Anti-Terrorist Squad
-
గుజరాత్ తీరంలో 700 కిలోల డ్రగ్స్ స్వాధీనం
న్యూఢిల్లీ: గుజరాత్‌లోని పోర్బందర్ తీరంలో 700 కిలోల మాదక ద్రవ్యాలను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు శుక్రవారం స్వా«దీనం చేసుకున్నారు. ఈ మెథాంఫెటామైన్ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.3,500 కోట్లు ఉంటుందని అధికారులు చెప్పారు. అలాగే 8 మంది ఇరాన్ జాతీయులను అరెస్టు చేశారు. విదేశాల నుంచి పెద్ద ఎత్తున డ్రగ్స్ వస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో ‘సాగర్ మంథన్–4’ అనే కోడ్నేమ్లో ఎన్సీబీ, భారత నావికాదళం, గుజరాత్ పోలీసు శాఖకు చెందిన యాంటీ–టెర్రరిస్టు స్క్వాడ్(ఏటీఎస్) సిబ్బంది జాయింట్ ఆపరేషన్ ప్రారంభించారు. గుజరాత్ తీరంలో భారత ప్రాదేశిక జలాల్లో ప్రవేశించిన రిజిస్టర్ కాని ఓ పడవను అడ్డుకున్నారు. అందులో తనిఖీ చేయగా 700 కిలోల డ్రగ్స్ లభించాయి. పడవలో ఉన్న 8 మంది ఇరాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లేవు. భారీ ఎత్తున డ్రగ్స్ స్వా«దీనం చేసుకున్న అధికారులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అభినందించారు. ‘మాదక ద్రవ్యాల రహిత భారత్’ తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ ఎక్స్‌లో పోస్టు చేశారు. డ్రగ్స్ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ ఏడాది ఇప్పటివరకు 3,500 కిలోల డ్రగ్స్‌ను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. మూడు కేసుల్లో 11 మంది ఇరాన్ పౌరులను, 14 మంది పాకిస్తాన్ పౌరులను అరెస్టు చేశారు. వారంతా ప్రస్తుతం ఇండియా జైళ్లలో ఉన్నారు. ఢిల్లీలో 80 కిలోల కొకైన్ స్వాధీనం దేశ రాజధాని ఢిల్లీలో రూ.900 కోట్ల విలువైన 80 కిలోల కొకైన్‌ను ఎన్సీబీ శుక్రవారం స్వా«దీనం చేసుకుంది. ఓ కొరియర్ సెంటర్లో ఆ డ్రగ్స్ లభించినట్లు అధికారులు చెప్పారు. -
రూ.1,814 కోట్ల డ్రగ్స్ సీజ్
అహ్మదాబాద్/న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఓ ఫ్యాక్టరీ నుంచి రూ.1,814 కోట్ల విలువైన 907 కిలోల మెఫెడ్రిన్‌తోపాటు, ముడి సరుకును, యంత్ర పరికరాలను అధికారులు స్వా«దీనం చేసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్), ఢిల్లీ నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)సంయుక్తంగా జరిపిన దాడిలో బగ్రోడా పారిశ్రామిక ఎస్టేట్‌పై శనివారం దాడి జరిపినట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ ఏటీఎస్ యూనిట్ సారథ్యంలో ఇంతభారీగా డ్రగ్స్ పట్టుబడిన ఘటన ఇదే. ఫ్యాక్టరీలో రోజుకు 25 కిలోల మెఫెడ్రిన్ తయారవుతోందని చెప్పారు. ఈ సందర్భంగా ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు 2017లో మహారాష్ట్రలోని అంబోలిలో మెఫెడ్రిన్ పట్టుబడిన కేసులో ఐదేళ్ల జైలు శిక్ష అనుభవించాడని అధికారులు వివరించారు. అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల కొకైన్ లభ్యం అమృత్‌సర్‌లో రూ.10 కోట్ల విలువైన కొకైన్‌ను స్వా«దీనం పోలీసులు చేసుకున్నారు. ఇటీవల ఢిల్లీలో రూ.5,620 కోట్ల విలువైన 560 కిలోల కొౖకైన్, 40 కిలోల మారిజువానాను సీజ్ చేయడం తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు క్రమంలోనే తాజాగా కొకైన్ పట్టుబడింది. ఈ సందర్భంగా ఒక వ్యక్తితోపాటు అతడి టయోటా కారును స్వా«దీనం చేసుకున్నారు. నిందితుడు విదేశాలకు పరారయ్యేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడని అధికారులు తెలిపారు. -
