15 రోజుల్లో అనుమతులిస్తున్నాం | KTR favors national policy to boost housing sector | Sakshi
Sakshi News home page

15 రోజుల్లో అనుమతులిస్తున్నాం

Published Sat, Aug 20 2016 2:22 AM | Last Updated on Mon, Sep 4 2017 9:58 AM

15 రోజుల్లో అనుమతులిస్తున్నాం

15 రోజుల్లో అనుమతులిస్తున్నాం

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేస్తున్నామని.. ప్రపంచ శ్రేణి పెట్టుబడిదారులకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో 13వ జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో గృహ నిర్మాణంలో మంచి విధానాలు తీసుకొచ్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం మెరుగైన విధానాలను అవలంబిస్తోందన్నారు.

ఇతర రంగాల అభివృద్ధి జరిగినప్పుడే గృహ నిర్మాణంలో పురోగతి కనిపిస్తుందని.. అందువల్లే పారి శ్రామీకరణపై దృష్టి సారించామన్నారు. టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నట్టు వివరిం చారు. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే.. 16వ రోజున అనుమతులు మంజూరైనట్టే భావించే వెసులుబాటు కల్పించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2,300 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని... రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 1.7 ల క్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. దేశంలో ఏ నగరంతో పోల్చి చూసినా తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌లో మౌలిక వసతులు, వ్యాపార అవకాశాలు ఉన్నాయని.. రియల్ ఎస్టేట్ అనుమతులు కూడా ఆన్‌లైన్ చేశామని, దాని వల్ల అవినీతికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు.
 
ఫార్మా సంస్థల ప్రతినిధులతో భేటీ
రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మించనున్న నేపథ్యంలో.. దిగ్గజ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. తొలుత ‘ఫ్రీజర్ ఇండియా’ సంస్థ ఎండీ శ్రీధర్, ప్రతినిధులతో సమావేశమై.. తెలంగాణలో చేపట్టిన ఫార్మా సిటీ గురించి వివరించారు. అనంతరం జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధుల తోనూ సమావేశమై చర్చించారు. అలాగే ఇండియన్ రైల్వే కన్‌స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ మోహన్ తివారీ, మరికొన్ని సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
 
లెదర్ పార్క్ ఏర్పాటుకు డీపీఆర్
ఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో కేటీఆర్ భేటీ అయి రాష్ట్రంలో ప్రతిపాదించిన లెదర్ పార్క్‌కు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించారు. దానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.105 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమావేశం అనంతరం కేటీఆర్ తెలిపారు. భారత్‌లో టెక్స్‌టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే శ్రీలంక పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల గురించి కేంద్ర మంత్రికి వివరించామని చెప్పారు.

సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి ఉన్న సమస్యలపై చర్చించామని తెలిపారు. ఆయా అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జౌళి శాఖ కార్యదర్శితోనూ సమావేశమై తెలంగాణలో కొత్తగా 12 చేనేత క్టస్లర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్‌టైల్ పార్క్‌లో కామన్ ఎఫిలియంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు.
 
సింధుకు ఘనస్వాగతం పలుకుతాం
ఒలింపిక్స్‌లో సింధు ప్రదర్శన దేశానికి గర్వకారణమని.. ఆమెకు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఒలింపిక్స్‌కు 2 నెలల ముందు కాకుండా.. 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే క్రీడాకారులను సన్నద్ధం చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రోత్సాహం కల్పించి.. వచ్చే ఒలింపిక్స్‌లో కనీసం 20 పతకాలు సాధించేలా కృషి చేయాలన్నారు.
 
కాంగ్రెస్‌వన్నీ కాకమ్మ కథలు
ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు చెబుతున్నవి కాకమ్మ కథలని.. వారు ఇచ్చి న ప్రజెంటేషన్‌కు తలా తోక లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంజనీర్లు, నిపుణులే ఆ ప్రజెంటేషన్‌ను తప్పుపడుతున్నారని.. ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతంగా దూరమవుతుందేమోనన్న భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కోటి ఎకరాలకు సాగునీరిస్తే.. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement