పతంగుల పండుగ | Kite festival | Sakshi
Sakshi News home page

పతంగుల పండుగ

Published Sun, Jan 11 2015 12:40 AM | Last Updated on Fri, Mar 22 2019 7:19 PM

పతంగుల పండుగ - Sakshi

పతంగుల పండుగ

ఇది వానా కాలం కాదు... అయినా ఆకాశంలో హరివిల్లులు కనువిందు చేస్తున్నాయి. వానా కాలంలో ఒకటే హరివిల్లు... అందునా ఏడు రంగులే. ఈ పుష్య మాసపు హరివిల్లులకు వేన వేల వర్ణాలు. వింత సోయగాలు... విభిన్న ఆకృతులు... ఉదయం వేళ సూర్యునితో చేతులు కలిపేందుకు... సాయంత్రం తారలను తాకేందుకు ఉవ్విళ్లూరుతున్నట్టుగా కనిపించే ఈ హరివిల్లులే పతంగులు. అవును...సంక్రాంతి అంటే పిల్లలకు పతంగుల ‘పండుగ’.

చిట్టి పాదాలతో మైదానంలో ముగ్గులు పెట్టినట్టుగా తిరిగే పిల్లలు... పతంగులతో మేఘాలకు సందేశం పంపేందుకు పోటీ పడుతుంటారు. ప్రస్తుతం నగరంలోని అనేక మైదానాలు గాలిపటాలు ఎగురవేసే వారితో సువర్ణ శోభితమవుతున్నాయి.

సిటీబ్యూరో: సంక్రాంతి అంటే ముగ్గులు, గొబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు... వీటితో పాటు ముఖ్యమైనవి ఉన్నాయి.... అవే పతంగులు. సంక్రాంతి పేరు చెబితే చిన్నారులకు ఠక్కున గుర్తొచ్చేది పతంగులే. నింగిలో రంగురంగుల గాలిపటాల విన్యాసాలు పిల్లలతో పాటు పెద్దలనూ ఆనందంలో ముంచెత్తుతాయి. వీరి ఆసక్తికి తగినట్టే విభిన్న ఆకృతులతో... వింత వింత పతంగులు మార్కెట్‌లో సందడి చేస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్రమోదీల స్నేహబంధాన్ని చాటే  పతంగులు ఈసారి ప్రత్యేకం. పిల్లలను ఆకట్టుకుంటున్న కార్టూన్ పాత్రలతో రూపొందించినవి... టాలీవుడ్, బాలీవుడ్, తారలు... పక్షులు... జంతువులు... ఇలా ఎన్నో రకాల పతంగులు... కళాకారుల సృజనకు అద్దం పడుతున్నాయి. ఎక్కడికక్కడ వీటి పోటీలతో మైదానాలు రంగుల హరివిల్లులవుతున్నాయి.
 
కాంక్రీట్ జంగిల్‌లో కష్టం


సుమారు పదిహేనేళ్ల క్రితంతో పోలిస్తే ఇటీవల కాలంలో గాలిపటాల సందడి కొంత తగ్గిందనే చెప్పుకోవాలి. ఒకప్పటి ఆనందోత్సాహాలు ఇప్పుడు లేవు.నగరంలో మైదానాలతో పాటే పతంగుల పండుగ క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. అడుగడుగునా వెలసిన కాంక్రీట్ కట్టడాలు, బహుళ అంతస్థుల భవనాలు, వాహనాల రద్దీ, కార్పొరేట్ చదువులు ఈ సంస్కృతిని మింగేస్తున్నాయి.  
 
మాంజా స్థానంలో తంగూన్...

పతంగులను ఎగురవేసేందుకు వినియోగించే మాంజా ఇప్పుడు లభించడం లేదు. చైనా నుంచి టన్నుల కొద్దీ దిగుమతి అవుతున్న తంగూన్ (సన్నటి వైరు) మాంజాను కబళించింది. ఆ రోజుల్లో మాంజా తయారు చేయడం ఒక కళ. ఇందుకోసం ప్రత్యేకంగా వస్తాదులు ఉండేవాళ్లు. అన్నం మెత్తగా రుబ్బి, దానికి బెండకాయ రసం, గుడ్డు, సీసం, రంగులు కలిపి దారానికి రుద్దేవాళ్లు. పది నిమిషాలు ఆరబెడితే మాంజా తయారయ్యేది. ఇది మెత్తగా.. పతంగులను ఎగురేసేందుకు అనుకూలంగా ఉండేది. తంగూన్ వల్ల తరచుగా చేతులకు గాయాలవుతున్నట్టు జనం చెబుతున్నారు.

 ఎన్నెన్ని రకాలో....

 మెహదీపట్నం:  సినీతారలు... డోరోమెన్, బెన్‌టెన్ వంటి కార్టూన్ పతంగులతో పాటు ఈగల్, అనకొండ వంటి ఆకృతులతో గాలిపటాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. మూడు నెలలుగా వీటి తయారీలో నిమగ్నమైనట్టు కొంతమంది కళాకారులు చెబుతున్నారు.  
 
