భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణానా? | janareddy fired on trs party | Sakshi
Sakshi News home page

భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణానా?

Published Wed, Jun 15 2016 3:26 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణానా? - Sakshi

భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణానా?

టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై జానా ధ్వజం
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌పై కేసీఆర్‌కు కృతజ్ఞత లేదు

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు జుగుప్సాకరంగా, అత్యంత హేయంగా ఉన్నాయని సీఎల్పీ నేత కె.జానారెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని... తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీపట్ల కేసీఆర్‌కు కనీస కృతజ్ఞతలేదని దుయ్యబట్టారు. భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణ తెస్తారా అని నిలదీశారు. అభివృద్ధి ముసుగులో జరుగుతున్న ఫిరాయింపులు అత్యంత హేయమైనవని విమర్శించారు. బంగారు తెలంగాణ కోసం తాము టీఆర్‌ఎస్‌లో చేరుతున్నామంటూ పార్టీ ఎంపీ గుత్తాతోపాటు ఎమ్మెల్యే భాస్కర్‌రావు, మాజీ ఎంపీ వివేక్, మాజీ మంత్రి వినోద్‌లు ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌లో శాసనమండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలసి జానా విలేకరులతో మాట్లాడారు. అప్రజాస్వామ్యరీతిలో స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు పార్టీలు మారుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారాలనుకునేవారు తమ పదవులకు రాజీనామా చేసి మరో పార్టీలోకి వెళ్లాలని జానా డిమాండ్ చేశారు.

 రాజకీయ విలువలేవీ...
సామాజిక న్యాయం, ప్రజలు, ఉద్యోగుల కోసం కొత్త రాష్ట్రంలో విలువలతో కూడిన రాజకీయాలు ఉంటాయని తాను ఆశించానని..కానీ ఇప్పుడున్న రాజకీయాలు భ్రష్టుపట్టిపోయి, జుగుప్సాకరంగా ఉన్నాయని జానా విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి అన్యాయం చేస్తూ కాంగ్రెస్‌ను అడుగడుగునా కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రలోభాలకు గురిచేస్తూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని విమర్శించా రు. ఫిరాయింపుల విషయంలో దేశంలోనే టీఆర్‌ఎస్ అప్రతిష్టను తెచ్చుకుందన్నారు. ఈ విషయంలో చట్టప్రకారం, న్యాయం కోసం పోరాటం చేస్తామన్నారు. అనైతిక ఫిరాయింపులపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలన్నారు. ఫిరాయింపుల చట్టాన్ని కఠినతరం చేయడానికి ప్రధాని మోదీ చొరవ తీసుకోవాలని జానా కోరారు.

 సామాన్య కార్యకర్తగా పనిచేస్తా...
సీఎల్పీ నాయకత్వం సహా పదవులన్నీ వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని జానా తెలిపారు. పదవులను వదులుకు నే విషయాన్ని సోనియాకు తెలియజేసి ఆ తరువాత ముం దుకు నడుస్తానన్నారు. పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదని, తొలి నుంచీ నీతివంతమైన రాజకీయాల కోసమే పనిచేస్తూ వస్తున్నానన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీఎం పదవిని కూడా వద్దనుకున్నట్లు జానా చెప్పారు. వయసు మీదపడినా పార్టీ కోసం పనిచేస్తున్నానని, పదవుల కోసం కాకుండా పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తానన్నారు. భ్రష్టు రాజకీయాలతో బంగారు తెలంగాణ రాదని, నీతివంతమైన రాజకీయాలతోనే బంగారు తెలంగాణ వస్తుందన్నారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు తనకు ఆత్మబంధువు కాదని, ఆత్మయితే కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లేవాడే కాదని జానా స్పష్టం చేశారు.

గుత్తాలో వచ్చిన మార్పేమిటో..
ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని అభివృద్ధి నిరోధకుడని అసెంబ్లీ సాక్షిగా విమర్శించిన సీఎం కేసీఆర్... ఇంతలోనే ఆయనలో వచ్చిన మార్పు ఏమిటో ప్రజలకు చెప్పాలని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. గుత్తా మిషన్ భగీరథకు అడ్డుపడుతున్నారని కేసీఆర్ అసెంబ్లీలోనే ఆరోపించారని గుర్తుచేశారు. ఇప్పటిదాకా తెలంగాణ ద్రోహి, అభివృద్ధి నిరోధకుడైన గుత్తా ఇప్పుడు అభివృద్ధి కాముకుడెలా అయ్యాడని ప్రశ్నించారు. సీఎల్పీ పదవి నుంచి జానా వైదొలగాల్సిన అవసరం లేదన్నారు. కష్టకాలంలో ఉన్న పార్టీ అభివృద్ధి కోసం అందరం కష్టపడదామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement