రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరణ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వాస్తవ వివరణ పత్రాన్ని విడుదల చేయాలని బీజే ఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమెంత, చెల్లించాల్సిన బకాయిలు, తెచ్చిన అప్పులు, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు చేస్తున్న వ్యయమెంతో వెల్లడించాలన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో ఆదాయమెంత పెరిగిందో ప్రకటించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా తీసుకున్న అప్పులే రూ.లక్ష కోట్లు దాటాయని (కార్పొరేషన్లకు కాకుండా)చెప్పారు.రాష్ట్రం పేరుకు మాత్రమే మిగుల్లో ఉందని, వాస్తవంగా అప్పులు, దుబారాల్లో మునిగితేలుతోందన్నారు. ప్రభుత్వం చెబుతున్న బంగారు తెలంగాణ కాస్తా బకాయిల తెలంగాణగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.
భూముల అమ్మకం ద్వారా రూ.10వేల కోట్ల ఆదాయా న్ని ఆర్జిస్తామని ప్రభుత్వం చెప్పిందని, కనీసం రూ.500 కోట్లు కూడా రాలేదన్నారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం సరిగ్గా ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిలు రూ.3,500 కోట్లు, ఆర్‌అండ్‌బీ కాంట్రాక్టర్లకు రూ.3వేల కోట్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు (2015-16) రూ.1,900 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీల స్కాలర్‌షిప్ రూ.2,500కోట్లు, ఫుడ్ సబ్సిడీ రూ.2,500కోట్లు, పొదుపు సంఘా లు, రైతులకు వడ్డీలేని రుణాలకు రూ.2 వేల కోట్లు, ప్రధాని ఫసల్ బీమా యోజన కింద రూ.500 కోట్ల బకాయిలు.. ఇలా అనేక రంగాల్లో రూ.వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. కేంద్రం ఇచ్చిన ఇన్‌పుట్ సబ్సిడీ రూ.791 కోట్లు దారి మళ్లాయని, నేషనల్ హెల్త్ స్కీం కింద రూ.430 కోట్లు ఉపయోగించుకోలేదని ఆరోపించారు.