Real estate development
-
నేషనల్ హైవేలతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊపు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రహదారుల ఆధునీకరణ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తుంది. ఫెసిలిటీ ఆపరేటర్లతో పాటు డెవలపర్లు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలను అందిస్తాయి. మౌలిక సదుపాయాల అభివృద్ధి, కనెక్టివిటీ కారణంగా స్వల్ప కాలంలో జాతీయ రహదారుల వెంబడి భూముల ధరలు 60–80 శాతం వరకు అలాగే రెస్టారెంట్లు, ఫుడ్ కోర్ట్స్, రిటైల్ ఔట్లెట్స్, ఎలక్ట్రిక్ వెహికిల్ చార్జింగ్ స్టేషన్లు, వేర్‌హౌస్‌లు వంటి వాణిజ్య కార్యకలాపాల ప్రారంభంతో ఆయా ప్రాంతాలలోని భూముల ధరలు దీర్ఘకాలంలో 20–25 శాతం మేర వృద్ధి చెందుతాయని జేఎల్ఎల్ తెలిపింది. దేశంలో ఉత్తర, దక్షిణ ప్రాంతాలలోని ఎన్హెచ్ఏఐ ప్రాపర్టీల కోసం జేఎల్‌ఎల్‌ను అంతర్జాతీయ కన్సల్టెంట్‌గా నియమించుకుంది. ఎన్హెచ్ఏఐకు ప్రస్తుతం ఉన్న, కొత్త ప్రాపర్టీలను గుర్తించడం, ల్యాండ్ మోనటైజేషన్ కోసం ఎంపిక చేయడం, సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడం, ఫైనాన్షియల్ వయబులిటీలను అంచనా వేయడం జేఎల్ఎల్ పని. 3 వేల హెక్టార్ల అభివృద్ధి.. జాతీయ రహదారుల వెంబడి వాణిజ్య ప్రదేశాలు, గిడ్డంగులు, లాజిస్టిక్ పార్క్‌లు, వేసైడ్ ఎమినిటీస్ వంటి ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, సేవలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ప్రస్తుతం దేశంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)కు జాతీయ రహదారుల వెంబడి 180 ప్రాపర్టీలున్నాయి. అదనంగా 376 కొత్త నేషనల్ హైవే/ఎక్స్‌ప్రెస్‌లు నిర్మాణంలో ఉన్నాయి. దేశంలోని 22 రాష్ట్రాలలో 650కి పైగా ప్రాపర్టీలను ఎన్హెచ్ఏఐ గుర్తించింది. వీటిలో ఢిల్లీ ముంబై ఎక్స్‌ప్రెస్‌వేలో 94 ప్రాపర్టీలున్నాయి. ఇప్పటికే 130 సైట్లకు బిడ్లను ఆహ్వానించారు కూడా. వచ్చే ఐదేళ్లలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో 3 వేల హెక్టార్లకు పైగా విస్తీర్ణాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యించింది. రోజుకు 40 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయాలని సంకల్పించింది. 15–30 శాతం ఆదాయం.. ఒక్కో ప్రాపర్టీ అభివృద్ధికి సగటున రూ.1–10 కోట్ల మూలధన పెట్టుబడులు కావాలి. మొత్తంగా వచ్చే ఐదేళ్లలో రూ.4,800 ప్రైవేట్ పెట్టుబడులకు అవకాశముంటుంది. ఒక్కో సైట్ లీజు ఆదాయం 15–30 శాతం ఉంటుందని జేఎల్ఎల్ స్ట్రాటజిక్ కన్సల్టింగ్ అండ్ వాల్యుయేషన్ అడ్వైజరీ హెడ్ శంకర్ అంచనా వేశారు. క్లియర్ ల్యాండ్ టైటిల్, ఉచిత ఎన్కంబరెన్స్, ప్రీ–అప్రూవ్డ్ సైట్‌తో పాటు భూ వినియోగ మార్పు అవసరం లేకుండా 30 ఏళ్ల పాటు లీజు ఆదాయాలను పొందవచ్చు. దీంతో పాటు ప్రాజెక్ట్ అభివృద్ధి పనులతో డెవలపర్లు, పెట్టుబడిదారులకు మరిన్ని వ్యాపార అవకాశాలుంటాయన్నారు. గుర్తించిన సైట్ల డెవలప్మెంట్తో చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందడంతో పాటు స్థానిక జనాభాకు ఉపాధి అవకాశాలొస్తాయని తెలిపారు. -
