.. అప్పుడే అభివృద్ధి సాధ్యం! | At that time development possible | Sakshi
Sakshi News home page

.. అప్పుడే అభివృద్ధి సాధ్యం!

Published Sat, Jun 13 2015 12:01 AM | Last Updated on Sun, Sep 3 2017 3:38 AM

.. అప్పుడే అభివృద్ధి సాధ్యం!

.. అప్పుడే అభివృద్ధి సాధ్యం!

‘‘బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చి మరీ ప్రాజెక్ట్‌లను ఆరంభిస్తున్న స్థిరాస్తి సంస్థలను.. ఎన్వోసీ, నాలా పన్ను, వ్యాట్ వంటి వాటితో వేధిస్తున్నారు. ఇకపై తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి దిక్కుమాలిన ఎన్వోసీలుండవు. వ్యాట్, నాలా పన్నులనూ రద్దు చేస్తున్నామని’’ క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చెప్పారు.
 
‘‘28-4-2010లో ఓ పిటిషన్ తీర్పులో హై కోర్టు ఏం చెప్పిందంటే.. సంబంధిత భూమి హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం నివాసిత జోన్‌లో ఉంటే ఆ భూమికి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం కోసం నాలా పన్ను చెల్లించమని సంబంధిత వ్యక్తుపైన గానీ, సంస్థలపైన గానీ ఎలాంటి ఒత్తిడి తీసుకురాకూడదు. అది ద్వంద్వ పన్ను వంటిదే’’
 
సాక్షి, హైదరాబాద్: ..పై రెండింటిని చదివితే ఎవరికైనా ఏమనిపిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో స్థిరాస్తి అభివృద్ధికి ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందనిపిస్తుంది. కానీ, ప్రభుత్వ విభాగమైన హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ)నే స్వయంగా ఇందుకు మోకాలడ్డుతోందని పలు నిర్మాణ సంఘాలు ఆరోపిస్తున్నాయి. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ.. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషించే నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆదాయ అన్వేషణలో స్థిరాస్తి సంస్థలను వేధింపులకు గురిచేస్తోందని ‘సాక్షి రియల్టీ’తో ఆవేదన వ్యక్తం చేశారు. హెచ్‌ఎండీఏ పనితీరుపై ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు వినతిపత్రం ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి కూడా. వివరాలివే..
ఇటీవల హెచ్‌ఎండీఏ బాధ్యతలు చేపట్టిన బాస్.. స్వయంగా సీఎం రద్దు చేసిన నాలా పన్నును చెల్లిచాల్సిందేనంటూ బిల్డర్లపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు వాయిదాల రూపంలో చెల్లించాల్సిన డెవలప్‌మెంట్ చార్జీలనూ ఒకేసారి చెల్లించాలని కూడా బలవంతం చేస్తున్నారు. ఇప్పటికే అమ్మకాల్లేక, కొత్త ప్రాజెక్ట్‌లను ఆరంభించాలంటే చేతిలో డబ్బుల్లేక కునారిల్లుతోన్న హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి ఇవి మరింత భారంగా మారాయి.
నాలా పన్నును సాకుగా చూపుతూ ప్రాజెక్ట్‌ల అనుమతుల మంజూరులో జరుగుతున్న జాప్యానికి, అధికారుల అవినీతి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు నగరం, పట్టణాల్లోని వ్యవసాయ భూమిని నాన్-అగ్రికల్చరల్ ల్యాండ్‌కు మార్పు చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. దీంతో పంచాయతీ పరిధిలోనూ దేశ, విదేశీ నిర్మాణ సంస్థలు బడా ప్రాజెక్ట్‌లు ప్రారంభించేందుకు ముందుకొస్తారు. ఫీజుల రూపంలో ప్రభుత్వానికీ ఆదాయం దండిగా వస్తుంది. కానీ, మన రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్ జోన్‌లో ఉన్న భూమికి సైతం నాలా పన్నును కట్టాల్సిందేనని ఒత్తిడి తీసుకురావటం అనైతికం.
వ్యక్తి లేదా సంస్థ పంచాయతీ పరిధిలో స్థలం అభివృద్ధి చేయాలంటే అది కచ్చితంగా మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ ప్లాన్ ప్రకారమే చేయాలని నిబంధనలున్నాయి. ప్రస్తుతం బిల్డర్లూ అలాగే చేస్తున్నారు కూడా.  హెచ్‌ఎండీఏ చట్టం 2008 సెక్షన్ 18, 19 ప్రకారం.. పంచాయతీ పరిధిలో ప్రాజెక్ట్  అనుమతుల కోసం అన్ని రకాల ఫీజులను చెల్లిస్తున్నాం. అది కూడా ప్రభుత్వ నిబంధన ప్రకారం గ్రామ పంచాయతీ బ్యాంక్ ఖాతాలోనే. అందుకు సంబంధించిన బ్యాంక్ చలాన్, ప్రూఫులను హెచ్‌ఎండీఏకూ సమర్పిస్తున్నాం.