రు.600 కోట్ల హెరాయిన్ పట్టివేత
అహ్మదాబాద్: అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ మాదక ద్రవ్యాలను గుజరాత్ ఉగ్ర వ్యతిరేక బృందం స్వాధీనం చేసుకుంది. కేసులో ముగ్గురిని అరెస్ట్‌చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఆఫ్రికా ఖండంలోని దేశానికి తరలించేందుకు పాకిస్తాన్‌కు చెందిన జహీద్ బషీర్ బలూచ్ అనే వ్యక్తి నుంచి 120 కేజీల హెరాయిన్‌ను ఈ ముగ్గురు తెప్పించారని పోలీసులు వెల్లడించారు. మోర్బీ జిల్లాలోని జింజువా గ్రామంలో ఈ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ ఆశిశ్ భాటియా చెప్పారు. -
వాజేనే ప్రధాన నిందితుడు
ముంబై: థానేకు చెందిన వ్యాపారి మన్సుఖ్ హిరన్ హత్య కేసులో ముంబై పోలీసు అధికారి సచిన్వాజేనే ప్రధాన నిందితుడని మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్(ఏటీఎస్) ఆదివారం స్పష్టం చేసింది. ఈ కేసుకు సంబంధించి శనివారం రాత్రి పోలీసు వినాయక్ షిండేను, బుకీ నరేశ్ గౌర్‌ను అరెస్ట్ చేసింది. పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్ధాల వాహనాన్ని నిలిపి ఉంచిన కేసులో సచిన్ వాజే ప్రస్తుతం ఎన్ఐఏ అదుపులో ఉన్నారు. 2006 లఖాన్ భయ్యా నకిలీ ఎన్కౌంటర్ కేసులో దోషిగా నిర్ధారణ అయిన వినాయక్ షిండే గత సంవత్సరం ఫర్లోపై జైలు నుంచి బయటకు వచ్చారు. అప్పటి నుంచి ఆయన వాజేతో టచ్‌లో ఉంటున్నారు. ముకేశ్ ఇంటివద్ద పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం అంతకుముందు, మన్సుఖ్ హిరన్ స్వాధీనంలో ఉంది. మార్చి 5న మన్సుఖ్ మృతదేహం థానెలో ఒక కాలువ పక్కన కనిపించింది. ఈ కేసును కేంద్రం శనివారం ఎన్ఐఏకు అప్పగించింది. కాగా, మన్సుఖ్ హత్యకు ప్రధాన కుట్రదారు ఎవరో తేల్చే పనిలో ఉన్నామని ఏటీఎస్ అధికారి ఒకరు వెల్లడించారు. -
హిందూత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో ముక్తా
ముంబై : పూణేలో హత్యకు గురైన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కుమార్తె ముక్తా దభోల్కర్ కూడా హిందూత్వ తీవ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నట్టు మహారాష్ట్ర తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాల బృందం (ఏటీఎస్) తెలిపింది. సామాజిక కార్యకర్త శ్యాం మానవ్, ఎన్‌సిపి నాయకుడు జితేంద్ర అహ్వద్ తదితరుల పేర్లు సైతం హిట్ లిస్టులో ఉన్న విషయాన్ని ఏటీఎస్ వెల్లడించింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలపై గత వారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన హిందూత్వ తీవ్రవాది అవినాష్ పవార్ పై ఏటీఎస్ కోర్టుకి సమర్పించిన డైరీలో ఈ విషయాలను ప్రస్తావించింది. హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతోన్న ముక్తా దభోల్కర్, శ్యాంమానవ్, జితేంద్ర అహ్వద్ తదిరులను అనుమానిత హిందూత్వ తీవ్రవాది అవినాష్ పవార్ నిఘా పెట్టి, వారిని వెంబడించినట్టు స్థానిక సెషన్స్ కోర్టుకి సమర్పించిన రిపోర్టులో ఏటీఎస్ పేర్కొన్నది. ప్రివెన్షన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ కింద అరెస్టయిన ఐదో వ్యక్తి అవినాష్ పవార్. అంతకు ముందు ఇదే కేసులో మరో నలుగురిని కూడా ముంబై పోలీసులు అరెస్టు చేసారు. -
టార్గెట్ టాప్ ఆఫీసర్స్!
