
దురుద్దేశంతోనే సీఎం విమర్శలు
► బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్
► జీఎస్టీపై కేంద్రం మీద ఆరోపణలు సరికాదు
► జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలూ ఉన్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ ఎదుగు దలకు భయపడి రాజకీయ దురుద్దేశంతోనే జీఎస్టీ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రెండురోజులుగా మాట్లాడుతున్న మాటలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయన్నారు. జీఎస్టీ రూపకల్పనలో ఆర్థికమంత్రి ఈటల రాజేందర్, మంత్రి కేటీఆర్ కూడా భాగస్వాములన్నారు. కేవలం కేంద్ర ప్రభుత్వంపైనే తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు.
జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలున్నాయని అన్నారు. జీఎస్టీతో సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రోడ్ల నిర్మాణంపై రాష్ట్రంమీద రూ.19 వేల కోట్లు అదనంగా భారం పడుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడం సరికాదన్నారు. ఆయన అన్నీ తప్పుడు లెక్కలు చెప్పారని, సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ ఇలా తప్పుడు లెక్కలు చెప్పడం భావ్యం కాదని లక్ష్మణ్ సూచించారు. సిమెంట్, కంకర, స్టీల్ లాంటి వస్తువులపై 10 శాతం పన్ను తగ్గిందని, అయినా ఇంకా భారం అంటే ఎలా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలు, న్యాయపోరాటం అనే హెచ్చరికలు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
రాష్ట్రాల వారీగా ఇంకా భారం పడే అంశాలుంటే జీఎస్టీ కౌన్సిల్‌లో మాట్లాడటానికి అవకాశం ఉందన్నారు. కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడకుండానే పోరాటం, సమరం అనడం విడ్డూరమన్నారు. అవసరమైతే అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలని, అందరూ కలసి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని లక్ష్మణ్ సూచించారు. రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, జీఎస్టీ దేశ భవిష్యత్తు అని అసెంబ్లీలోనే మాట్లాడిన సీఎం కేసీఆర్ ఇప్పుడెందుకు మాట మార్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలపై ఏమైనా భారం పడితే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించడానికి రాష్ట్ర బీజేపీ సిద్ధంగా ఉందని లక్ష్మణ్ చెప్పారు.