15 రోజుల్లో అనుమతులిస్తున్నాం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు మంజూరు చేస్తున్నామని.. ప్రపంచ శ్రేణి పెట్టుబడిదారులకు తెలంగాణ ఆహ్వానం పలుకుతోందని రాష్ట్ర ఐటీ, పురపాలక మంత్రి కె.తారక రామారావు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో 13వ జాతీయ స్థిరాస్తి అభివృద్ధి మండలి జాతీయ సదస్సులో ఆయన పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో గృహ నిర్మాణంలో మంచి విధానాలు తీసుకొచ్చేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ అభివృద్ధికి ప్రభుత్వం మెరుగైన విధానాలను అవలంబిస్తోందన్నారు. ఇతర రంగాల అభివృద్ధి జరిగినప్పుడే గృహ నిర్మాణంలో పురోగతి కనిపిస్తుందని.. అందువల్లే పారి శ్రామీకరణపై దృష్టి సారించామన్నారు. టీఎస్ ఐపాస్‌తో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సింగిల్ విండో విధానంలో 15 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇస్తున్నట్టు వివరిం చారు. 15 రోజుల్లో అనుమతులు రాకుంటే.. 16వ రోజున అనుమతులు మంజూరైనట్టే భావించే వెసులుబాటు కల్పించామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 2,300 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని... రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 1.7 ల క్షల ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. దేశంలో ఏ నగరంతో పోల్చి చూసినా తక్కువ ఖర్చుతో హైదరాబాద్‌లో మౌలిక వసతులు, వ్యాపార అవకాశాలు ఉన్నాయని.. రియల్ ఎస్టేట్ అనుమతులు కూడా ఆన్లైన్ చేశామని, దాని వల్ల అవినీతికి ఆస్కారం ఉండదని పేర్కొన్నారు. ఫార్మా సంస్థల ప్రతినిధులతో భేటీ రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మాసిటీని నిర్మించనున్న నేపథ్యంలో.. దిగ్గజ ఫార్మా సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అయ్యారు. తొలుత ‘ఫ్రీజర్ ఇండియా’ సంస్థ ఎండీ శ్రీధర్, ప్రతినిధులతో సమావేశమై.. తెలంగాణలో చేపట్టిన ఫార్మా సిటీ గురించి వివరించారు. అనంతరం జాన్సన్ అండ్ జాన్సన్ ప్రతినిధుల తోనూ సమావేశమై చర్చించారు. అలాగే ఇండియన్ రైల్వే కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ మోహన్ తివారీ, మరికొన్ని సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. లెదర్ పార్క్ ఏర్పాటుకు డీపీఆర్ ఢిల్లీలో కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో కేటీఆర్ భేటీ అయి రాష్ట్రంలో ప్రతిపాదించిన లెదర్ పార్క్‌కు సంబంధించిన డీపీఆర్‌ను సమర్పించారు. దానికి సంబంధించి కేంద్రం నుంచి రూ.105 కోట్లు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమావేశం అనంతరం కేటీఆర్ తెలిపారు. భారత్‌లో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే శ్రీలంక పారిశ్రామికవేత్తలకు ఉన్న సమస్యల గురించి కేంద్ర మంత్రికి వివరించామని చెప్పారు. సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్‌కు సంబంధించి ఉన్న సమస్యలపై చర్చించామని తెలిపారు. ఆయా అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. జౌళి శాఖ కార్యదర్శితోనూ సమావేశమై తెలంగాణలో కొత్తగా 12 చేనేత క్టస్లర్లు ఏర్పాటు చేయాలని కోరామన్నారు. వరంగల్‌లో ఏర్పాటు చేయనున్న మెగా టెక్స్టైల్ పార్క్‌లో కామన్ ఎఫిలియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటుకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. సింధుకు ఘనస్వాగతం పలుకుతాం ఒలింపిక్స్‌లో సింధు ప్రదర్శన దేశానికి గర్వకారణమని.. ఆమెకు ఘనస్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఒలింపిక్స్‌కు 2 నెలల ముందు కాకుండా.. 