కిరణ్ వ్యాఖ్యలపై భగ్గు
బంజారాహిల్స్,న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ హైకమాండ్ ఆమోదించిన తర్వాత..ముఖ్యమంత్రి కిరణ్ ధిక్కరించే ధోరణిలో వ్యాఖ్యలు చేయడంపై టీఆర్‌ఎస్,విద్యార్థి, ప్రజాసంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. శుక్రవారం నగరంలో పలుచోట్ల ఆయన దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వహించి దహనం చేశాయి. టీఆర్‌ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తుల ఉమ ఆధ్వర్యంలో తెలంగాణభవన్ నుంచి సీఎం కిరణ్ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అనంతరం కళింగభవన్ చౌరస్తా దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..కిరణ్ సమైక్యాంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా మాట్లాడుతూ తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు.
ఓయూలో దిష్టిబొమ్మ దహనం
ఉస్మానియాయూనివర్సిటీ: తెలంగాణ కు వ్యతిరేకంగా సీఎం కిరణ్ వ్యాఖ్యలపై ఓయూలో పలు విద్యార్థిసంఘా లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. టీఆర్‌ఎస్వీ, టీజీవీపీ,ఏబీవీపీ, పీడీఎస్‌యూ విద్యార్థి సంఘాలు వేర్వేరుగా ఆయన దిష్టిబొమ్మను దహనం చేశాయి. అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన సీఎంను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి.
పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో..
బషీర్‌బాగ్: కిరణ్‌కుమార్‌రెడ్డి సీమాం ధ్ర ఉద్యమానికి ఆజ్యంపోస్తున్నారని, వెంటనే ఆయన్ను తొలగించాలని పీడీఎస్‌యూ,టీఆర్‌ఎస్వీలు డిమాండ్ చే శాయి. బషీర్‌బాగ్ బాబూజగ్జీవన్‌రాం విగ్రహం వద్ద వేర్వేరుగా సీఎం దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన వ్యక్తం చేశాయి. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడకుండా సీమాంధ్ర ఉద్యమాన్ని రె చ్చగొడుతున్నారని విమర్శించారు. నదీజలాల వివాదాలు వస్తాయని రె చ్చగొట్టి మరికొంతకాలం తెలంగాణ ను వాయిదావేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.