కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు సిద్ధం : కేటీఆర్ | KTR review meeting on heavy rains in GHMC | Sakshi
Sakshi News home page

కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు సిద్ధం : కేటీఆర్

Published Thu, Sep 22 2016 10:48 PM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM

కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు సిద్ధం : కేటీఆర్ - Sakshi

కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు సిద్ధం : కేటీఆర్

హైదరాబాద్‌లో రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షాలతో అంత అందోళన చెందాల్సిన అవసరం లేదని పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం నగరంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల పరిస్థితిపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయిని న‌ర్సింహ్మారెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కమిషనర్ మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రాం మోహన్, ఇతర ఉన్నతాధికారులతో గురువారం రాత్రి దాదాపు గంటసేపు సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో 100 , 24111111 ఎమర్జెన్సీ నంబర్లకు ఫోన్ చేయాలని కేటీఆర్ సూచించారు. కానిస్టేబుల్ నుంచి కమిషనర్ వరకూ ప్రతి ఒక్క పోలీస్ సహాయక చర్యలలో అందుబాటులో ఉంటారని తెలిపారు.

వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, ఇతరత్రా కారణాల వల్ల ఉద్యోగులకు సమస్యలు తలెత్తుతున్న అంశంపై చర్చించారు. ఐటీ కంపెనీలతో చర్చించి సాధ్యమైనంత వరకు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ కు వీలు కల్పించాలని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఐటీ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయని, పరిస్థితులను వారు అర్థం చేసుకోవాలన్నారు. వాతావరణం అనుకూలిస్తే యధావిధిగా పనులు జరుగుతాయని ధీమా వ్యక్తంచేశారు.


పూర్తి స్థాయిలో సన్నద్దంగా ఉన్నాం
సీఎం గంటగంటకు పరిస్థితులపై సమీక్షిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ పర్మిషన్ లేకుండా ఎవరైనా మ్యాన్ హోల్స్ తెరిచినట్లయితే వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేసే అవకాశం ఉందని హెచ్చరించారు.  ప్రజలు సొంతంగా పనుల్లో భాగస్వాములు కావద్దని, ప్రస్తుతం కొందరు మంత్రులు, అధికారులు వర్షాల వల్ల ఎదురవుతున్న సమస్యలను నియంత్రించే పనిలో ఉన్నారని.. అందరం సమిష్టిగా ఈ సమస్యలను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశాం. హుస్సేన్ సాగర్ కు ఇన్ ఫ్లో 4వేల క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో కూడా అదే స్థాయిలో ఉందని, కుంభవృష్టిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను ఖాళీ చేయిస్తున్నామని.. విపత్కర పరిస్థితిని సవాల్ గా స్వీకరిస్తున్నామని చెప్పారు.

భారీ వర్షాల కారణంగా నగరంలో చాలా ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం, లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని శుక్ర, శనివారాల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేట్‌, ప్రభుత్వ విద్యాసంస్థలు, ఇతర విద్యాలయాలకు సీఎం కేసీఆర్ సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

సమీక్షలో పేర్కొన్న మరికొన్ని అంశాలు:

  • ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌, ఆర్‌.ఏ.ఎఫ్ విభాగాల స‌హాయ స‌హ‌కారాల‌ను తీసుకుంటాం.
  • ప్రస్తుత వ‌ర్షాల వ‌ల్ల అధికంగా బేగంపేట‌, టోలీచౌకి, అల్వాల్‌, నిజాంపేట్‌, హ‌కీంపేట్‌ల‌లోని లోత‌ట్టు ప్రాంతాలు ముంపుకు గుర‌య్యే అవ‌కాశం ఉన్నందున ఈ ప్రాంతాల్లో అవ‌స‌ర‌మైతే సైన్యం, ఎన్‌.డి.ఆర్‌.ఎఫ్‌ స‌హాయం తీసుకునేలా ఆదేశాలు.
  • నిరంతరం కురుస్తున్న వ‌ర్షాల వ‌ల్ల లోత‌ట్టు ప్రాంతాల ప్రజ‌ల‌ను వెంట‌నే ఖాళీ చేయించ‌డంతో పాటు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక అధికారిని నియ‌మించి స‌హాయ‌క చ‌ర్యలను ప‌ర్యవేక్షించాల‌ని జోన‌ల్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్లను ఆదేశించాం.
  • వ‌ర‌ద బాదితుల‌కు ఉచితంగా భోజ‌నం అందించ‌డం, ఇతర వ‌స‌తులు క‌ల్పించాల‌ని రెవెన్యూ, జీహెచ్ఎంసి డిప్యూటి క‌మిష‌న‌ర్లకు ఆదేశాలు జారీ.
  • తాత్కాలికంగా కొన్ని ర‌హ‌దారులు దెబ్బతిన‌డం, రోడ్లపై గుంత‌లు ప‌డ‌డం మిన‌హా మ‌రే ఇత‌ర ఇబ్బందులు లేవు.
  • జీహెచ్ఎంసి, జ‌ల‌మండ‌లి, పోలీసు, రెవెన్యూ, అగ్నిమాప‌క త‌దిత‌ర విభాగాల‌న్నీ స‌మ‌న్వయంతో ప‌నిచేస్తున్నాయి.
  • మూసి కాల్వ‌ల ప‌రివాహ‌క ప్రాంతాల‌ను అప్ర‌మ‌త్తం చేశాం.
  •  నేడు 13 పురాత‌న‌, శిథిలావ‌స్థ‌లో ఉన్న భ‌వ‌నాల‌ను కూల్చివేశాం. ప్రస్తుత సీజ‌న్‌లో నేటి వ‌ర‌కు మొత్తం 865 భ‌వ‌నాల‌ను కూల్చివేశాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement