
కృష్ణా పుష్కరాలనూ విజయవంతం చేయాలి
మంత్రులు, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించిన తరహాలోనే ఆగస్టులో జరగనున్న కృష్ణా పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంత్రులు, అధికారులను ఆదేశించారు. అవసరమైతే గోదావరి పుష్కరాల్లో విధులు నిర్వహించిన కలెక్టర్లు, ఇతర అధికారుల సేవలను కూడా వినియోగించుకోవాలని సూచించారు. భారీ వర్షాలు కురిసే సమయం లో కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సి ఉన్నం దున ఏర్పాట్లపై వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని పేర్కొన్నారు.
మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వర్‌రావు, జూపల్లి కృష్ణారావు, చందూలాల్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, దేవాదాయశాఖ కార్యదర్శి శివశంకర్, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల కలెక్టర్లు సత్యానారాయణ, శ్రీదేవి తదితరులతో కేసీఆర్ ఆదివారం కృష్ణా పుష్కర ఏర్పాట్లపై సమీక్షించారు. మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో దాదాపు 50 వరకు ఘాట్లు నిర్మించాలని, కృష్ణానది వరకు వెళ్లేందుకు సరైన రోడ్డు వసతి లేని చోట్ల యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన జోగులాంబ దేవాలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని, దాన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ ఏర్పాట్లు చేయాలని, నదీ తీరం వద్ద ఉండే ఇతర ఆలయాల వద్ద కూడా ఏర్పాట్లు చేయాలన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్, బాచుపల్లి, వాడేపల్లి, మట్టపల్లి, కొల్లాపూర్, సోమశిల, పెబ్బేరు, జూరాల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.