బోగీల్లో తినుబండారాలు అమ్మితే భారీ ఫైన్
అధికారులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఐఆర్‌సీటీసీ నుంచి అనుమతి పొందిన విక్రయదారులు, నిర్ధారిత సంఖ్యలో ఉండే లెసైన్స్‌డ్ విక్రయదారులు మినహా మిగిలినవారు ఎవరైనా రైలు బోగిల్లో తినుబండారాలు అమ్ముతూ కనిపిస్తే భారీగా జరిమానా విధించాలని అధికారులను దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్రగుప్తా ఆదేశించారు. అలాగే స్టేషన్లలో కూడా అనుమతి లేని విక్రయదారులను రానీయవద్దని, వస్తే పెనాల్టీలు విధించాలని ఆదేశించారు. ప్రయాణికులకు ఎదురవుతున్న ఇబ్బందులతోపాటు, రైలు బోగీలు, స్టేషన్ పరిసరాలను అపరిశుభ్రంగా మారటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆయన చెప్పారు.
గురువారం అన్ని డివిజన్ల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. బోగీలు, స్టేషన్ పరిసరాల్లో చెత్త వేసేవారి విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని, టికెట్ లేకుండా ప్రయాణించేవారిని గుర్తించి జరిమానాలు విధించాలని ఆదేశించారు. రైల్వే స్థలాల లీజులు, అద్దెలు, స్టేషన్లలోని దుకాణాల అద్దెలు, ఇతర ఫీజులు, లెవీ తదితరాలను సరిగా వసూలు చేసి రైల్వే ఆదాయం పెరిగేలా చూడాలని సూచించారు.