ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైంది: కేకే
ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమయ్యాయి: ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి
హైదరాబాద్: సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో గౌరవప్రదమైనదని రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. ఉపాధ్యాయుడికి ఒకప్పుడున్న గౌరవం ఇప్పుడు లేకుండా పోయిందన్నారు. ఉపాధ్యాయులపై తల్లిదండ్రులకు విశ్వాసం, నమ్మకం సన్నగిల్లడమే కారణమని అన్నారు. ఓ వైద్యుడు ఫెయిలైతే రోగి చనిపోతారు, న్యాయవాది ఫెయిలైతే కేసు నీరుగారుతుంది. కానీ ఉపాధ్యాయుడు ఫెయిలైతే ఓ తరం నష్టపోతుందన్నారు. శనివారం నాంపల్లి పబ్లిక్‌గార్డెన్స్‌లోని ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియంలో పీఆర్‌టీయూ తెలంగాణ శాఖ 5వ వార్షికోత్సవం జరిగింది. ‘విద్యా సంస్కరణలు - ఉపాధ్యాయుల పాత్ర’ అనే అంశంపై సదస్సును నిర్వహించారు. పీఆర్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.చెన్నయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు కె.కేశవరావు (కేకే) ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సమస్యల సదస్సుకు పిలవొద్దు
ఈ సందర్భంగా సదస్సుకు ఆహ్వానించి డిమాండ్లపై మాట్లాడటం సరికాదని కేకే అన్నారు. ఉపాధ్యాయుల సమస్యల సదస్సుకు తనను ఎప్పుడూ పిలవద్దని అన్నారు. సమస్యలేమైనా ఉంటే తెల్లకాగితం మీద రాసి తనకిస్తే రెండు గంటల్లో పరిష్కరిస్తానన్నారు. విద్యా సంస్కరణల సదస్సుపై చర్చ జరగాల్సి ఉన్నప్పటికి ఏ ఒక్క నాయకుడు మాట్లాడటం లేదన్నారు. ఎమ్మెల్సీ పి.సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యం అయ్యాయని అన్నారు. ఉపాధ్యాయుల ద్వారానే ప్రవేశాలు తగ్గుముఖం పట్టాయనడంలో వాస్తవం లేదన్నారు. పాలనాపరమైన లోపాలతోనే అడ్మిషన్లు తగ్గుతున్నాయని అన్నారు. పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు హర్షవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ అంతర్ జిల్లాల బదిలీలను చేపట్టాలని కోరారు.