ఫోన్‌కాల్‌ సారాంశమిది.ఢిల్లీతో సహా ఉత్తరాదిలో ఉన్న అనేక రాష్ట్రాల ఏటీఎస్‌లు, నిఘా తదితర విభాగాల ఉన్నతాధికారులు ఇలాంటి బెదిరింపు ఫోన్లు      ఎక్కువగా వస్తున్నాయి. ఈ కాల్స్‌ అన్నీ హైదరాబాద్‌ నుంచి రూటింగ్‌ అవుతున్నట్లు గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులతో పాటు సిటీ అధికారుల్నీ అతప్రమత్తం చేశాయి. సీసీఎస్‌ ఆధీనంలోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కాల్‌ రూటింగ్‌ గ్యాంగ్‌కు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించినా ఫలితం లేకపోవడంతో ఫోరెన్సిక్‌ నిపుణుల సాయంతో ఆరా తీయాలని నిర్ణయించారు.

నైతికంగా దెబ్బతీయడానికే...
ఆయా విభాగాల్లో... ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో కీలకంగా పని చేసే అధికారులను నైతికంగా దెబ్బతీయడానికే ముష్కరులు ఈ తరహా ఫోన్‌కాల్స్‌ చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసం పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను ఏర్పాటు చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికి అనుబంధంగా పని చేసే వ్యక్తులు సోషల్‌మీడియాతో పాటు వ్యక్తిగతంగానూ ఎంపిక చేసుకున్న అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఫేస్‌బుక్‌ వంటి వాటిని ఫాలో కావడంతో పాటు తమ ఏజెంట్ల ద్వారానూ అధికారులు వ్యక్తిగత వివరాలు సంగ్రహిస్తున్నారు. ఆపై వీటి ఆధారంగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు కేంద్ర ని«ఘా వర్గాలు భావిస్తున్నాయి.

ఇంటర్‌నెట్‌ నుంచి నెంబర్లు...
ఈ బెదిరింపు ఫోన్లు కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే, అత్యధికం ల్యాండ్‌లైన్లకే  వస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఇంటర్‌నెట్‌లోని వివిధ అధికారిక వెబ్‌సైట్ల నుంచే ఎక్కువగా నెంబర్లను సంగ్రహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆయా వెబ్‌సైట్లలో ఏటీఎస్‌ యూనిట్లకు నేతృత్వం వహించే, కీలక అధికారుల సెల్‌ లేదా ల్యాండ్‌లైన్‌ నెంబర్లు మాత్రమే పొందుపరుస్తారు. దిగువ, క్షేత్రస్థాయి అధికారుల నెంబర్లు వెబ్‌సైట్లలో ఉండవు. బెదిరింపు ఫోన్లు సైతం ఉన్నతాధికారులకే వస్తుండటంతో వెబ్‌సైట్ల నుంచే ఎక్కువగా నెంబర్లు సంగ్రహిస్తున్నట్లు భావిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించారు.

దుబాయ్, మలేషియాల్లో ‘స్పెషల్‌ యూనిట్లు’...
ముష్కరులు ఎంపిక చేసుకున్న అధికారులకు బెదిరింపు ఫోన్లు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని యూనిట్లు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నేరుగా ఫోన్‌ చేస్తే ఆ కాల్స్‌ అందుకునే వారు ఏ నెంబర్‌ నుంచి కాల్‌ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఇవి ఏ ప్రాంతానికి చెందినవో గుర్తిచడం ద్వారా కొన్ని ఆధారాలు సేకరించవచ్చు. దీన్ని తప్పించుకోవడానికి ముష్కరులు కాల్‌ రూటింగ్‌ విధానాలను అవలంబిస్తున్నారు. దుబాయ్, మలేషియా తదితర దేశాల్లో హిందీ, ఉర్దూలతో పాటు స్పష్టమైన ఇంగ్లీషు తెలిసిన వారిని ప్రత్యేకంగా ముష్కరులు నియమించుకుంటున్నారు. వారికే టార్గెట్‌ చేసిన అధికారుల నెంబర్లు ఇచ్చి ఫోన్లు చేయిస్తున్నారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.

గుర్తింపు, కాల్‌ బ్యాక్‌ ఉండవు...
కాల్‌ రూటింగ్‌ ద్వారా వాయిస్‌ ఓవర్‌ ఇంటర్‌నెట్‌ ప్రొటోకాల్‌ (వీఓఐపీ) విధానంలో దేశంలోకి వచ్చే ఫోన్‌కాల్స్‌ తొలుత అక్రమ ఎక్స్‌ఛేంజ్‌ల్లో లాండ్‌ అవుతుంది. వీటి నిర్వాహకులు బోగస్‌ వివరాలతో స్థానికంగా కొన్ని సిమ్‌కార్డుల్ని తీసుకుంటారు. వీటిని ప్రత్యేకమైన బాక్సులకు ఏర్పాటు చేసి కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. వీఓఐపీ కాల్‌ ఈ బాక్స్‌కు చేరిన వెంటనే అందులో ఉన్న సిమ్‌కార్డు నుంచి రిసీవ్‌ చేసుకునే వ్యక్తికి చేరుతుంది. ఆ వ్యక్తికి సదరు ఫోన్‌ కాల్‌ లోకల్‌ నుంచే వస్తున్నట్లు తెలుస్తుంది తప్ప... పూర్తి వివరాలు గుర్తించే ఆస్కారం ఉండదు. ఫోన్‌ అందుకున్న అధికారి ఆ నెంబర్‌కు తిరిగి కాల్‌ బ్యాక్‌ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బెదిరింపు ఫోన్లన్నీ రూటింగ్‌ ద్వారానే జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement