శాంతిని కోరేదే ఇస్లాం
* ఐఎస్‌ఐస్ ఓ సైతాన్
* ఏఐఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఓవైసీ
సాక్షి, సిటీబ్యూరో: ఇస్లాం ఎప్పుడూ శాంతినే కోరుకుం టుందని, రక్తపాతం విధ్వంసాలు ఇస్లాం అభిమతం కాదని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా శుక్రవారం మక్కా మసీదులో జరిగిన యౌముల్ ఖురాన్ సభలో ఆయన మాట్లాడారు. ఐఎస్‌ఐఎస్ ఓ సైతాన్, గుండాల దళమని, వారు మసీదులపై దాడులు చేసి ఎందరో ముస్లింలను హతమార్చారన్నారు. వారికి ఇస్లాంకు సంబంధం లేదన్నారు.
భారత దేశంలోని ముస్లింలు ఐఎస్‌ఐఎస్‌కు ఎప్పుడూ సహకరించరని, తాను ఐఎస్‌ఐఎస్ తీవ్రవాదాన్ని తుదముట్టించాలని ఎప్పటినుంచో కోరుతున్నానన్నారు. ముస్లింలు దేశాన్ని ప్రేమిస్తారు తప్ప వదిలి పోరని, ఉగ్రవాదం వైపు వెళ్తున్నవారు ముస్లింలు కాదన్నారు. దేశం కోసం తన తల త్యాగం చేసేందుకైనా సిద్దమేననని, దేశంలోని గంగా జమునా తహజిబ్ కంటే ఏదీ గొప్పది కాదన్నారు.
నిరాపరాధులైతే....
ఐఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్న యువకులు నిరాపరాధులని తేలితే సమాధానం ఏముంటుందని ఎన్‌ఐఏను అసదుద్దీన్ ప్రశ్నించారు. గతంలో మక్కామసీదు. మలేగావ్ సంఘటనల్లో కూడా అమాయకులను అరెస్ట్ చే శారని. ఇటీవల పాతబస్తీ ఘటనపై నిజానిజాలు న్యాయస్థానంలో రుజువవుతాయన్నారు. తాను ఎన్‌ఐఏ రిమాండ్ రిపోర్టు చూశానని.. అల్లర్లు సృష్టించాలనే అభియోగం లేదని, మీడియా సృష్టిగా పేర్కొన్నారు.
గతంలో బహదూర్‌పురా, సైదాబాద్ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన ఇలాంటి సంఘటనల్లో సంఘ్ పరివార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలిసిందేనన్నారు. గతంలో మక్కా మసీదు, లుంబీని పార్కు, గోకుల్ చాట్‌లతో పాటు మాలెగావ్, ముం బాయి మారణకాండలో ఆర్‌ఎస్‌ఎస్ హస్తమున్న విషయం స్పష్టమైందన్నారు. ప్రస్తుతం అరెస్టయిన పాతబస్తీ యువకుల న్యాయ పోరాటానికి తాము సహకరిస్తామని, ముస్లిం లపై జరుగుతున్న దౌర్జన్యాలను వ్యతిరేకిస్తూ హక్కుల కోసం పోరాడుతామన్నారు.
ముస్లింల పరిరక్షణకు పోరాడుతున్న తమపై సంఘ్ పరివార్, ఆర్‌ఎస్‌ఎస్ తప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నాయన్నారు. ముస్లింలపై ఉగ్రవాద ముద్రవేయవద్దని సూచించారు.
తెలంగాణ హైకోర్టు ఏర్పాటు చేయాలి
తెలంగాణ హైకోర్టును తక్షణమే ఏర్పాటుచేయాలని అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దృష్టి సారించాలన్నారు. రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఇక్కడి హైకోర్టు ఉమ్మడి రాష్ట్రాల కోసం పని చేస్తుందని.. ప్రస్తుతం తెలంగాణ న్యాయవాదుల కోరిక మేరకు హైకోర్టు విభజన జరగాల్సిందేనన్నారు. న్యాయ వాదుల పోరాటానికి ఆయన మద్దతు ప్రకటించారు.