2020లో టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటి నుంచే క్రీడాకారులను సన్నద్ధం చేసేలా కేంద్రం చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. పాఠశాల స్థాయి నుంచే క్రీడలకు ప్రోత్సాహం కల్పించి.. వచ్చే ఒలింపిక్స్‌లో కనీసం 20 పతకాలు సాధించేలా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్‌వన్నీ కాకమ్మ కథలు ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు చెబుతున్నవి కాకమ్మ కథలని.. వారు ఇచ్చి న ప్రజెంటేషన్‌కు తలా తోక లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇంజనీర్లు, నిపుణులే ఆ ప్రజెంటేషన్‌ను తప్పుపడుతున్నారని.. ఆ పార్టీ నేతలు చెప్పే మాటలు నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించారు. అధికారం శాశ్వతంగా దూరమవుతుందేమోనన్న భయంతోనే కాంగ్రెస్ నేతలు ఇలాంటి ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే కోటి ఎకరాలకు సాగునీరిస్తే.. రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. -
.. అప్పుడే అభివృద్ధి సాధ్యం!
‘‘బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి మరీ ప్రాజెక్ట్‌లను ఆరంభిస్తున్న స్థిరాస్తి సంస్థలను.. ఎన్వోసీ, నాలా పన్ను, వ్యాట్ వంటి వాటితో వేధిస్తున్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దిక్కుమాలిన ఎన్వోసీలుండవు. వ్యాట్, నాలా పన్నులనూ రద్దు చేస్తున్నామని’’ క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పారు. ‘‘28-4-2010లో ఓ పిటిషన్ తీర్పులో హై కోర్టు ఏం చెప్పిందంటే.. సంబంధిత భూమి హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం నివాసిత జోన్లో ఉంటే ఆ భూమికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం కోసం నాలా పన్ను చెల్లించమని సంబంధిత వ్యక్తుపైన గానీ, సంస్థలపైన గానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు. అది ద్వంద్వ పన్ను వంటిదే’’ సాక్షి, హైదరాబాద్: ..పై రెండింటిని చదివితే ఎవరికైనా ఏమనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి అభివృద్ధికి ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందనిపిస్తుంది. కానీ, ప్రభుత్వ విభాగమైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ)నే స్వయంగా ఇందుకు మోకాలడ్డుతోందని పలు నిర్మాణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆదాయ అన్వేషణలో స్థిరాస్తి సంస్థలను వేధింపులకు గురిచేస్తోందని ‘సాక్షి రియల్టీ’తో ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పనితీరుపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కూడా. వివరాలివే.. ♦ ఇటీవల హెచ్ఎండీఏ బాధ్యతలు చేపట్టిన బాస్.. స్వయంగా సీఎం రద్దు చేసిన నాలా పన్నును చెల్లిచాల్సిందేనంటూ బిల్డర్లపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు వాయిదాల రూపంలో చెల్లించాల్సిన డెవలప్మెంట్ చార్జీలనూ ఒకేసారి చెల్లించాలని కూడా బలవంతం చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాల్లేక, కొత్త ప్రాజెక్ట్‌లను ఆరంభించాలంటే చేతిలో డబ్బుల్లేక కునారిల్లుతోన్న హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఇవి మరింత భారంగా మారాయి. ♦ నాలా పన్నును సాకుగా చూపుతూ ప్రాజెక్ట్‌ల అనుమతుల మంజూరులో జరుగుతున్న జాప్యానికి, అధికారుల అవినీతి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు