కోదండరాంపై విమర్శ పరిష్కారం కాదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉద్యమంలో రాజకీయ జేఏసీ నిర్వహించిన పాత్రను తక్కువ చేయడం సరికాదని, అందరినీ సమన్వయ పర్చడంలో జేఏసీ చైర్మన్‌గా కోదండరాం సఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రులు, నాయకులు పెద్ద ఎత్తున కోదండరాంను విమర్శించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అన్నారు.ప్రస్తుత పరిణామాలపై సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.1 నుంచి 50 టీఎంసీలకు పెంచి, 14 గ్రామాల్లో 27 వేల ఎకరాల ముంపునకు గురిచేయడం సరికాదన్నారు.
అక్కడి బాధితుల నుంచి వ్యతిరేకత రావడానికి మంత్రి హరీశ్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులే కారణమని విమర్శించారు. కేంద్ర భూసేకరణ చట్టం-2013 ప్రకారం మేలైన పరిహారం సహాయ పునరావాస, సహాయ చర్యలు చేపట్టాలన్నారు. కాగా, నగర పంచాయతీలుగా 2011లో అప్‌గ్రేడ్ చేసిన మేజర్ గ్రామ పంచాయతీల్లో జాతీయ ఉపాధి హామీ పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును చాడ కోరారు.