జగ్జీవన్ గొప్ప సమతావాది: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్రోద్యమంలో పాల్గొనడంతో పాటు దేశ సామాజిక స్థితిగతులకు సరిపోయేలా భారత్‌ను తీర్చిదిద్దడంలో డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ కృషి ఎంతో ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. మంగళవారం జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకొని దేశానికి ఆయన చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, సంఘ సంస్కర్తగా, సమతావాదిగా, ప్రజా నాయకుడిగా ఆయన ప్రజలకు చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు.
ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి
మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన జయంతి సందర్భంగా పలువురు వక్తలు పిలుపునిచ్చారు. రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన జగ్జీవన్‌రామ్ 109వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం బషీర్‌బాగ్‌లోని ఆయన విగ్రహానికి ఉత్సవాల కమిటీ చైర్మన్, ఎస్సీ శాఖ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి నివాళులర్పించారు. దళిత కల్యాణ వేదిక ఆధ్వర్యంలో ఆదర్శ, కులాంతర వివాహాలు చేసుకున్న పలు జంటలతో ప్రమాణం చేయించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రూ.లక్ష సహాయం, రెండు పడకల గది, ఉద్యోగాల్లో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ఈ వేదిక చైర్మన్ రేణిగుంట్ల ఎల్లయ్య విజ్ఞప్తి చేశారు.
అవకాశాలను వినియోగించుకోవాలి: చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్
రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను ఉపయోగించుకుని జీవిత లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. దళిత వర్గాల విముక్తికి చదువు ఒక్కటే మార్గమని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, రక్షణలతో ముందుకు సాగాలన్నారు. మహనీయులకు మరణం ఉండదని సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ఎస్సీలకిచ్చే రుణాలను బ్యాంకుల ద్వారా కాకుండా సిడ్బి బ్యాంక్, మండల సమాఖ్యల ద్వారా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి తెలిపారు.