ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సీఎం క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం
శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు, ప్రముఖులు, నేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఉదయాన్నే వేద పండితులు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. కేసీఆర్‌కు ఆయన సతీమణి శోభ, కుమారుడు, మంత్రి కె.తారకరామారావు, కూతురు, ఎంపీ కవిత, ఇతర కుటుంబ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
సీఎంను కలసి శుభాకాంక్షలు తెలి పేందుకు వచ్చిన వారితో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి రాజాసదారాం, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, ఈటల రాజేందర్, తలసాని, లక్ష్మారెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి,మహేందర్‌రెడ్డి, జోగు రామన్న, ఎంపీలు బీబీ పాటిల్, బూర నర్సయ్యగౌడ్, ప్రభాకర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీఎంవో అధికారులు, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, సింగరేణి సీఎండీ శ్రీధర్, జీహెచ్‌ఎంసీ మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్, ఐఅండ్‌పీఆర్ కమిషనర్ నవీన్ మిట్టల్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాడుగుల నాగఫణిశర్మ, సినీ నటుడు వేణుమాధవ్, సీఎంవో బీట్ జర్నలిస్టులు ఉదయాన్నే క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ ఫోన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెప్పారు. సీఎం దంపతుల చిత్రాలతో రూపొందించిన ధర్మవరం పట్టు శాలువాను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి కేసీఆర్‌కు అందజేశారు.
పెద్దమ్మ ఆలయంలో పూజలు
జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ ఆలయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్, ఆయన సతీమణి శోభ, కోడలు శైలిమ, కూతురు కవిత అమ్మవారి దర్శనానికి రాగా ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయ మర్యాదలతో పెద్దమ్మ దేవాలయ కార్యనిర్వహణాధికారి ఎ. బాలాజీ ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆయన సతీమణి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. అనంతరం వేద పండితులు సీఎంను శాలువాతో సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని కానుకగా ఇచ్చి ఆశీర్వచనాలు అందజేశారు. పెద్దమ్మ గుడి వద్ద సీఎం కేసీఆర్‌తో మంత్రి తలసాని భారీ కేక్ కట్ చేయించారు. అనంతరం 15 వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
తెలంగాణ భవన్‌లో...
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించింది. బుధవారం నిర్వహించిన ఈ వేడుకలకు హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. సీఎం పుట్టిన రోజు సందర్భంగా టీఆర్‌ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్విహ ంచింది. పలువురు విద్యార్థులు, పార్టీ కార్యకర్తలు రక్తదానం చేశారు.
నాన్నే నా హీరో: కేటీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమారుడు, మంత్రి కె.తారకరామారావు ట్వీటర్‌లోనూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మై హీరో.. నాకు స్ఫూర్తి ప్రదాత.. గొప్ప తండ్రిగా కేసీఆర్‌ను అభివర్ణిస్తూ ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. తన తండ్రి చేయి పట్టుకుని నడిచిన చిన్ననాటి అనుభవాలను గుర్తు చేసుకుంటూ నాలుగు ఫొటోలను సైతం ఈ పోస్ట్‌కు జత చేశారు.
కేసీఆర్ దంపతులతో చిన్ననాటి కేటీఆర్