దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని హతమార్చాలని ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టు సంస్థ తమ జిహాదీలకు తాజాగా పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ: దేవుళ్లను పూజించేవారిని, గో మూత్రం తాగేవారిని హతమార్చాలని ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టు సంస్థ తమ జిహాదీలకు తాజాగా పిలుపునిచ్చింది. భారత్‌కు చెందిన అధికారులను, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా)గూఢాచారుల తలలను నరికివేయాలని చెప్పింది. ఎవరికి అనుమానం రాకుండా పాకిస్తాన్‌కు చెందిన ఐఎస్‌ఐ అధికారులను కూడా చంపేయండని సూచించింది. వీరంతా మతానికి ద్రోహం చేస్తున్నందున వారంతా అల్లా ప్రకారం శిక్షార్హులేనని పేర్కొంది. ఈ మారణహోమంలో అవసరమైతే ప్రాణాలను త్యాగం చేయండని చెప్పింది. కశ్మీర్‌లో ఖలీఫా రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యం అని పేర్కొంది.
ఈ మేరకు ఐఎస్‌ఐఎస్ సంస్థ ప్రచురించిన ఎనిమిది పేజీల వ్యాసం ఒకటి నేషనల్ మీడియా చేతికి చిక్కింది. ఇస్లాంకు ద్రోహం చేసే మత అవిశ్వాసకులకులను మట్టుపెట్టాలని సూచించింది. మత అవిశ్వాసకులకు వ్యతిరేకంగా కశ్మీర్, జమ్మూలోని మెజారిటీ ముస్లిం ప్రజలు ఎప్పటికప్పుడు ఎదురు తిరుగుతున్నారని, అయితే వారు స్వాతంత్య్రాన్ని మాత్రమే కోరుకుంటున్నారని, ఖలీఫా రాజ్యాన్ని కోరుకోవడం లేదని తెలిపింది. వారు తప్పుడు మార్గంలో ప్రయాణిస్తున్నారని, వారి త్యాగాలను రాజకీయ పార్టీలు కొన్ని సంస్థలు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించింది.
ఇస్లాం ఉదారవాదులను కూడా క్షమించవద్దని, వారికి కూడా మరణదండన విధించాల్సిందేనని పేర్కొంది. ఎనిమిదవ శతాబ్దం నాటి ఇస్లాం, షరియా చట్టాల ప్రకారమే ఖలీఫా రాజ్యాన్ని స్థాపించాలని, ఈ విషయంలో ఆ అల్లా కూడా మన వెంటనే ఉంటారని, మనకు అండగా ఉండాల్సిందిగా తాము కూడా ఆయన్ని ప్రార్థిస్తామని ఐఎస్‌ఐఎస్ చెప్పింది.
జీన్స్ ధరిస్తే చంపేస్తాం!
కశ్మీర్ యువత జీన్స్ ప్యాంటులు ధరించినా, యువతులు ముఖానికి మేకప్ వేసుకన్నా వారిని చంపేస్తామంటూ తాలిబన్ ఏ కశ్మీర్‌కు చెందిన మిలిటెంట్ కమాండర్ జకీర్ ముసా ఓ ఆడియో టేప్‌లో హెచ్చరించారు. ఇది షరియాకు విరుద్ధమని షరియాను అమలు చేయడమే తమ ఏకైక లక్ష్యమని ఇటీవలనే ప్రకటించిన ముసా చెప్పారు. హిజ్‌బుల్ ముజాహిదీన్‌కు చెందిన ముసా కొంత మంది అనుచరులతో బయటకు వచ్చి ‘తాలిబన్ ఏ కశ్మీర్’ అనే గ్రూపును ఏర్పాటు చేశారు.