పాతదా.. కొత్తదా! | Is it was old or new! | Sakshi
Sakshi News home page

పాతదా.. కొత్తదా!

Published Sun, Jul 3 2016 12:16 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

పాతదా.. కొత్తదా! - Sakshi

పాతదా.. కొత్తదా!

భూసేకరణ పరిహారంపై పేచీ
మల్లన్నసాగర్ ఆందోళనలతో మళ్లీ తెరపైకి

 
- 2013లోనే భూసేకరణ చట్టం తెచ్చిన కేంద్రం
- పారదర్శకంగా ప్రక్రియ పూర్తికి మార్గదర్శకాలు
- ఈ చట్టంతో క్లిష్టంగా పరిహారం చెల్లింపు ప్రక్రియ
- చట్ట సవరణకు ఎన్‌డీఏ సర్కారు విఫలయత్నం
- భూసేకరణలో జాప్యంతో అసంపూర్తిగా తెలంగాణ ప్రాజెక్టులు
- మధ్యేమార్గంగా సహేతుక ధర చెల్లించే ప్రతిపాదన
- జీవో 123ను జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
- కొన్ని సందేహాలకు జీవోలో స్పష్టమైన సమాధానం కరువు
- 2013 చట్టం ప్రకారమే పరిహారం చెల్లించాలని ఆందోళనలు
- రైతులు కోరుకున్నట్లుగా పరిహారం ఇచ్చేందుకు కేసీఆర్ ఓకే
 
 అభివృద్ధి కార్యక్రమాలు.. మౌలిక సదుపాయాల కల్పన.. సాగునీటి ప్రాజెక్టులు.. పట్టణీకరణ.. పారిశ్రామిక అవసరాలు.. వీటన్నింటికీ భూమి చాలా కీలకం. అయితే ఇలాంటి వాటి కోసం చేపట్టే భూసేకరణకు ప్రభుత్వాలు ఎంత పరిహారం చెల్లించాలి..? నిర్వాసితులకు పునరావాసం ఎలా కల్పించాలి..? ఇది మరోసారి చర్చనీయాంశంగా మారింది. భూసేకరణ, పునరావాసానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల కిందటే ‘భూసేకరణ, పునరావాసం, పునరాశ్రయం, న్యాయబద్ధమైన నష్టపరిహారం, పారదర్శక హక్కు చట్టం-2013’ను అమల్లోకి తెచ్చిం ది. గ్రామసభలతో సంప్రదింపుల ద్వారా మానవతాపూర్వకంగా, భాగస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు మార్గదర్శకాలను ఇందులో పొందుపరిచింది.

అయితే ఈ చట్టం ప్రకారం పరిహారం చెల్లింపు ప్రక్రియ సంక్లిష్టంగా ఉండటంతో పాటు తీవ్రమైన జాప్యం జరుగుతుందనేది రాష్ట్ర ప్రభుత్వాల వాదన. పారిశ్రామిక అవసరాలకు చేపట్టే భూసేకరణా సంక్లిష్టంగా మారుతోందని చెపుతున్నాయి. దీంతో ఈ చట్టాన్ని సవరించేందుకు ఎన్‌డీఏ ప్రభుత్వం విఫలయత్నం చేసింది. మరోవైపు భూసేకరణలో తీవ్ర జాప్యం కారణంగానే తెలంగాణలో నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టులన్నీ అసంపూర్తిగా ఆగిపోయాయని సీఎం కేసీఆర్ పలుమార్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం సైతం భూసేకరణ చట్టానికి సవరణలు చేయాలని పలుమార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసింది.

అయితే ఇవన్నీ విఫలమవటంతో.. మధ్యే మార్గంగా సహేతుకమైన ధర చెల్లించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగానే గత ఏడాది జూలై 30న 123 జీవోను జారీ చేసింది. భూసేకరణ చట్టంతో సంబంధం లేకుండా నిర్వాసితులకు సహేతుకమైన ధరను చెల్లిస్తే రైతులకు ఉపయుక్తంగా ఉండటంతో పాటు.. ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తవుతాయనేది ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలో అసలు కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టం 2013 ఏం చెపుతోంది..? రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123లో ఏముంది..? ఇవి ఏం చెపుతున్నాయో ఈ వారం సాక్షి ఫోకస్‌లో పరిశీలిద్దాం..    
                    - సాక్షి, హైదరాబాద్
 
