'కిరణ్ సర్కార్ ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదు'
హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ కూడా ఇంత దుర్మార్గంగా వ్యవహరించలేదని తెలంగాణ పీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. సాంస్కృతిక వారిధిలో ఉద్యోగాలు దక్కని దగాపడ్డ కళాకారులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కార్ గొంతు నొక్కుతోందని ఆయన విమర్శించారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మట్లాడుతూ.. ఈ రోజు నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసుకున్న ధూంధాం సభకు అనుమతి రద్దు చేసి వారిని అరెస్ట్ చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.
పోలీసులు పీపుల్స్ ఫ్రెండ్లీగా కాకుండా పింక్ పార్టీ ఫ్రెండ్లీగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దగాపడ్డ కళాకారుల పట్ల ధూంధాం సభకు పర్మిషన్ ఎందుకు రద్దు చేశారో రాష్ట్ర డీజీపీ సమాధానం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.