►ఏటీఎస్ అధికారులకు బెదిరింపు ఫోన్లు ►కుటుంబ విషయాలు చెప్పి బెదిరిస్తున్న వైనం ►ఆ కాల్స్ సిటీ నుంచి రూట్ అవుతున్నట్లు ఆధారాలు ►పోలీసుల్ని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు సిటీబ్యూరో: ‘నీకు .... పిల్లలున్నారు. వాళ్ళు .... స్కూల్లో చదువుతున్నారు. నీ కుటుంబం ....ఫలానా చోట నివసిస్తోంది. మా మనుషుల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నావట. పరిస్థితులు నీ చేతులు దాటిపోతాయి జాగ్రత్త’ ఓ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) ఉన్నతాధికారికి గత నెల్లో వచ్చిన ఫోన్‌కాల్ సారాంశమిది.ఢిల్లీతో సహా ఉత్తరాదిలో ఉన్న అనేక రాష్ట్రాల ఏటీఎస్‌లు, నిఘా తదితర విభాగాల ఉన్నతాధికారులు ఇలాంటి బెదిరింపు ఫోన్లు ఎక్కువగా వస్తున్నాయి. ఈ కాల్స్ అన్నీ హైదరాబాద్ నుంచి రూటింగ్ అవుతున్నట్లు గుర్తించిన కేంద్ర నిఘా వర్గాలు రాష్ట్ర పోలీసులతో పాటు సిటీ అధికారుల్నీ అతప్రమత్తం చేశాయి. సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కాల్ రూటింగ్ గ్యాంగ్‌కు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉందా? అనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు. నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని విచారించినా ఫలితం లేకపోవడంతో ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో ఆరా తీయాలని నిర్ణయించారు. నైతికంగా దెబ్బతీయడానికే... ఆయా విభాగాల్లో... ప్రధానంగా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్స్‌లో కీలకంగా పని చేసే అధికారులను నైతికంగా దెబ్బతీయడానికే ముష్కరులు ఈ తరహా ఫోన్‌కాల్స్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు చెప్తున్నాయి. దీనికోసం పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రత్యేకంగా కొన్ని యూనిట్లను ఏర్పాటు చేసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. దీనికి అనుబంధంగా పని చేసే వ్యక్తులు సోషల్‌మీడియాతో పాటు వ్యక్తిగతంగానూ ఎంపిక చేసుకున్న అధికారులు వివరాలు ఆరా తీస్తున్నారు. ఫేస్బుక్ వంటి వాటిని ఫాలో కావడంతో పాటు తమ ఏజెంట్ల ద్వారానూ అధికారులు వ్యక్తిగత వివరాలు సంగ్రహిస్తున్నారు. ఆపై వీటి ఆధారంగా ఫోన్లు చేస్తూ బెదిరింపులకు దిగుతున్నట్లు కేంద్ర ని«ఘా వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్నెట్ నుంచి నెంబర్లు... ఈ బెదిరింపు ఫోన్లు కేవలం ఉన్నతాధికారులకు మాత్రమే, అత్యధికం