 123 జీవో.. సహేతుకమైన ధర
 123 జీవో ప్రకారం ప్రజోపయోగ పనులకు సేకరించే భూములకు, ఆస్తులకు సంబంధించి సదరు యజమానులతో ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుతుంది. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ని ఆరుగురు జిల్లా అధికారుల కమిటీ ఈ ప్రక్రియను చేపడుతుంది. ఈ కమిటీ నేరుగా నిర్వాసితులతో సమావేశమవుతుంది. యజమానులు కోరిన పరిహారాన్ని పరిశీలించి.. బేరసారాలు జరిపి సహేతుకమైన ధర చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంటుంది. ఈ సందర్భంగా తమ భూములు, ఆస్తులు, తన జీవనాధారపు నష్టపరిహారం, పునరావాసం, పునరాశ్రయానికి కావాల్సిన ఖర్చులన్నీ కలిపి ప్రభుత్వం నుంచి పరిహారం తీసుకుంటున్నట్లుగా నిర్వాసితులు సమ్మతి పత్రం అందించాల్సి ఉంటుంది. కమిటీ సమక్షంలో జరిగిన తుది నిర్ణయంపై భవిష్యత్తులో తమకెలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్‌ను సైతం సమర్పించాలి. ఈ అగ్రిమెంట్ ఆధారంగా నిర్వాసితులకు చెందిన భూములు, ఆస్తులన్నీ ప్రభుత్వానికి ధారాదత్తం అవుతాయి. తమకు అఫిడవిట్లు సమర్పించిన భూముల యజమానుల వివరాలతో ప్రభుత్వం పత్రికల ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. అభ్యంతరాల స్వీకరణకు 15 రోజుల గడువిస్తుంది. మరింత వేగంగా భూసేకరణ ప్రక్రియను చేపట్టేందుకు ఈ వ్యవధిని వారం రోజులకు కుదిస్తూ గత ఏడాది అక్టోబర్ 7న ప్రభుత్వం మరో జీవో జారీ చేసింది. సహేతుకమైన ధర ఖరారు చేసే ప్రక్రియలో పునరావాసం, పునరాశ్రయం అనే పదాలను తొలగిస్తూ నవంబర్ 28న మరో జీవో విడుదల చేసింది.
 
 అలజడి రేపిన సందేహాలివే..
 భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం చేసిన చట్టానికి ప్రత్యామ్నాయంగా 123 జీవో జారీ చేసినట్లు స్పష్టమవుతోంది. కానీ సహేతుకమైన ధర అంటే ఎలా లెక్కగడతారు..? నిర్వాసితుల పునరావాసం, పునరాశ్రయాన్ని ప్రభుత్వం పట్టించుకోదా..? జీవనభృతి కల్పించే తదుపరి చర్యలేమీ చేపట్టదా..? అనే సందేహాలకు ఈ జీవో స్పష్టమైన సమాధానం చెప్పలేకపోయింది. ఇవన్నీ నిర్వాసితుల్లో ఆందోళనలకు కారణమయ్యాయి. మరోవైపు ఈ జీవోకు చట్టబద్ధత లేకపోవటం.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ ఇష్టానుసారంగా ఈ ఉత్తర్వులను సడలించే అవకాశం ఉండటం.. కనీసం గ్రామసభతో సంబంధం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలోనే కమిటీ నేరుగా నిర్వాసితులతో బేరసారాలు జరిపి.. ఒప్పందం చేసుకోవటం జబర్దస్తీగా తమ భూములు, ఆస్తులు లాక్కుంటున్నారనే అలజడికి తెరలేపాయి. అందుకే 2013 చట్ట ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని, పునరాశ్రయం కల్పించాలనే డిమాండ్లు తెరపైకి వచ్చాయి. మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం చెల్లింపులో తమకు అన్యాయం జరుగుతోందని ఆందోళనకు దిగటంతో ఈ వ్యవహారం రాజుకుంది. దీంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మల్లన్నసాగర్ పరిధిలోని రైతులు కోరుకున్న విధంగా పరిహారం చెల్లిస్తామని ప్రకటించటం గమనార్హం. 2013 చట్ట ప్రకారమైనా సరే.. 123 జీవో ప్రకారమైనా సరే.. అక్కడి రైతులు కోరుకున్నట్లుగా పరిహారం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.
 
 2013 చట్టంలోని ముఖ్యాంశాలివే..