పరిమాణాన్ని బట్టి...


 పతంగులు పరిమాణం...రంగులను బట్టి ధరలు ఉన్నాయి. ప్రత్యేకంగా వస్త్రాలతో తయారు చేసిన పతంగులు అత్యధిక ధరలు పలుకుతున్నాయి. వీటితో పాటు ప్లాస్టిక్ దారం, మాంజా, ప్రత్యేకంగా తయారు చేసిన మాంజా దారం మీటర్లచొప్పున అమ్మకాలు సాగిస్తున్నారు. గతంలో కంటే పతంగుల సందడి కాస్తా తగ్గిందని దశాబ్దాలుగా ఇదే వ్యాపారం చేస్తున్న కార్వాన్‌కు చెందిన వ్యాపారి పురిషోత్తంఠాకూర్ తెలిపారు.
 
 
 వైవిధ్యానికి చిరునామా
 
 ఏఎస్‌రావు నగర్  సైనిక్‌పురి చౌరస్తాలోని అమిత్ పతంగ్ హౌస్‌లో వెరైటీ గాలి పటాలకు చిరునామాగా మారింది. ఇక్కడ రూ.10 నుంచిరూ.1200 విలువైన పతంగులు అందుబాటులో ఉన్నాయి. గుజరాత్, ఢిల్లీ, ముంబయ్, బరేలీ, కాన్పూర్, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల నుంచి ఏటా వెరైటీ  గాలి పటాలను తెచ్చి అమిత్ విక్రయిస్తుంటాడు. వీటికి డిమాండ్ అదే స్థాయిలో ఉంటోంది. ఇక్కడ చైనా కైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇందులో డ్రాగన్, ఎరోప్లెన్, స్పైడర్‌మెన్, బోగిమెన్, బ్యాట్స్‌మెన్, ఫిష్, ఈగల్, టైగర్ తదితర  ఆకృతులతో ఉన్నాయి. ప్రముఖ సినీ తారల చిత్రాలతో కూడిన కైట్స్‌కు డిమాండ్ అధికంగా ఉంది. ఈ సారి స్వామి వివేకానంద(12న జన్మదినం) ప్రధానమంత్రి నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి కెసీఆర్ చిత్రాలతో కూడిన గాలిపటాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పతంగ్ హౌస్‌లో నాణ్యమైన మాంజా దారం రూ. 2 నుంచి రూ.180 వరకు, చరఖా రూ.10 నుంచిరూ.350 వరకు, మాంజా చరఖా రూ.35 నుంచి రూ.2000 వరకు లభిస్తున్నాయి.
 
 ఉత్తర, దక్షిణాలను ఏకం చేసింది..
 
 పతంగం ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి భాగ్యనగరంలో వేడుక చేసుకుంది. నిజాం కాలంలో గొప్ప ఆదరణ పొందింది. దీని పుట్టుకా ఆసక్తికరమే. సముద్ర తీర ప్రాంతాలు, మైదానాలు, ఎడారుల్లో గాలి తీవ్రతను...వాటాన్ని తెలుసుకొనేందుకు ఆ రోజుల్లో తేలికపాటి వస్తువులను గాలిలో ఎగురవేసేవారు. అవే పతంగుల పుట్టుకకు కారణమయ్యాయి. రాజస్తాన్‌లోని అల్వర్‌కు చెందిన మౌజీ 1872లో మొట్టమొదటిగా పిల్లల సరదా కోసం పతంగాన్ని ఎగురవేసినట్టు చెబుతారు. అలా ఉత్తరాదిలో పుట్టిన పతంగి దక్షిణాది సంస్కృతిలో భాగమైపోయింది. నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ కాలంలో పెద్ద ఎత్తున పోటీలు నిర్వహించారు. నగరంలోని విశాలమైన మైదానాలు అందుకు వేదికల య్యాయి. బారుత్‌కా కోట, చంచల్‌గూడ మైదానం, ఆస్మాన్‌గఢ్ మైదానాల్లో వేడుకలు జరిగాయి. నవాబుల కాలంలో బంగారు, వెండి చరఖాలు (దారం చుట్టేవి) ఉండేవి. వాటికి ముత్యాలు, వ జ్రాలు పొదిగేవారు. ఏటా వేడుకల సమయంలో వాటిని బయటకు తీసేవారు. ఆ రోజుల్లో నాలుగైదు నెలల పాటు వేడుకలు జరిగేవి. పోటీల్లో గెలిచిన వారికి నవాబు స్వయంగా బహుమతులను అందజేసేవారు. కుల,మతాలకు అతీతంగా అందరూ కలిసి చేసుకొనే గొప్ప వేడుక ఇది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement