భద్రకాళి చెంత సీఎం కేసీఆర్ అబద్ధాలు
♦ వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి ధ్వజం
♦ పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
♦ 31 జిల్లాలు చేయడంలో ఆంతర్యం ఏమిటి?
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ జిల్లా పర్యటనలో భద్రకాళి అమ్మ వారి దగ్గర పచ్చి అబద్ధాలు మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో వర్షాలు పడి, చెరువులు నిండి రైతులు సంబరాలు చేసుకుంటున్నారని సీఎం చెప్పడం ఆయన స్థాయికి తగినది కాదని పేర్కొంది. పూర్తిస్థాయిలో రుణమాఫీ జరగక, బ్యాంకు రుణాలు దొరకక అధిక వడ్డీతో వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని చెల్లించలేక, నకిలీ విత్తనాలతో వేసిన పంటలు నష్టపోయి ైరె తాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే సంతోషంగా ఉన్నారంటూ పేర్కొనడం వాస్తవ దూరమని విమర్శించింది.
సోమవారం ఆ పార్టీ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ భారీ వర్షాలతో రైతుల పంటలకు తీవ్రనష్టం వాటిల్లినా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారమివ్వాలని, అధిక వర్షాల వల్ల జరిగిన నష్టానికి సహాయం చేయాలంటూ ఒకవైపు కేంద్రానికి మంత్రుల బృందం వినతిపత్రాన్ని సమర్పిస్తే, మరోవైపు రైతులు సంతోషంగా ఉన్నారని చెప్పడంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు.
కొత్త జిల్లాలపై ఎందుకింత గోప్యత?
తాము మేనిఫెస్టోలో పేర్కొన్న మేరకు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేక రాద్ధాంతం చేస్తున్నాయని కేసీఆర్ చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో 24 జిల్లాలు ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు 31కి పెంచడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. దీనితో పాటు మేనిఫెస్టోలో పెట్టిన ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, పేదలకు రెండు పడక గదుల ఇళ్లు, ఎస్సీలతో పాటు ఎస్టీలకు 3 ఎకరాల భూమి పంపిణీ, కేజీ టు పీజీ తదితర పథకాల అమలు ఏమైందని నిలదీశారు.
జిల్లాల ఏర్పాటుపై కమిటీల మీద కమిటీలు వీస్తున్నారని, మరి అఖిలపక్షభేటీలో మరో రెండు సమావేశాలను ఏర్పాటు చేస్తామని ఎందుకు మాట తప్పారని ప్రశ్నించారు. జిల్లాలను శాస్త్రీయంగా ఏర్పాటు చేస్తున్నట్లయితే ఇంత హడావుడిగా, అత్యంత గోప్యంగా ఉంచి ఆదరాబాదరాగా ప్రకటించడం ఏమిటని నిలదీశారు. చివరి నిమిషంలో సైతం కరీంనగర్ జిల్లాలోని మంత్రి హరీశ్‌రావు సొంతూరును చీల్చి సిిద్దిపేట జిల్లాలో కలపడమేమిటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ గుళ్లు, గోపురాలు తిరగడాన్ని తాము తప్పుబట్టడం లేదని, అయితే గుళ్లలో ధూప, దీప నైవేద్యాలకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రకటించిన రూ.రెండున్నరవేల మొత్తాన్ని ఎందుకు నిలిపేశారని నిలదీశారు.