ఫేస్‌బుక్‌లో పరిచయం కొంపముంచింది
అత్యాశ కొంపముంచింది
ఫేస్‌బుక్‌లో పరిచయం
డైమండ్ నగలు పంపుతున్నానని ఎర
కస్టమ్స్ టాక్స్ పేరిట రూ. 8 లక్షకు ఎసరు
పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
బంజారాహిల్స్: అత్యాశ కొంపముంచింది.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన అగంతకుడు వజ్రాల ఆభరణాలు పంపుతున్నానని ఉపాధ్యాయురాలికి రూ. 8 లక్షలకు మోసం చేశాడు. జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. రహ్మత్‌నగర్‌కు చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్‌కు లండన్‌లో ఉండే జాన్సన్ హెన్రీ అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. నెల రోజుల పాటు ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఇద్దరి మధ్య స్నేహం పెరిగింది. క్రిస్‌మస్ పండగకు డైమండ్ ఆభరణాలతో పాటు 250 లక్షల పౌండ్లు పంపుతున్నానని హెన్రీ ఆమెకు చెప్పాడు. ఈనెల 8న సదరు టీచర్‌కు న్యూఢిల్లీలోని కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నానని ఓ మహిళ కాల్ చేసింది. మీకు ఇంగ్లాండ్ నుంచి 250 లక్షల పౌండ్లతో పాటు బంగారు వజ్ర వైడూర్యాల బహుమతిగా వచ్చాయని చెప్పింది. అయితే కస్టమ్స్ చార్జీల కింద రూ. 68 వేలు చెల్లించాలని చెప్పింది.
వెంటనే టీచర్ ఆమె చెప్పిన అకౌంట్‌లో డబ్బులు వేసింది. మరో రెండు గంటల తర్వాత అదే మహిళ మళ్లీ ఫోన్ చేసి కమర్షియల్ ట్యాక్స్ కింద రూ. 1.20 లక్షలు వెంటనే చెల్లించాలని చెప్పగా.. ఆ మొత్తాన్ని కూడా టీచర్ ఆమె అకౌంట్ లో వేసింది. కొద్దిసేపటి తర్వాత కస్టమ్స్ అధికారిణి పేరుతో మళ్లీ ఆమెకు ఫోన్ చేసి పార్శిల్ స్కానింగ్‌లో రూ. 7 లక్షలు డబ్బులున్నట్లు గుర్తించామని, ఆ మొత్తాన్ని కూడా వేయాలని కోరింది. వెంటనే టీచర్ తన ఇంటి యజమానుల వద్ద రూ. 7 లక్షలు అప్పు తీసుకొని, ఇందుకు ప్రతిఫలంగా తనకు డబ్బులురాగానే రూ.20 లక్షలు ఇస్తానని చెప్పింది. ఆ మేరకు రూ. 7 లక్షలను వివిధ బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఢిల్లీ నుంచి తనకు ఫోన్ చేసిన మహిళ చెప్పిన అకౌంట్లలో వేసింది. బహుమతి ఒక గంటసేపట్లో వస్తుందని నమ్మించిన ఆమె తిరిగి ఫోన్ చేసి సర్వీస్ బాయ్ అందుబాటులో లేడని, మరుసటి రోజు పంపిస్తానని చెప్పింది. నమ్మిన టీచర్ మరుసటి రోజు చెప్పిన సమయానికి బహుమతి రాకపోవడంతో ఆ అధికారిణికి మళ్లీ ఫోన్ చేసింది. మరో రూ. 5 లక్షలు వేస్తేగాని బహుమతి పంపడం కుదరదని ఆమె చెప్పడంతో టీచర్ తన స్నేహితుడు హెన్రీని సంప్రదించగా.. తాను మరుసటి రోజు న్యూఢిల్లీ వస్తున్నానని ఆందోళన చెందవద్దని చెప్పాడు.
ఆ తెల్లవారే హెన్రీ ఆమెకు ఫోన్ చేసి తాను ఢిల్లీకి వచ్చానని, సదరు అధికారిణితో మాట్లాడగా రూ. 5 లక్షలు డిమాండ్ చేసిందని, ఆ మొత్తాన్ని తప్పకుండా పంపించాలని కోరాడు. ఇంటి యజమానికి చెల్లించాల్సిన రూ. 20 లక్షలు తనకు అకౌంట్ నంబర్ ఇస్తే వేస్తానని నమ్మించాడు. తాను ఇక్కడ అకౌంట్ తెరవడానికి రూ. 20 వేలు ఇవ్వాలని కూడా డిమాండ్‌చేశాడు. దీంతో అనుమానం వచ్చిన రోజారాణి జూబ్లీహిల్స్ పోలీసులకు శుక్రవారం ఉదయం ఫిర్యాదు చేసింది. పోలీసులు ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.