అయితే అనుమతుల మంజూరు పత్రాలను హెచ్‌ఎండీఏ విడుదల చేశాక ఆ పత్రాల ఒక కాపీని స్థానిక సంస్థలు/ గ్రామ పంచాయతీలకు పంపించాలి. ఫీజులను పంచాయతీ పరిధిలోనే చెల్లించాలి కూడా. ఈ సమయంలో అక్కడి అధికారులకు ఎంత ఫీజుంటుందో సరిగా తెలియదు. చెప్పరు కూడా. పెపైచ్చు చేతులు తడపనిదే ఫైలు ముందుకు జరగని పరిస్థితి’’ అని అప్పా జంక్షన్‌లో పలు ప్రాజెక్ట్‌లు చేపడుతున్న ఓ బిల్డర్ సాక్షి రియల్టీకి చెప్పారు. అక్కడి సెక్రటరీ, సర్పంచి, స్థానిక నాయకులు హెచ్‌ఎండీఏకు ఎంత ఫీజు కట్టామో అంతకు రెట్టింపు ఇవ్వమని నానా రకాలుగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నయా పైసా అవినీతి జరిగినా సహించేది లేదనే సీఎం.. స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ స్థాయిలో స్థిరాస్తి సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. అనుమతి పత్రాలకు సంబంధించిన ఒక కాపీని హెచ్‌ఎండీఏనే నేరుగా గ్రామ పంచాయతీలకూ పంపించాలి. లేకపోతే ఫీజు చెల్లింపులన్నీ హెచ్‌ఎండీఏ పరిధిలోకి తీసుకొచ్చి.. అనుమతి కాపీలను మాత్రమే పంచాయతీకి పంపించే విధానాన్ని తీసుకురావాలి. అప్పుడే అనుమతుల మంజూరులో ఆలస్యం తగ్గుతుంది. బిల్డర్లపై వేధింపులూ తగ్గుతాయి. అధికారుల అవినీతికి ఆస్కారముండదు.
8330/పీ8/పాలసీ/హెచ్/2009 ప్రకారం హెచ్‌ఎండీఏ పరిధిలో డెవలప్‌మెంట్ చార్జీలు వాయిదా పద్దతుల్లో చెల్లించే వీలు కల్పించింది ప్రభుత్వం. కానీ, ప్రస్తుతం హెచ్‌ఎండీఏ అధికారులేం చేస్తున్నారంటే.. చార్జీలన్నీ ఒకేసారి కట్టాల్సిందేనని బలవంతం చేస్తున్నారు. అమ్మకాల్లేక తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న స్థిరాస్తి సంస్థలకు ఇది కాసింత భారమే. అందుకే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి నిర్మాణ రంగానికి ఉపశమనం కలిగించాలని కోరుతున్నాం.

ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది.
కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులోనే ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై అంతస్తులో ఉండడం మేలు. అది కూడా నైరుతీ దిశలోనే ఉండాలి. పెళ్లికాని పిల్లలకు మాత్రం పడక గది నైరుతి దిశలో ఉండకపోవడమే మంచిది. ఇది కుటుంబ సభ్యుల మధ్య అనవసర కలహాలకు దారి తీయవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement