జర్నలిస్టుల నిరసనలపై కేటీఆర్ ఆగ్రహం
* ఉనికి చాటుకునేందుకే ధర్నాలు, నిరసనలు
* త్వరలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
* సభ్యత, సంస్కారం మరచి వార్తల ప్రచురణ సరికాదు
* ఉత్తమ ఫొటోగ్రాఫర్లకు బహుమతుల ప్రదానోత్సవంలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మాట్లాడి పరిష్కరించుకునే సమస్యలను ఆందోళనల దాకా తీసుకెళ్లడం ఏమిటని జర్నలిస్టు నేతలపై రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉనికి చాటుకునే ఆరాటంతో ధర్నాలు, నిరసనలు చేయటం ఇకనైనా మానుకోవాలని సూచించారు. తాము చేసే సంక్షేమ కార్యక్రమాలను ఇప్పటికైనా గుర్తించాలన్నారు.
రాష్ట్రంలోని జర్నలిస్టులకు న్యాయం చేస్తామని, హెల్త్‌కార్డులు, అక్రిడిటేషన్లు, పెన్షన్లు, ఇళ్ల స్థలాల సమస్యల పరి ష్కారంపై సమాచార శాఖ కమిషనర్‌తో మాట్లాడి త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్, భాషా సాంస్కృతిక శాఖల ఆధ్వర్యం లో శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్‌లో ఫొటోగ్రాఫర్స్‌కు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘కొన్ని పత్రికలు సభ్యత, సం స్కారం మరిచి పోతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కొంత మంది అదేపనిగా చేస్తున్న చౌకబారు విమర్శలకు ప్రాధాన్యత ఇస్తున్నా యి. వాటిని స్వీయ సెన్సార్ లేకుండా యథాతథంగా ప్రచురిస్తున్నారు. పత్రికలకు ఇది ఏమాత్రం తగదు’ అని చెప్పారు.
సీఎం కేసీఆర్‌పై ఎవరేం మాట్లాడినా ఎడిటింగ్ లేకుం డా మెయిన్ పేజీలో పెడతారని, అదే పొరుగు రాష్ట్ర పాలకులపై హైకోర్టు మొట్టికాయలు వేసినావాటికి ప్రాధాన్యత ఇవ్వరని ఆక్షేపిం చారు. కేసీఆర్‌ను ఇతరులు తిడితే యథాతథంగా ప్రచురించే సంస్కృతికి కొన్ని పత్రికలు వచ్చేశాయన్నారు. ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఇప్పటికీ బాలారిష్టాలు అధిగమించే దశలోనే ఉన్నాయని, ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న తెలంగాణలో కొన్ని సమస్యలుం టాయని, వాటిని అర్థం చేసుకోవాలని జర్నలి స్టులను కోరారు. ఉద్యమం చూడని ఓ పెద్దాయన పదవీ విరమణ తర్వాత పాలకులపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారన్నారు.
జస్టిస్ చంద్రకుమార్ ఎవరు..?
ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జస్టిస్ చంద్రకుమార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు చంద్ర కుమార్ ఎవరని ప్రశ్నించారు. ఉద్యమంలో ఆయన పాత్రే లేదని, జర్నలిస్టుల గురించి ఆయనకు ఏం తెలుసన్నారు. జస్టిస్ అన్న విష యం మరచి ఆయన మాట్లాడటం తగదన్నారు. తమ జోలికి రావొద్దని, వస్తే బాగోదని ఆయనకు తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
బెస్ట్ న్యూస్ పిక్చర్ కింద మహబూబ్‌నగర్ జిల్లా సాక్షి ఫొటోగ్రాఫర్ వడ్ల భాస్కర్‌కు మొదటి బహుమతి దక్కింది. హైదరాబాద్ సాక్షి ఫొటోగ్రాఫర్ ఠాకూర్ సన్నీసింగ్‌కు మూడో బహుమతి లభించింది. అనంతరం వారిని సత్కరించి, ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ డెరైక్టర్ మామిడి హరికృష్ణ, ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్, కాంత్రి కిరణ్, పల్లె రవి తదితరులు పాల్గొన్నారు.