 అసలు 2013 భూసేకరణ చట్టం ఏం చెబుతోంది.. దాని ప్రకారం నిర్వాసితులకు ఇవ్వాల్సిన పరిహారం, పునరావాసం, పునరాశ్రయమెలా ఉన్నాయనేది కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో 2013 భూసేకరణ చట్టంలోని ముఖ్యాంశాలు ఏమిటో చూద్దాం..
► ముందుగా భూసేకరణ చేపట్టే ప్రాంతాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రామసభలు నిర్వహించాలి. అక్కడి ప్రజలకు తెలియజెప్పాలి. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత నిర్వాసితుల గుర్తింపు, పునరావాస అంచనా పథకం తయారీ, గ్రామసభల్లో బహిరంగంగా విచారణ, అభ్యంతరాల స్వీకరణ, డిక్లరేషన్ ప్రచురణ, నోటీసుల జారీ, కలెక్టర్ ఆధ్వర్యంలో తుది అవార్డు. అభ్యంతరాలకు 60 రోజుల గడువు ఇవ్వాలి.
► భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపు: ముందుగా కలెక్టర్ మార్కెట్ విలువను నిర్ణయిస్తారు. రిజిస్ట్రేషన్ క్రయ విక్రయాల ధర లేదా సమీప గ్రామాల్లో ఉన్న భూముల అమ్మకాల సగటు అమ్మకపు విలువను పరిగణనలోకి తీసుకోవాలి. ఏది ఎక్కువైతే దానిని పరిగణించాలి. పట్టణ ప్రాంతాల్లో అదే రేటు ప్రకారం ఇవ్వాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఆ విలువను రెండుతో హెచ్చించాలి. అసైన్డ్ భూమి, పట్టా లేకుండా సాగులో ఉన్న భూమిని సైతం పట్టా భూమిగా పరిగణించి నష్టపరిహారం లెక్కగట్టాలి.
► దీంతో పాటు భూమి లేదా భవనానికి అనుబంధంగా ఉన్న ఆస్తుల విలువను లెక్కించాలి. భూమిలో ఉన్న పంటలు, మొక్కలు, చెట్ల వల్ల యజమానికి జరిగే నష్టపరిహారం, ఇతర భూమి నుంచి విడగొట్టడం వల్ల జరిగే నష్టం, దీంతో ఇతర స్థిర చరాస్తులకు వాటిల్లే నష్టం, వ్యాపారానికి కలిగే నష్టం కూడా జత చేయాలి.
► చెల్లించాల్సిన మొత్తం పరిహారాన్ని నిర్ధారించిన తర్వాత.. నిర్ధారిత పరిహారానికి వంద శాతం అదనపు మొత్తం ‘సొలీషియం’గా కలిపి తుది అవార్డును నిర్ణయించాలి.
► నిర్వాసితులకు ఇళ్లు: నిర్వాసితులకు ఇందిరా ఆవాస్ యోజ న ప్రమాణాల మేరకు ఇంటిని నిర్మించి ఇవ్వాలి. పట్టణ ప్రాంతాల్లో ఇల్లు కోల్పోతే 50 చదరపు మీటర్ల నిర్మాణ స్థలం కంటే తక్కువ కాని విస్తీర్ణంలో ఇల్లు నిర్మించి ఇవ్వాలి. ఏదైనా కుటుంబం ఇంటిని తీసుకోవడానికి అంగీకరించకపోతే.. ఇల్లు కట్టుకోవడానికి వీలుగా ఆర్థిక సాయం అందించాలి. గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఇంటికయ్యే వ్యయం చెల్లించాలి. పట్టణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల కంటే తక్కువ కాకుండా ఇవ్వాలి.
► భూమికి భూమి: భూసేకరణతో భూమి లేని కుటుంబంగా మారిన కుటుంబాలకు ఆ ప్రాంతంలో చేపట్టే సాగునీటి ప్రాజెక్టు ఆయకట్టులో కనీసం ఒక్కో ఎకరం సాగు భూమిని ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు రెండున్నర ఎకరాలు లేదా వాళ్లు కోల్పోయినంత భూమి.. ఏది తక్కువైతే అది ఇవ్వాలి.
► వార్షిక భృతి: ప్రాజెక్టుల వల్ల ఉద్యోగాలు కల్పించబడితే బాధిత కుటుంబంలో కనీసం ఒకరికి ఉద్యోగ అవకాశం ఇవ్వడం లేదా ప్రతి బాధిత కుటుంబానికి ఒకే దఫా రూ.5 లక్షల చెల్లింపు లేదా ప్రతి కుటుంబానికీ నెలకు కనీసం రూ.2 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వార్షిక చెల్లింపులు చేయాలి.
