ఐఎస్‌కు ఇస్లాంతో సంబంధం లేదు: అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్(ఐఎస్)తో ఇస్లాంకు ఎలాంటి సంబంధం లేదని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ చెప్పారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయమైన దారుస్సలాంలో విలేకరులతో మాట్లాడారు. పారిస్‌లో ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.5 లక్షల ముస్లింలను ఐఎస్ ఉగ్రవాదులు హతమార్చారన్నారు. ఇస్లామిక్ స్కాలర్స్ ఐఎస్‌కు వ్యతిరేకంగా ఫత్వా జారీ చేశారని గుర్తు చేశారు. ఇస్లాంకు ఐఎస్ మచ్చలాంటిదన్నారు.
ఈ సంస్థపై యూపీ మంత్రి ఆజంఖాన్ వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఇరాన్, అఫ్ఘానిస్తాన్ దేశాల్లో ఏర్పడిన పరిస్థితులు ఐఎస్ అనుకూలంగా మలుచుకొంటుందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈ సంస్థను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీని రక్షించడం ఏ కూటమికీ సాధ్యం కాదన్నారు.