ల్యాండ్‌లైన్లకే వస్తున్నాయి. దీన్ని పరిగణలోకి తీసుకున్న ఉన్నతాధికారులు ఇంటర్నెట్లోని వివిధ అధికారిక వెబ్సైట్ల నుంచే ఎక్కువగా నెంబర్లను సంగ్రహిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆయా వెబ్సైట్లలో ఏటీఎస్ యూనిట్లకు నేతృత్వం వహించే, కీలక అధికారుల సెల్ లేదా ల్యాండ్‌లైన్ నెంబర్లు మాత్రమే పొందుపరుస్తారు. దిగువ, క్షేత్రస్థాయి అధికారుల నెంబర్లు వెబ్సైట్లలో ఉండవు. బెదిరింపు ఫోన్లు సైతం ఉన్నతాధికారులకే వస్తుండటంతో వెబ్సైట్ల నుంచే ఎక్కువగా నెంబర్లు సంగ్రహిస్తున్నట్లు భావిస్తున్నామని ఓ అధికారి వ్యాఖ్యానించారు. దుబాయ్, మలేషియాల్లో ‘స్పెషల్ యూనిట్లు’... ముష్కరులు ఎంపిక చేసుకున్న అధికారులకు బెదిరింపు ఫోన్లు చేయడానికి ప్రత్యేకంగా కొన్ని యూనిట్లు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. నేరుగా ఫోన్ చేస్తే ఆ కాల్స్ అందుకునే వారు ఏ నెంబర్ నుంచి కాల్ వచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఇవి ఏ ప్రాంతానికి చెందినవో గుర్తిచడం ద్వారా కొన్ని ఆధారాలు సేకరించవచ్చు. దీన్ని తప్పించుకోవడానికి ముష్కరులు కాల్ రూటింగ్ విధానాలను అవలంబిస్తున్నారు. దుబాయ్, మలేషియా తదితర దేశాల్లో హిందీ, ఉర్దూలతో పాటు స్పష్టమైన ఇంగ్లీషు తెలిసిన వారిని ప్రత్యేకంగా ముష్కరులు నియమించుకుంటున్నారు. వారికే టార్గెట్ చేసిన అధికారుల నెంబర్లు ఇచ్చి ఫోన్లు చేయిస్తున్నారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నట్లు ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. గుర్తింపు, కాల్ బ్యాక్ ఉండవు... కాల్ రూటింగ్ ద్వారా వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) విధానంలో దేశంలోకి వచ్చే ఫోన్‌కాల్స్ తొలుత అక్రమ ఎక్స్ఛేంజ్ల్లో లాండ్ అవుతుంది. వీటి నిర్వాహకులు బోగస్ వివరాలతో స్థానికంగా కొన్ని సిమ్‌కార్డుల్ని తీసుకుంటారు. వీటిని ప్రత్యేకమైన బాక్సులకు ఏర్పాటు చేసి కంప్యూటర్‌కు అనుసంధానిస్తారు. వీఓఐపీ కాల్ ఈ బాక్స్‌కు చేరిన వెంటనే అందులో ఉన్న సిమ్‌కార్డు నుంచి రిసీవ్ చేసుకునే వ్యక్తికి చేరుతుంది. ఆ వ్యక్తికి సదరు ఫోన్ కాల్ లోకల్ నుంచే వస్తున్నట్లు తెలుస్తుంది తప్ప... పూర్తి వివరాలు గుర్తించే ఆస్కారం ఉండదు. ఫోన్ అందుకున్న అధికారి ఆ నెంబర్‌కు తిరిగి కాల్ బ్యాక్ చేయాలని ప్రయత్నించినా సాధ్యం కాదు. ఈ నేపథ్యంలోనే బెదిరింపు ఫోన్లన్నీ రూటింగ్ ద్వారానే జరుగుతున్నట్లు అధికారులు చెప్తున్నారు.