► నిర్వాసితులైన ప్రతి కుటుంబానికీ అవార్డు ప్రకటించిన తేదీ నుంచి ఏడాది పాటు నెలకు కనీసం రూ.3 వేల లెక్కన నెలసరి జీవన మనుగడ వేతనం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలైతే మనుగడ వేతనంతో పాటు రూ.50 వేలు అదనంగా చెల్లించాలి.
► బాధిత కుటుంబాన్నీ, భవన సామగ్రిని, ఇతర వస్తువులను, పశుజీవాలను తరలించేందుకు రవాణా ఖర్చులుగా ఒకే దఫాగా రూ.50 వేల ఆర్థిక సాయం చెల్లించాలి.
► పశువుల కొట్టాలు, చిన్న చిన్న దుకాణాలకు వేరేచోట తిరిగి నిర్మించుకునేందుకు కనీసం రూ.25 వేలకు తక్కువ కాకుండా నోటిఫికేషన్ జారీ చేసి బాధితులకు చెల్లించాలి.
► వృత్తి పనివాళ్లు, చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి కలిగిన వారు నిర్వాసితులైతే ప్రతి కుటుంబానికీ కనీసం రూ.25 వేలకు తక్కువ కాకుండా ఒకే దఫా చెల్లించాలి.
► సాగునీటి, జల విద్యుత్తు ప్రాజెక్టులకు సంబంధించిన బాధిత కుటుంబాలకు రిజర్వాయర్లలో చేపలు పట్టుకోవడానికి హక్కులు కల్పించాలి.
► ప్రతి బాధిత కుటుంబానికీ ఒకే దఫా ‘రీసెటిల్‌మెంట్ వేతనం’గా రూ.50 వేలు చెల్లించాలి.
► బాధితులకు కేటాయించే భూమి, ఇంటి రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ ఖర్చును భూమి సేకరించిన సంస్థనే భరించాలి. కేటాయించే భూమి లేదా ఇల్లు ఎలాంటి చిక్కులు, వివాదాల్లో ఉండకూడదు.
► నిర్వాసితులు వేరేచోట పునరావాసం పొందడానికి వీలుగా కనీస మౌలిక సౌకర్యాలను కల్పించే బాధ్యత సదరు సంస్థదే. పునరావాసం కల్పించిన గ్రామాల్లో రోడ్లు, దారులు, బాధిత కుటుంబాలకు వాటిపై హక్కులు కల్పించాలి.
► పునరావాస ప్రాంతంలో నివాసం ఉండటానికి ముందే సరైన డ్రైనేజీ, పారిశుద్ధ్య ప్రణాళికలు పూర్తి చేయాలి.
► ప్రతి బాధిత కుటుంబానికీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సురక్షిత తాగునీటి వనరులను కల్పించాలి. ప్రతి ఇంటికీ విద్యుత్ కనెక్షన్ ఉండాలి. పశుజీవాలకు తాగునీటి వసతి, మేత వనరులు కల్పించాలి.
► అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, పిల్లలకు ఆట స్థలాలు, ప్రతి వంద కుటుంబాలకో కమ్యూనిటీ సెంటర్, దేవాలయాలు, చావడి, రెండు కిలోమీటర్ల పరిధిలో ఉప ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పశువైద్య కేంద్రాలు, రేషన్ షాపులు, పంచాయతీ కేంద్రాలు, పోస్టాఫీసులు, విత్తనాలు, ఎరువుల నిల్వ కేంద్రాలు అందుబాటులో ఉండాలి. వీధి దీపాలు, తగిన రవాణా సౌకర్యాలు, ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉండాలి.
► బాధిత కుటుంబాలకు కేటాయించిన వ్యవసాయ భూములకు సాగునీటి వసతి కల్పించాలి. ప్రాజెక్టు ఆయకట్టు లేకపోతే ప్రభుత్వ పథకం లేదా ప్రత్యేక సాయంతో ఈ సదుపాయం కల్పించాలి.
► కులాలు, సముదాయాలు, ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా శ్మశాన వాటికలు నిర్మించాలి.
► అటవీ నివాస కుటుంబాలకు అటవీ ఉత్పత్తులపై అటవీ హక్కులు కల్పించాలి. బతుకుదెరువు వనరులపై ఉన్న హక్కులు కొనసాగించాలి. సంప్రదాయ గిరిజన సంస్థలకు ప్రత్యేకంగా భూమి కేటాయించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement