తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి | kcr discuss the yadadri design planings | Sakshi
Sakshi News home page

తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి

Published Tue, Sep 1 2015 1:57 AM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి - Sakshi

తెలంగాణకు వన్నె తెచ్చేలా యాదాద్రి

అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: ఆధ్యాత్మికత, ప్రకృతి రమణీయత కలగలిపి తెలంగాణకే వన్నె తెచ్చేలా యాదాద్రిని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. యాదాద్రి ఆలయ అభివృద్ధితోపాటు పరిసరాలను తీర్చిదిద్దటానికిగాను ఆలయ స్థపతి ఆనంద్‌సాయి, ఆర్కిటెక్ట్‌లు రాజు, జగన్‌లు రూపొందించిన ప్రణాళికలను సోమవారం సీఎం పరిశీలించారు.

ఈ సందర్భంగా యాదాద్రి డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు, ఆర్కిటెక్ట్‌లతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం క్యాంపు ఆఫీస్‌లో సమీక్షించారు. యాదగిరిగుట్టపై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించే ప్రధాన ఆలయప్రాంగణం, నాలుగు మాడవీధులు, నాలుగు రాజగోపురాలు, కాలి నడకమార్గం, భక్తుల క్యూ కాంప్లెక్సులు, బ్రహ్మోత్సవాల ప్రాంతం, ఈశాన్యంలో పుష్కరిణి విస్తరణ, తూర్పున శివాలయం, భారీ ఆంజనేయస్వామి విగ్రహం, పశ్చిమాన ప్రధాన ప్రవేశద్వారం, తదితర నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఆలయ ప్రాంగణం నాలుగువైపులా పాకశాల, అద్దాల మండపం, కల్యాణ మండపం తదితర నమూనాలను కూడా పరిశీలించారు. గతంలో సీఎం యాదాద్రికి వెళ్లిన సందర్భంలో చేసిన సూచనల ఆధారంగా ఈ నమూనాలను సిద్ధం చేశారు. ప్రధాన ఆలయంలో భాగంగానే పుష్కరిణి, కల్యాణకట్ట, దేవాలయానికి అభిముఖంగా దేవుడి వస్తువులు లభించే దుకాణాలు, మండల దీక్ష చేసే భక్తుల కోసం వసతి, బస గదుల నిర్మాణం ఉండాలని సీఎం సూచించారు.

గర్భాలయం గుహలో కొలువైన మూలవిరాట్టు యథావిధిగా ఉండాలని, మిగిలిన ప్రాంతాల్లోనే ఆగమశాస్త్రానికి అనుకూలంగా అభివృద్ధి చేయాలన్నారు. గుట్టపై ఏకకాలంలో 30 వేలమంది భక్తులు కలియ దిరిగినా ఎలాంటి ఇబ్బంది లేనివిధంగా నిర్మాణాలుండాలని వివరించారు. భక్తులు సేదతీరేలా గుట్ట పరిసరాలను తీర్చిదిద్దాలని,  ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా చుట్టూ ఉన్న ఇతర గుట్టలను కూడా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అతిథిగృహాలు, కాటేజీలు, సుందర వనాలు, విశాలమైన రోడ్లు, గుట్టపైకి వచ్చి వెళ్లేందుకు విడివిడి దారులు ఉండాలన్నారు. కింద రెండున్నర వేలమంది సామర్థ్యంతో కల్యాణ మండపం నిర్మించాలన్నారు.

సమీపంలోని బస్వాపూర్ చెరువును రిజర్వాయర్‌గా మారుస్తున్నట్టు వెల్లడించారు. దానికి అనుబంధంగా బృందావన్ గార్డెన్ తరహాలో థీమ్ పార్కును నిర్మించాలని అధికారులను ఆదేశించారు. గుట్ట ప్రాంతమంతా సెంట్రలైజ్డ్ మైక్ సిస్టం ఏర్పాటు చేయాలని, నిత్యం పారాయణాలు వినిపించాలని సూచించారు. భక్తులకు మంచి నీటి కొరత రాకుండా చూడాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement