ఐటీ..కొండంత అండ
ఇక్కడ రాత్రి పగలు అన్న తేడా ఉండదు. ల్యాప్‌టాప్‌లు భుజాన వేసుకుని వచ్చిపోయే ఐటీ ఉద్యోగులతో నిండుగా ఉంటుంది. నైట్ షిఫ్ట్ ముగిసి ఇంటికెళ్లే వారు.. మొదటి షిఫ్ట్‌కు వచ్చేవారికి గుడ్‌మార్నింగ్.. అంటూ రోజు మొదలవుతుంది. అర్ధరాత్రి వేళ వేడి వేడి ఇడ్లీలు అందించేందుకు రోడ్డుపక్కన బళ్లు.. ఆనందాన్ని ఇచ్చేదుకు షాపింగ్ మాళ్లు.. విహారానికి దుర్గం చెరువు.. సరదా కోసం శిల్పకళా వేదిక.. వివిధ షిఫ్టుల్లో బిజీగా ఉండేవారికి నైట్ బజార్.. నగరం నిద్రపోతున్నా ‘కొండాపూర్’ మాత్రం మేల్కొనే ఉంటుంది.
- గచ్చిబౌలి
శేరిలింగంపల్లి డివిజన్‌లో అంతర్భాంగంగా ఉన్న కొండాపూర్‌ను పునర్విభజనలో నూతన డివిజన్‌గా ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌లో దాదాపు 400 ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీటి నుంచి గ్రేటర్‌కు అధిక ఆదాయం సైతం వస్తోంది. శిల్పారామం, దుర్గం చెరువు వంటి పర్యాటక ప్రాంతాలకు నెలవు. 8వ టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, బయోడైవర్సిటీ పార్కు, ఏరియా ఆస్పత్రి ఉన్నాయి. అత్యంత ప్రాధాన్యత గల డివిజన్‌గా కొండాపూర్‌ను చెప్పవచ్చు. కొండాపూర్ డివిజన్‌లోని లుంబినీ విల్లాస్‌లో రాష్ట్ర దేవాదయ శాఖా మంత్రి ఇంద్ర కరణ్‌రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్‌రెడ్డి నివాసం ఉంటున్నారు.
డివిజన్‌లోని కాలనీలు..
కొండాపూర్ డివిజన్‌లో గుల్షన్‌నగర్, జనార్దన హిల్స్, డైమండ్ హిల్స్, పత్రికానగర్ , రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీ కాలనీ, తులీప్ గార్డెన్, గౌతమీ ఎన్‌క్లేవ్, ఆనంద్‌నగర్, ప్రశాంత్‌నగర్, కొత్తగూడ, ప్రశాంతినగర్, వైట్‌ఫీల్డ్, టీఎస్‌ఎస్‌పీ క్వార్టర్స్, విఠల్‌రావునగర్, గఫూర్‌నగర్, మెగాహిల్స్, కావూరిహిల్స్ ప్రాంతాలు ఉన్నాయి. ఈ డివిజన్‌లో ఉన్న దుర్గం చెరువు నిజాం నవాబులకు తాగునీరు అందించేది. ఇప్పుడిది మురికి కుంటగా మారింది. 60 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఐటీ కారిడార్‌లో పర్యాటక కేంద్రంగా ఉన్న దుర్గం చెరువు అభివృద్ధిని అధికారులు మరిచిపోయారు. కాలనీలు, ఐటీ కంపెనీల నుంచి వచ్చే మురుగు యథేచ్ఛగా ఈ చెరువులో కలిసి కంపు కొడుతోంది.
నిండ నివ్వరు... ఎండనివ్వరు
దుర్గం చెరువుకు రెండు వైపులా ప్రమాదం పొంచి ఉంది. వర్షాకాలంలో ఎఫ్‌టీఎల్‌లో నివాసితులు దుర్గం చెరువు నిండకుండా ఎప్పటికప్పుడు నీళ్లను కిందకు వదులుతారు. మరోవైపు పై కాలనీలు, ఇన్బాట్ మాల్ వైపు నుంచి వచ్చే ముగురు నీరుతో వేసవిలోనూ చెరువు ఎండిపోకుండా కంపు కొడుతోంది. మురుగు నీటికి అడ్డు కట్ట వేసి చెరువును అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది.
తీవ్ర నీటి సమస్య
కొండాపూర్ డివిజన్‌లో మంచి నీటి సమస్య తీవ్రంగా ఉంది. డివిజన్‌లో దుర్గం చెరువు, నేరాల చెరువు, బరంకుంట ఉన్నాయి. ఈ చెరువులన్నీ ఎండిపోయాయి. దీంతో భూగర్భ జాలాలు పాతాళానికి అడుగంటాయని చెప్పవచ్చు. డివిజన్ పరిధిలో 2 వేల అడుగుల వరకు బోర్లు వేసినా దుమ్ము మాత్రమే వస్తోంది. దీంతో ప్రజలు ప్రైవేట్, మంజీరా ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు.
మెట్రో వాటర్‌వర్క్స్ సరఫరా చేస్తున్న నీళ్లు ఏ మూలకు సరిపోవడం లేదు. మాదాపూర్‌లోని రిజర్వాయర్ ఈ డివిజన్‌లో ఉన్నా నీటి కష్టాలు తప్పడం లేదు. అపార్ట్‌మెంట్లకు ప్రైవేట్ ట్యాంకర్లే దిక్కయ్యాయి. ఒక్క రాఘవేంద్రకాలనీలోనే రోజుకు దాదాపు వంద ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చీకట్లో ఉంటున్నాం..
వీధి దీపాలు ఏర్పాటు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఎన్నోసార్లు కోరాం. ఇప్పటి వరకు 50 శాతం వీధి దీపాలు ఏర్పాటు చేశారు. రెండు మూడు ప్రాంతాల్లో వీధి దీపాలు అమర్చి చేతులు దులుపుకున్నారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
- బాల్‌రెడ్డి, రాఘవేంద్ర కాలనీ సి-బ్లాక్ వెల్ఫేర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు
రోగాలబారిన పడుతున్నాం
ఏడాది నుంచి ఇళ్ల ముందే మురుగు పారుతోంది. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే భయమేస్తోంది. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. ఈ సమస్య పరిష్కరించేదెవరు..?
- మాసమ్మ, అంజయ్యనగర్
ఓటర్ల సంఖ్య
మొత్తం ఓటర్లు : 67,181
పురుషులు : 38,669
మహిళా ఓటర్లు: 28,512
పోలింగ్ స్టేషన్లు : 76