నగరం, పట్టణాల్లోని వ్యవసాయ భూమిని నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్‌కు మార్పు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో పంచాయతీ పరిధిలోనూ దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు బడా ప్రాజెక్ట్‌లు ప్రారంభించేందుకు ముందుకొస్తారు. ఫీజుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం దండిగా వస్తుంది. కానీ, మన రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్లో ఉన్న భూమికి సైతం నాలా పన్నును కట్టాల్సిందేనని ఒత్తిడి తీసుకురావటం అనైతికం. ♦ వ్యక్తి లేదా సంస్థ పంచాయతీ పరిధిలో స్థలం అభివృద్ధి చేయాలంటే అది కచ్చితంగా మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారమే చేయాలని నిబంధనలున్నాయి. ప్రస్తుతం బిల్డర్లూ అలాగే చేస్తున్నారు కూడా. హెచ్ఎండీఏ చట్టం 2008 సెక్షన్ 18, 19 ప్రకారం.. పంచాయతీ పరిధిలో ప్రాజెక్ట్ అనుమతుల కోసం అన్ని రకాల ఫీజులను చెల్లిస్తున్నాం. అది కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రామ పంచాయతీ బ్యాంక్ ఖాతాలోనే. అందుకు సంబంధించిన బ్యాంక్ చలాన్, ప్రూఫులను హెచ్‌ఎండీఏకూ సమర్పిస్తున్నాం. అయితే అనుమతుల మంజూరు పత్రాలను హెచ్ఎండీఏ విడుదల చేశాక ఆ పత్రాల ఒక కాపీని స్థానిక సంస్థలు/ గ్రామ పంచాయతీలకు పంపించాలి. ఫీజులను పంచాయతీ పరిధిలోనే చెల్లించాలి కూడా. ఈ సమయంలో అక్కడి అధికారులకు ఎంత ఫీజుంటుందో సరిగా తెలియదు. చెప్పరు కూడా. పెపైచ్చు చేతులు తడపనిదే ఫైలు ముందుకు జరగని పరిస్థితి’’ అని అప్పా జంక్షన్లో పలు ప్రాజెక్ట్‌లు చేపడుతున్న ఓ బిల్డర్ సాక్షి రియల్టీకి చెప్పారు. అక్కడి సెక్రటరీ, సర్పంచి, స్థానిక నాయకులు హెచ్ఎండీఏకు ఎంత ఫీజు కట్టామో అంతకు రెట్టింపు ఇవ్వమని నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ♦ నయా పైసా అవినీతి జరిగినా సహించేది లేదనే సీఎం.. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ స్థాయిలో స్థిరాస్తి సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అనుమతి పత్రాలకు సంబంధించిన ఒక కాపీని హెచ్ఎండీఏనే నేరుగా గ్రామ పంచాయతీలకూ పంపించాలి. లేకపోతే ఫీజు చెల్లింపులన్నీ హెచ్ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చి.. అనుమతి కాపీలను మాత్రమే పంచాయతీకి పంపించే విధానాన్ని తీసుకురావాలి. అప్పుడే అనుమతుల మంజూరులో ఆలస్యం తగ్గుతుంది. బిల్డర్లపై వేధింపులూ తగ్గుతాయి. అధికారుల అవినీతికి ఆస్కారముండదు. ♦ 8330/పీ8/పాలసీ/హెచ్/2009 ప్రకారం హెచ్ఎండీఏ పరిధిలో డెవలప్మెంట్ చార్జీలు వాయిదా పద్దతుల్లో చెల్లించే వీలు కల్పించింది ప్రభుత్వం. కానీ, ప్రస్తుతం హెచ్ఎండీఏ అధికారులేం చేస్తున్నారంటే.. చార్జీలన్నీ ఒకేసారి కట్టాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. అమ్మకాల్లేక తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న స్థిరాస్తి సంస్థలకు ఇది కాసింత భారమే. అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి నిర్మాణ రంగానికి ఉపశమనం కలిగించాలని కోరుతున్నాం. • ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది. • కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులోనే ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై అంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర కలహాలకు దారి తీయవచ్చు.