
వైఎస్సార్‌సీపీ గూటికి కాసు మహేశ్‌రెడ్డి
మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.
- పార్టీ అధినేత వైఎస్ జగన్‌తో భేటీ
- ఈ నెల 16న పార్టీలో చేరిక
సాక్షి, అమరావతి బ్యూరో/హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి మనుమడు, కాంగ్రెస్ మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి తనయుడు కాసు మహేశ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, పార్టీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి, నర్సారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మహేశ్‌రెడ్డి ఆదివారం హైదరాబాద్ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి షరతులు లేకుండా తాను పార్టీలో చేరాలనుకుంటున్నట్లు వివరించారు. కలిసి పని చేద్దాం, పార్టీలోకి రండి అని వైఎస్ జగన్ ఆహ్వానించారని తెలిపారు. తన తండ్రి కాసు కృష్ణారెడ్డి 1978లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో కలిసి సుదీర్ఘకాలంపాటు ఒకే సిద్ధాంతం కోసం పోరాడారన్నారు. తాను కూడా జగన్‌తో కలిసి పని చేయాలనే నిర్ణయానికి వచ్చానన్నారు. నరసరావుపేటలో ఈ నెల 16న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీలో అధికారికంగా చేరనున్నట్లు ప్రకటించారు.