
అది ‘గుడ్’ పార్క్
- పారిశ్రామిక అభివృద్ధికే మెగా ఆక్వా ఫుడ్ పార్క్: సీఎం చంద్రబాబు
- కాలుష్య కారకం కానే కాదు.. ప్రజలకు నచ్చజెప్పండన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక అభివృద్ధి కోసమే మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇది కాలుష్యకారకం కాదని, కాలుష్యం కలిగించేదిగా ఉంటే అనుమతులిచ్చే పరిస్థితి తలెత్తదన్నారు. వ్యర్థాల్ని శుద్ధి చేసిన ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా సముద్రంలో కలిసేలా చేస్తామన్నారు. ప్రశాంతమైన పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని స్వార్థశక్తులు అలజడి సృష్టించాలని ప్రయత్నించడం దారుణమన్నారు. దురుద్దేశంతో చేస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దంటూ ప్రజలను కోరారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మిస్తున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌పై వ్యక్తమవుతున్న ప్రజాందోళన నేపథ్యంలో సీఎం ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష జరిపారు. సీఎం మాట్లాడుతూ.. పరిశ్రమలతోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయని, వేగంగా అభివృద్ధి చెందాలంటే పారిశ్రామికీకరణ తప్పదనే విషయాన్ని ప్రజలకు నచ్చచెప్పాలని అధికారులకు సూచించారు.
అపోహలు తొలగించేందుకు కమిటీ..
పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు అన్యాయం చేసే ప్రసక్తే లేదని, జిల్లా అభివృద్ధికి సర్వదా కట్టుబడి ఉంటామని సీఎం చెప్పారు. మెగా ఆక్వా ఫుడ్ పార్క్ సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడంతోపాటు ఫుడ్ పార్క్‌పై అపోహలు తొలగించాలని కమిటీకి సూచించారు. కాలుష్య నియంత్రణకు సంబంధించి రెండు మూడు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు. కాగా, యనమర్రు డ్రెయిన్ ప్రక్షాళనకు కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్(సీఈటీపీ)ని ఏర్పాటు చేసి తొమ్మిది నెలల్లో నీటిని శుద్ధి చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలిచ్చారు.
తరలింపు సాధ్యపడదు..
ఇదిలా ఉండగా గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్క్‌ను అక్కడినుంచి తరలించడం సాధ్యపడదని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఫుడ్ పార్క్ ఏర్పాటుకు ఇప్పటికే పరిశ్రమ యాజమాన్యం రూ.25 కోట్ల వరకు ఖర్చు చేసినందున మరో ప్రాంతానికి తరలించడం కుదరదని వారు సీఎంతో చెప్పారు. దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ కాలుష్య నియంత్రణపై నిబంధనలు ఉల్లంఘించినా, అలసత్వం ప్రదర్శించినా చర్యలకు వెనకాడవద్దని అధికారుల్ని ఆదేశించారు.