జన్మ సార్థకతతోనే స్వర్గ ప్రాప్తి | islam schoolers meet in islamic get to gether in hyderabad | Sakshi
Sakshi News home page

జన్మ సార్థకతతోనే స్వర్గ ప్రాప్తి

Published Sun, Nov 22 2015 2:12 AM | Last Updated on Mon, Apr 8 2019 7:08 PM

జన్మ సార్థకతతోనే స్వర్గ ప్రాప్తి - Sakshi

జన్మ సార్థకతతోనే స్వర్గ ప్రాప్తి

ఇస్లామిక్ సమ్మేళనంలో పండితులు
 ♦ రెండు లక్షల మంది హాజరు
 సాక్షి, హైదరాబాద్: దేవుడు (అల్లా) ఇచ్చిన వరం మానవ జన్మ అని, దాన్ని సార్థకం చేసుకోగలిగినప్పుడే స్వర్గ ప్రాప్తి లభిస్తుందని ఇస్లాం స్కాలర్స్ చెప్పారు. తబ్లిక్ జమాత్ ఆధ్వర్యంలో పహాడీషరీఫ్‌లో మూడు రోజుల ప్రపంచ స్థాయి ఇస్లామిక్ (ఇజ్తేమా) సమ్మేళనం శనివారం ప్రారంభమైంది. తొలి రోజు భారీ స్థాయిలో దాదాపు రెండు లక్షల మంది హాజరయ్యారు. ఇందులో బెంగళూర్‌కు చెందిన ఇస్లాం పండితుడు మౌలానా ఖాసీం ఖురేషీ ప్రసంగిస్తూ... ‘మానవ జన్మ ఒక పరీక్ష లాంటిది. దానిని సార్థకం చేసుకోవాలి. మంచి లక్షణాలతో మనుగడ సాగించాలి.
ఒక మంచి కుమారుడిగా, అన్నగా, భర్తగా, తండ్రిగా, సమాజంలో ఒక పౌరుడిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వర్తించినప్పుడే జన్మ సార్థకమవుతుంది. ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు. రాబోయే బంగరు జీవితాన్ని మరిచి తాత్కాలిక ఉపశమనాల కోసం ప్రాకులాడవద్దు. మనిషిని మనిషిగా గుర్తించి మానవత్వాన్ని చాటాలి. క్రమశిక్షణతో వ్యక్తిగత జీవితం నీతి నిజాయితీగా కొనసాగించి నప్పుడే ప్రవక్త చూపిన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది’ అన్నారు. న్యూ ఢిల్లీకి చెందిన స్కాలర్ మౌలానా షౌకత్ మాట్లాడుతూ... ‘మనిషికి బతికినంతవరకే విలువ. మరణాంతరం జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. తోటివారికి హాని తలపెట్టవద్దు. శాంతిని ప్రబోధించాలి. మహ్మద్ ప్రవక్త చూపించిన సన్మార్గంలో నడిచినప్పుడే సంపూర్ణ అత్మ శుద్ధిగల మానవుడిగా మారతారు. ఆధ్యాత్మిక చింతన సన్మార్గంలో నడిపించడానికి ఎంతో దోహద పడుతుంది’ అన్నారు. కార్యక్రమంలో భాషా మొయినోద్దీన ఆష్రఫ్ అలీ ఇఖ్రమలీ, వసీమోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. 
 రెండు వేలకు పైగా పండితులు 
 ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాలకు చెందిన సుమారు రెండు వేల మందికి పైగా ఇస్లాం పండితులు ఈ సమ్మేళనంలో పాల్గొంటున్నారు. ఆదివారం మరింతమంది ప్రముఖ పండితుల ఆధ్యాత్మిక ప్రసంగాలు ఉన్నాయి. ఈ క్రమంలో రెండో రోజూ భారీ సంఖ్యలో ముస్లింలు హాజరయ్యే అవకాశం ఉందని తబ్లిక్ జమాత్ కమిటీ పేర్కొంది. సమ్మేళానానికి పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పార్కింగ్ తదితర సౌకర్యాలు కల్పించారు. సోమవారంతో సమ్మేళనం ముగుస్తుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement